BRS: కారు ఓవర్ లోడ్..! శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది? టికెట్ దక్కేదెవరికి?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవలే బీజేపీని వీడి కారెక్కిన మాజీ కార్పొరేటర్ నవతా రెడ్డి నివాసానికి వెళ్లడంతో బీఆర్ఎస్ పార్టీలో శేరిలింగంపల్లి నియోజకవర్గంపై జోరుగా చర్చ మొదలైంది.
Brs Representative Image (Image Credit To Original Source)
- ఇంట్రెస్టింగ్గా శేరిలింగంపల్లి బీఆర్ఎస్ టికెట్ రేసు
- గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన గాంధీ జంప్
- టికెట్ ఆశలతో వరుసపెట్టి కారుక్కుతున్న లీడర్లు
BRS: ఆ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్లో ఇబ్బడిముబ్బడిగా కారెక్కేస్తున్నారు. అధికార కాంగ్రెస్ నుంచి మొదలు బీజేపీ వరకు అన్ని పార్టీల నుంచి గులాబీ కండువా కప్పుకుంటున్నారు. దీంతో ఆ సెగ్మెంట్లో కారు ఓవర్ లోడ్ అయ్యిందన్న చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన అరికెపూడి గాంధీ కాంగ్రెస్‌లో చేరిపోవడంతో ఇప్పుడు వచ్చిన వాళ్లంతా టికెట్‌పై ఆశలు పెట్టుకుంటున్నారట. అసలు శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది? టికెట్ దక్కేదెవరికి?
జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్ హైకమాండ్. లీడర్లతో పాటు క్యాడర్‌ను బలోపేతం చేసుకునే పనిలో పడింది. ఈ క్రమంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులను, కార్యకర్తలను భారీగా పార్టీలో చేర్చుకుంటోంది గులాబీ పార్టీ. గ్రేటర్ పరిధిలోని శేరిలింగంపల్లి నియోజకవర్గంపై అయితే కారు పార్టీ ఇంకింత కాన్సంట్రేషన్ పెడుతోంది. కారు పార్టీ గుర్తుపై గెలిచిన అరికెపూడి గాంధీ అధికార కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అక్కడ నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు బీఆర్ఎస్ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి సారించింది.
పాత, కొత్త నాయకుల మధ్య కొరవడిన సమన్వయం..!
శేరిలింగంపల్లిలో బీఆర్ఎస్ ఇంచార్జ్ బాధ్యతలను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు అప్పగించింది అధిష్టానం. మాధవరం తన నియోజకవర్గం కూకట్పల్లి అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తూనే..ఇంచార్జ్‌గా ఉన్న శేరిలింగంపల్లిపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఇతర పార్టీల నుంచి నేతలు, కార్యకర్తలను భారీగా బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొస్తూ..వరుసగా జాయినింగ్లు చేపిస్తున్నారు. రాష్ట్రంలోని ఏ నియోజకవర్గంలో లేనన్ని చేరికలు బీఆర్ఎస్లో జరుగుతున్నాయన్న చర్చ ఉంది. ఇంతవరకు బాగానే ఉన్నా..ఇప్పటికే పార్టీలో ఉన్న వాళ్లు, కొత్తగా పార్టీలో చేరుతున్న వాళ్లు పెరిగిపోవడంతో కొంత గందరగోళ పరిస్థితి నెలకొందన్న టాక్ వినిపిస్తోంది. ఉద్యమకాలం నుంచి బీఆర్ఎస్లో ఉన్న నేతలు, క్యాడర్‌కు కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్లతో సమన్వయం కొరవడిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే టికెట్ ఆశించే వాళ్లు అంతకంతకు పెరిగిపోతున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకు పార్టీలో చేరిన నేతలంతా టికెట్ ఆశల్లో భాగంగానే గులాబీ కండువా కప్పుకున్నట్లు ఇన్ సైడ్ టాక్ నడుస్తోంది. అయితే ఎన్నిక ఏదైనా శేరిలింగంపల్లిలో గెలుపు బీఆర్ఎస్దే అనే ఊపు ఉండేది. మళ్లీ అలాంటి జోష్ రావాలంటే నియోజకవర్గానికి పూర్తిస్థాయి ఇంచార్జ్‌ను నియమించాలన్న డిమాండ్స్ పార్టీలో వ్యక్తమవుతున్నాయట. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవలే బీజేపీని వీడి కారెక్కిన మాజీ కార్పొరేటర్ నవతా రెడ్డి నివాసానికి వెళ్లడంతో బీఆర్ఎస్ పార్టీలో శేరిలింగంపల్లి నియోజకవర్గంపై జోరుగా చర్చ మొదలైంది.
నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన ఆమెకు పార్టీ అంత ప్రాధాన్యం ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమై ఉంటుందని ఆరా తీస్తున్నారట నేతలు. పార్టీలో ముందు నుంచి ఉన్న వారి సంగతేంటన్న చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. మాజీ కార్పొరేటర్, నియోజకవర్గంలో సీనియర్ నాయకుడు సాయిబాబ తనకు ఇంచార్జ్‌గా బాధ్యతలు ఇస్తారని ఆశలు పెట్టుకున్నారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న తనకు అవకాశం వస్తుందని ఆయన భావిస్తున్నారు.
టికెట్ రేసులో చిర్రా రవీందర్, నవతా రెడ్డి, సింధు..!
మరోవైపు తెలంగాణ ఉద్యమకారుడు చిర్రా రవీందర్ యాదవ్ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పార్టీ ఇచ్చే కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉంటారన్న అభిప్రాయాలున్నాయి. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పార్టీలో పని చేస్తున్న చిర్రా రవీందర్ యాదవ్ కూడా టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. మాజీ కార్పొరేటర్లు నవతా రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ తమకే వస్తుందని చెప్పుకుంటున్నారట. దీంతో తమను నియోజకవర్గంలో నడిపించే నాయకుడు ఎవరనేది తెలియక బీఆర్ఎస్ క్యాడర్ అయోమయంలో ఉందట. బీఆర్ఎస్ అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తుందో? మిగతా ఆశావహులను ఎక్కడ అడ్జస్ట్ చేస్తారో చూడాలి.
Also Read: ఇక కాంగ్రెస్‌తో కటీఫేనా? జీవన్‌రెడ్డి దారెటు.. నెక్స్ట్ స్టెప్ ఎటువైపు..
