Israel Attack: హిజ్బుల్లా చీఫ్ ను టార్గెట్ చేసిన ఇజ్రాయల్.. బీరుట్ పై భీకర దాడి..

యుద్ధ విమానాల గర్జనలు, భారీ పేలుడు శబ్దాలతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ప్రాణ భయంతో భవనాల నుండి బయటకు పరుగులు తీశారు.

Israel Attack: హిజ్బుల్లా చీఫ్ ను టార్గెట్ చేసిన ఇజ్రాయల్.. బీరుట్ పై భీకర దాడి..

Updated On : November 23, 2025 / 10:13 PM IST

Israel Attack: ఇజ్రాయల్ మరోసారి దాడికి దిగింది. బీరుట్ లో అరుదైన వైమానిక దాడి చేసింది. మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా చీఫ్-ఆఫ్-స్టాఫ్‌ లక్ష్యంగా మెరుపు దాడికి దిగింది. రాజధాని దక్షిణ శివారు ప్రాంతంపై ఈ దాడి చేసింది. ఇది ఇరాన్-మిలీషియా బలమైన కోటగా పిలవబడే జిల్లా. ఈ దాడి స్థానికులను భయాందోళకు గురి చేసింది.

ఇజ్రాయెల్ రక్షణ దళాలు హిజ్బుల్లా చీఫ్-ఆఫ్-స్టాఫ్‌పై దాడి చేశాయని ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం తెలిపింది. లక్ష్యంగా ఉన్న సీనియర్ కమాండర్ అలీ తబ్తాబాయి చంపబడ్డాడా లేదా అనేది అది నిర్ధారించ లేదు. ఈ ఆపరేషన్ గురించి ఇజ్రాయెల్‌కు చెందిన ఒక అధికారి వివరణ ఇచ్చారు. తబ్తబాయి లక్ష్యంగా దాడి జరిగిందన్నారు. 2016లో US ట్రెజరీ అతడిని కీలకమైన హిజ్బుల్లా సైనిక నాయకుడిగా ప్రకటించింది. అతని గురించి సమాచారం ఇచ్చిన వారికి 5 మిలియన్ డాలర్ల బహుమతిని అనౌన్స్ చేసింది.

ఈ దాడిపై ఇజ్రాయల్ ప్రధాని స్పందించారు. ”బీరూట్ నడిబొడ్డున, ఐడిఎఫ్ (ఇజ్రాయెల్ మిలిటరీ) ఉగ్రవాద సంస్థ నిర్మాణం, తిరిగి ఆయుధ సమీకరణకు నాయకత్వం వహిస్తున్న హిజ్బుల్లా చీఫ్ ఆఫ్ స్టాఫ్ పై దాడి చేసింది” అని నెతన్యాహు తెలిపారు.

యుద్ధ విమానాల గర్జనలు, భారీ పేలుడు శబ్దాలతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ప్రాణభయంతో భవనాల నుండి బయటకు పరుగులు తీశారు. ఈ దాడిలో ఐదుగురు మరణించారని, దాదాపు 24మంది గాయపడ్డారని అధికార వర్గాలు తెలిపాయి.

గత సంవత్సరం నుండి ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్‌లో వైమానిక కార్యకలాపాలను ముమ్మరం చేసింది. సరిహద్దు వెంబడి హిజ్బుల్లా తన సైనిక మౌలిక సదుపాయాలను పునరుద్ధరించకుండా నిరోధించడమే తమ లక్ష్యం అని పేర్కొంది. గత రెండు సంవత్సరాలుగా ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో మాజీ హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లా, అనేక మంది సీనియర్ కమాండర్లు, 5వేల మంది ఫైటర్లు మరణించారు.

ఆదివారం దాడికి ముందు, నెతన్యాహు తన మంత్రివర్గంతో కీలక వ్యాఖ్యలు చేశారు. హిజ్బుల్లా మనల్ని బెదిరించే సామర్థ్యాన్ని తిరిగి పొందకుండా నిరోధించడానికి అవసరమైన ప్రతిదాన్ని మేము చేస్తూనే ఉంటామని చెప్పారు.

అమెరికా మద్దతుతో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ హిజ్బుల్లా తన ఆయుధ సామాగ్రిని పునర్నిర్మించుకుందని, ఫైటర్లను తిరిగి మోహరిస్తోందని ఇజ్రాయెల్ ఆరోపించింది.

శక్తివంతమైన ఉగ్రవాద సంస్థను నిరాయుధీకరణ చేయాలని లెబనాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా ఒత్తిడి పెంచుతున్నాయి. లెబనాన్ సైన్యం సెప్టెంబర్‌లో ప్రభుత్వం ఆమోదించిన ప్రణాళికను జారీ చేసింది. ఇది దేశవ్యాప్తంగా హిజ్బుల్లాను నిరాయుధీకరణ చేస్తుంది. హిజ్బుల్లా దక్షిణ లెబనాన్‌లో తన సైనిక సామర్థ్యాలను పునర్నిర్మించడానికి ప్రయత్నిస్తోందని ఇజ్రాయెల్ ఆరోపించగా.. లెబనీస్ ప్రభుత్వం ఆ వాదనలను ఖండించింది.