Burqa In Parliament: పార్లమెంటులో కలకలం.. బురఖా ధరించి వచ్చిన సెనేటర్.. ఎందుకంటే..
బురఖా ధరించి సభలోకి అడుగుపెట్టడంతో ఇతర సభ్యులు మండిపడ్డారు. హాన్సన్ పై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు.
Burqa In Parliament: ఆస్ట్రేలియా పార్లమెంటులో కలకలం రేగింది. ఓ సెనేటర్ బురఖా ధరించి పార్లమెంటుకు వచ్చారు. దాంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. సెనేటర్ పౌలిన్ హాన్సన్ బురఖా వేసుకుని పార్లమెంటుకు వచ్చారు. బహిరంగ ప్రదేశాల్లో బురఖా ధరించడంపై నిషేధం విధించాలని పౌలిన్ హాన్సన్ డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా రాజకీయ మద్దతు కోసం బుర్ఖా ధరించి సభకు వచ్చారు. కాగా, దీనిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ముస్లిం సెనేటర్లు ఈ చర్యను తప్పుపట్టారు. జాత్యహంకార ఆరోపణలు చేశారు.
ఆస్ట్రేలియాలోని బహిరంగ ప్రదేశాల్లో బుర్ఖాలు, ముఖాలను పూర్తిగా కప్పి ఉంచే వాటిని నిషేధించే బిల్లును ప్రవేశపెట్టడానికి అనుమతి నిరాకరించారు. ఆ కాసేపటికే హాన్సన్ ఇలా బుర్ఖాను ధరించారు. బహిరంగ ప్రదేశాల్లో బురఖాలు ధరించడాన్ని నిషేధించాలని హాన్సన్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. బురఖా వేసుకుని పార్లమెంటుకు రావడం ఇది రెండోసారి.
బురఖా ధరించి సభలోకి అడుగుపెట్టడంతో ఇతర సభ్యులు మండిపడ్డారు. హాన్సన్ పై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. కార్యకలాపాలు నిలిపివేశారు.
కాగా, హాన్సన్ చర్యను ఇతర సెనేటర్లు తప్పుపట్టారు. ఇది జాత్యహంకార చర్య అని న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రానికి చెందిన గ్రీన్స్ సెనేటర్ మెహ్రీన్ ఫరూకి అన్నారు. పశ్చిమ ఆస్ట్రేలియా రాష్ట్రానికి చెందిన స్వతంత్ర సెనేటర్ ఫాతిమా పేమాన్ ఈ చర్యను అవమానకరంగా అభివర్ణించారు. సెంటర్ లెఫ్ట్ లేబర్ ప్రభుత్వ నాయకురాలు పెన్నీ వాంగ్, ప్రతిపక్ష సంకీర్ణానికి డిప్యూటీ సెనేట్ నాయకురాలు అన్నే రస్టన్ ఇద్దరూ హాన్సన్ చర్యను ఖండించారు.
”ఇది ఆమోదయోగ్యం కాదు. హాన్సన్ సభలో ఉండేందుకు అర్హుత కోల్పోయారు. హాన్సన్‌ను సస్పెండ్ చేయాలని” అంటూ పెన్నీ వాంగ్ తీర్మానాన్ని ప్రతిపాదించారు. అయితే, హాన్సన్ సభ నుంచి వెళ్లిపోవడానికి నిరాకరించడంతో సభలో కార్యకలాపాలు నిలిపివేయబడ్డాయి.
క్వీన్స్‌ల్యాండ్‌కు సెనేటర్‌గా ఉన్న హాన్సన్.. ఆసియా నుండి వలస వచ్చే వారి పట్ల వ్యతిరేకత కనబరుస్తున్నారు. ఇక, ఇస్లామిక్ దుస్తులకు వ్యతిరేకంగా చాలా కాలంగా ప్రచారం చేశారు. ఆమె గతంలో (2017) పార్లమెంటుకు బుర్ఖా ధరించి వెళ్లారు. హాన్సన్ ప్రాతినిధ్యం వహిస్తున్న వన్ నేషన్ పార్టీకి సెనేట్‌లో నాలుగు సీట్లు ఉన్నాయి.
”బురఖాను నిషేధించకపోతే మన జాతీయ భద్రత ప్రమాదంలో పడే ముప్పు ఉంది. నేను బుర్ఖా ధరించకూడదనుకుంటే దాన్ని నిషేధించండి” అని హాన్సన్ డిమాండ్ చేశారు.
Also Read: ఉన్నవి చాలవన్నట్టు మరో రెండు దేశాల ఫైట్.. చైనా, జపాన్ తగ్గేదేలే.. వీళ్లిద్దరి గొడవ ఏంటంటే..
