Cricket Bat : బౌండరీలు కొట్టే కొత్త బ్యాట్ తయారు చేస్తున్న కేంబ్రిడ్జి పరిశోధకులు..

Bomb Wood Cricket Bat : క్రికెట్ ఆటకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. క్రికెట్ లో బౌండరి కొట్టినా..సిక్స్ లు కొట్టినా అభిమానులకు పండగే పండగ. కేరింతలో కేకలు వేస్తారు. బ్యాట్స్ మెన్ ను ఎంకరేజ్ చేస్తారు. అటువంటి క్రికెట్ ఆటలో బ్యాట్ ను దేంతో తయారు చేస్తారో తెలుసా? హా ఏముంది? చెక్కతో అని అందరికీ తెలుసు.కానీ క్రికెటర్లు ఆడే బ్యాట్ ను ప్రత్యేకమైన చెట్టు కలప నుండి తయారు చేస్తారు. దాని పేరు విల్లో. వీటిలో రెండు రకాలున్నాయి. ఒకటి. ఇంగ్లీష్ విల్లో రెండు కశ్మీర్ విల్లో. వీటిలో దేని స్పెషాలిటీ దానిదే. కానీ..కేంబ్రిడ్జ్ వర్శిటీ పరిశోధకులు ఓ కొత్త రకం బ్యాట్ ను తయారుచేయటానికి కృషి చేస్తున్నారు. ఆ బ్యాట్ తో కొడితే బంతి బ్యాట్ కు ఎక్కడ తగిలినా బౌండరీ వైపు దూసుకెళుతుందంటున్నారు పరిశోధకులు. చాలా ఏళ్లుగా విల్లో వుడ్‌తోనే బ్యాట్లు తయారు చేస్తున్నారు. మనవాళ్లు ఆ బ్యాటులతోనే ఆటాడుతున్నారు. కానీ విల్లో ఉడ్ కు బదులుగా వెదురును వాడొచ్చని చెబుతున్నారు కేంబ్రిడ్జి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు.

విల్లోతో బ్యాట్ తయారీలో కలప వృథా అవడం ఎక్కువనీ..అదే వెదురుతో తయారుచేస్తే వెదురు చాలా తక్కువ వృథా ఉంటుందంటున్నారు గతంలో థాయ్ లాండ్ అండర్-17 నేషనల్ క్రికెట్ టీమ్ కు ప్రాతినిధ్యం వహించిన కేంబ్రిడ్జి వర్సిటీకి చెందిన డాక్టర్ దర్శిల్ షా. బరువు సమస్యలు కొన్ని ఉన్నప్పటికీ… వాటిని ఫిక్స్‌ చేసుకుంటే ప్రస్తుతం వాడుతున్న విల్లో వుడ్‌ బ్యాట్‌ కంటే బాగుంటుందని తెలిపారు షా.

ఈ కొత్తరకం బ్యాట్ తయారు ఆలోచనకు విల్లో వుడ్‌ లభ్యత కష్టమవ్వటం కూడా ఓ కారణం. విల్లో వుడ్‌ తో బ్యాట్ తయారు చేయాలంటే ఆ చెట్టును 15 ఏళ్ల వయసు ఉండాలి. దాంతోపాటు ఓ బ్యాటు తయారు చేసినప్పుడు 15 నుంచి 30 శాతం ఉడ్ వేస్ట్ అవుతుంది.అదే బాంబూవుడ్‌ (వెదురు కర్ర) వల్ల ఇటువంటి వేస్టేస్ సమస్యలు చాలా తక్కువగా ఉంటుందని దర్శిల్ తెలిపారు. ఏడేళ్లకే వెదురు చెట్టు సిద్ధమవుతాయి. ఇప్పటికే బాంబూ వుడ్‌తో ఓ ప్రోటో టైప్‌ బ్యాటును కూడా సిద్ధం చేసింది షా టీమ్‌. వెదురు స్ట్రిప్‌లను రైజిన్‌తో లేయర్లుగా అతికించి ఈ బ్యాటును తయారు చేస్తారు.

విల్లో వుడ్‌ బ్యాట్‌కు ఏ మాత్రం తీసిపోకుండా బాంబూ బ్యాటు పర్‌ఫార్మెన్స్‌ ఉంటుందనీ..ఇంకా చెప్పాలంటే అంతకుమించి ఉంటుందని అంటున్నారు పరిశోధకులు. ఈ వెదురు బ్యాట్ కు ‘స్వీట్ స్పాట్’ (బంతి బ్యాట్ పై ఎక్కడ తగిలితే అత్యధిక దూరం వెళుతుందో దాన్ని ‘స్వీట్ స్పాట్’ అంటారు) పరిధి చాలా ఎక్కువని, బ్యాట్ లో ఎక్కడ బంతి తగిలినా దూసుకెళుతుందని తెలిపారు. అయితే, ఈ కొత్తరకం బ్యాటు బరువే సమస్యగా మారిందని..బరువు తగ్గించడానికి చర్యలు చేపడుతున్నామని, త్వరలో తేలిక బ్యాటును రూపొందిస్తామని చెబుతున్నారు. వెదురు బ్యాట్ ను అన్ని విధాలా పరీక్షించి క్రికెట్ అధికారుల పరిశీలనకు అప్పగిస్తామని వెల్లడించారు షా. ఒక్కో ఆటగాడు ఒక్కో బరువున్న బ్యాటును వాడుతుంటారు. మరి దీనికి క్రికెట్‌ నిపుణులు ఏమంటారో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు