కేబినెట్ భేటీకీ ఈసీ గ్రీన్ సిగ్నల్.. కండీషన్స్ అప్లయ్

ఆ తర్వాత ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేబినెట్ భేటీకి ఎన్నికల సంఘం పర్మిషన్ ఇచ్చింది.

Telangana Cabinet Meeting : తెలంగాణ మంత్రివర్గ సమావేశానికి ముహూర్తం ఖరారైంది. రేపు (మే 20) మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ మేరకు సీఎం శాంతికుమారి ప్రకటన జారీ చేశారు. తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి ఇవ్వడంతో రేపు మధ్యాహ్నం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. శనివారమే మంత్రివర్గం భేటీ అవ్వాల్సి ఉంది. అయితే, ఎన్నికల కోడ్ కారణంగా మంత్రివర్గ సమావేశానికి ఈసీ అనుమతి ఇవ్వకపోవడంతో వాయిదా పడింది.

ఆ తర్వాత ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేబినెట్ భేటీకి ఎన్నికల సంఘం పర్మిషన్ ఇచ్చింది. కొన్ని షరతులు విధించింది. ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే జూన్ 4వ తేదీలోపు చెయ్యాల్సిన అత్యవసర విషయాలను మాత్రమే చర్చించాలంది. ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీ వంటి అంశాలపై చర్చించొద్దని తెలిపింది.

కేబినెట్ భేటీ నిర్వహణ కోసం ప్రభుత్వం రెండు రోజుల నుంచి వేచి చూస్తోంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండా కేబినెట్ భేటీ నిర్వహించడానికి వీలుండదు. ఈ క్రమంలో ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు మంత్రివర్గం సమావేశానికి ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. రేపు మధ్యాహ్నం కేబినెట్ భేటీ కానుంది. కొన్ని షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది ఈసీ. రైతు రుణమాఫీ, ఉమ్మడి రాజధాని, రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తైన సందర్భంగా ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలపై ఎట్టి పరిస్థితుల్లో మంత్రివర్గ సమావేశంలో చర్చించడానికి వీల్లేదంది. అత్యవసర అంశాలను మాత్రమే డిస్కస్ చేయాలని ఈసీ కండీషన్ పెట్టింది.

ఖరీఫ్ పంట సీజన్ కు సంబంధించిన పంట ప్రణాళికపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే ధాన్యం కొనుగోలుకు సంబంధించి చర్చించే అవకాశం ఉంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ కు సంబంధించి వచ్చిన రిపోర్టుపై మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది.

Also Read : ఈసారి మోసపోతే తప్పు మనదే, ఆలోచించి ఓటు వేయండి- కేటీఆర్

ట్రెండింగ్ వార్తలు