Pakistan’s Economic Crisis : పాకిస్థాన్ ఇక మారదా..? పీకల్లోతు అప్పులతో అల్లాడుతోంది!

Pakistan's Economic Crisis : ఏడున్నర దశాబ్దాల స్వాతంత్ర్యంలో భారత్ ఎలా ఎదిగిందో.. పాకిస్థాన్ ఎలా అధః పాతాళానికి పడిపోయిందో ఆ నేత వ్యాఖ్యలే నిదర్శనం.

Pakistani Economic Crisis

Pakistan’s Economic Crisis : భారత్ చంద్రునిపై అడుగుపెడుతోంది.. అదే సమయంలో పాకిస్థాన్‌లో చిన్నారులు కాలవల్లో పడి మరణిస్తున్నారు. భారత్, పాకిస్థాన్ స్థితిగతులపై ఈ వ్యాఖ్యలు చేసింది మన జాతీయవాదులో లేక అంతర్జాతీయంగా భారత్‌కు మద్దతు పలికే దేశాలకు చెందిన వారే కాదు. తమ దేశం దీనస్థితిపై తమ పార్లమెంట్‌లో స్వయంగా ఓ పాకిస్థానీ నేత వ్యక్తంచేసిన ఆందోళన. ఏడున్నర దశాబ్దాల స్వాతంత్ర్యంలో భారత్ ఎలా ఎదిగిందో.. పాకిస్థాన్ ఎలా అధః పాతాళానికి పడిపోయిందో ఆ నేత వ్యాఖ్యలే నిదర్శనం. దేశం దుర్భరస్థితిపై అంతర్గతంగానే ఇంత ఆవేదన వ్యక్తమవుతోంటే ప్రభుత్వాలు మాత్రం ప్రజల జీవితాలపై దృష్టిపెట్టకుండా యుద్ధసన్నాహక చర్యలతో పొద్దుపుచ్చుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Read Also : ICMR Guidelines : ఆహార అలవాట్లపై ICMR మార్గదర్శకాలు.. ఎప్పుడు.. ఎలా? ఏమి తినాలి?

దేశ జీడీపీలో 42 శాతానికి సమానం :
పాకిస్థాన్‌ అప్పు 124.5 బిలియన్ డాలర్లు. ఆ దేశ జీడీపీలో ఇది 42 శాతానికి సమానం. అయినప్పటికీ పాకిస్థాన్‌ ఆయుధాల దిగుమతులపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. మిలటరీ సామర్థ్యాలను పెంచుకోవడమే ప్రాధాన్యతగా పనిచేస్తోంది. ఎప్పటిలానే చైనాపై ఆధారపడుతోంది. అనేక రకాల ఆయుధాలను ఆ దేశం నుంచి తెప్పించుకుంటోంది స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అధ్యయనం ప్రకారం 2019 నుంచి 2023 మధ్య పాకిస్థాన్ దిగుమతి చేసుకున్న ఆయుధాలలో 82 శాతం చైనా నుంచి వచ్చినవే. ఫైటర్ జెట్లు, యుద్దవిమానాలు, మిస్సైల్ టెక్నాలజీ, డ్రోన్లు వంటివి పాకిస్థాన్‌కు అందిస్తోంది చైనా. పాకిస్థాన్ నావికా రంగ సామర్థ్యం పెరిగేలా హ్యాంగర్ క్లాస్ సబ్‌మెరైన్లు కూడా అందిస్తోంది. పాకిస్థాన్, చైనా మధ్య మిలటరీ సంబంధాలు…ఎవ్వరూ విడదీయలేనంత బలంగా ఉన్నాయి. మరి ఇంత ఆత్మీయత ఉన్న చైనా పాకిస్థాన్ ఆర్థిక దుర్బర పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు ఎలాంటి సాయం చేస్తోందన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.

మణిశంకర్ వ్యాఖ్యలకు ప్రధాని మోదీ కౌంటర్ :
పాకిస్థాన్ ప్రజలు ఆహార పదార్థాలు, మందులు సరైన స్థాయిలో దొరక్క ఏడాదిన్నరగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం…ఇలా చైనా నుంచి, ఇతర దేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడంపైనే దృష్టిపెడుతోంది. పాకిస్థాన్ నిజమైన శక్తి మిలటరీలోనే దాగి ఉందన్నది ఆ దేశం ఉద్దేశం. కానీ పాకిస్థాన్ రక్షణరంగానికి ఈ స్థాయిలో కేటాయింపులు జరపడంపై IMFతో పాటు అనేక అంతర్జాతీయ వ్యవస్థలూ అసంతృప్తి వ్యక్తంచేస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించే క్రమంలో ప్రధాని మోదీ.. పాకిస్థాన్ పరిస్థితిని వివరించారు. పాక్ దగ్గర అణుబాంబు ఉంది కాబట్టి మనం ఆ దేశానికి భయపడాలని మణిశంకర్ చేసిన వ్యాఖ్యలకు ప్రధాని మోదీ కౌంటర్ ఇచ్చారు. పాకిస్థాన్ తన దగ్గర ఉన్న అణుబాంబును, ఆయుధాలను కొనేవారి కోసం వెతుకుతోందని, కానీ వాటి నాణ్యత తెలిసిన వారంతా అవి కొనడానికి ముందుకు రావడం లేదని ప్రధాని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి ఎలా దిగజారిందో పరోక్షంగా వివరించారు

చిన్నారుల మరణాలపై ముస్తఫా ఆవేదన :
పాకిస్థాన్ దయనీయ స్థితిపై ఆ దేశ ఎంపీ, ముత్తాహిదా ఖ్వామి మూవ్‌మెంట్-పాకిస్థాన్ పార్టీ నేత సయ్యద్ ముస్తఫా కమల్ పార్లమెంట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. తెరిచి ఉన్న కాల్వల్లో పడి కరాచీలో చిన్నారులు మరణిస్తున్నారని ముస్తఫా ఆవేదన వ్యక్తంచేశారు. పాకిస్థాన్‌కు కరాచీ 68శాతం ఆదాయం అందిస్తోందని, కానీ కరాచీలో హృదయవిదారక పరిస్థితులు ఉన్నాయని ఆయన అన్నారు. కోటీ 62లక్షలమంది కరాచీ చిన్నారులు స్కూల్‌కు వెళ్లడం లేదని, 70 దేశాల జనాభా కన్నా ఈ సంఖ్య ఎక్కువని.. చెప్పడం ద్వారా పాకిస్థాన్ ప్రజల జీవన ప్రమాణాలు ఏ స్థాయిలో పడిపోయాయో కుండ బద్ధలు కొట్టినట్టు వివరించారు.

పీకల్లోతు అప్పులు.. ఆకాశాన్ని తాకుతున్న ధరలు :
పీకల్లోతు అప్పులు, ఆకాశాన్ని తాకుతున్న ధరలతో దేశం అల్లాడుతున్న సమయంలోనూ పాకిస్థాన్ ప్రభుత్వం మెరుగైన పాలనపై దృష్టిపెట్టడం లేదు. రక్షణరంగంలో కొన్ని కేటాయింపులు తగ్గించి.. మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టిపెడితే.. ప్రజలకు ఉపాధి లభిస్తుంది. IMF పొడిగించాల్సిన సాయం కోసం ఎదురుచూడకుండా దేశంలో తక్షణం నిత్యావసరాల ధరలను అదుపుచేయవచ్చు. అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించడం ద్వారా ప్రజల తలసరి ఆదాయం పెంచొచ్చు. కానీ ఆర్మీ చెప్పినట్టల్లా ఆడే కీలుబొమ్మ ప్రభుత్వాలు.. రక్షణ కేటాయింపులతో మిలటరీ పెద్దల మనసు చూరగొనే ప్రయత్నాలు చేస్తున్నాయి తప్ప.. ప్రజల గురించి కనీస మానవతా దృక్పథంతో కూడా ఆలోచించడం లేదు.

Read Also : Pakistani Economic Crisis : అప్పుల్లో నిండా మునిగిన పాకిస్థాన్‌.. ఆకాశాన్నంటిన నిత్యావసర ధరలు

ట్రెండింగ్ వార్తలు