Mahinda Rajapaksa Banned : దేశం విడిచిపోకుండా మాజీ ప్రధానిపై నిషేధం, శ్రీలంక కోర్టు సంచలన తీర్పు

తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఓవైపు ప్రజల ఆందోళనలు, నిరసనలతో లంక అట్టుడుకుతోంది. మరోవైపు..(Mahinda Rajapaksa Banned)

Mahinda Rajapaksa Banned : తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఓవైపు ప్రజల ఆందోళనలు, నిరసనలతో లంక అట్టుడుకుతోంది. మరోవైపు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులపై హింసాత్మక దాడుల కేసులో శ్రీలంక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మాజీ ప్రధాని మహింద రాజపక్స, ఇతర మిత్రపక్ష నేతలు దేశం విడిచిపోకుండా కోర్టు నిషేధం విధించింది. కోర్టు నిషేధం విధించిన వారిలో రాజపక్స కుమారుడు నమల్ రాజపక్సతో పాటు మరో 15 మంది మిత్రపక్ష నేతలు ఉన్నారు.

రాజపక్సకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. అయితే, రాజపక్సను, ఆయన అనుచరులను అరెస్ట్ చేయాలన్న పిటిషనర్ విన్నపాన్ని న్యాయమూర్తి తోసిపుచ్చారు. తమకు అనుమానాస్పదంగా అనిపిస్తే దేశంలో ఎక్కడైనా అరెస్ట్ చేసే అధికారాలు పోలీసులకు ఉన్నాయని స్పష్టం చేశారు.

ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ దేశంలో నిరసనలు, హింసాత్మక ఘటనలు జరుగుతుండటంతో వారు దేశం విడిచి వెళ్లకుండా కోర్టు ఈ నిషేధం విధించింది.

Sri lanka crisis: వారం రోజుల్లో శ్రీలంకలో కీలక మార్పులు.. అధ్యక్షుడు గొటబయ సంచలన వ్యాఖ్యలు..

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఏర్పడ్డప్పటి నుంచి ప్రధానమంత్రి, అధ్యక్షుడు, ఇతర మంత్రులు రాజీనామాలు చేయాలని ప్రజలు శాంతియుత నిరసనలు చేస్తున్నారు. అప్పటి ప్రధాని మహింద రాజపక్స నివాసం ఎదుట కూడా ఈ ప్రదర్శనలు జరిగాయి. అయితే, సోమవారం రాజధాని కొలంబోలో శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై సామూహిక దాడులకు పాల్పడిన ఘటనలపై దర్యాప్తు జరపాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఈ హింసాకాండలో అధికార పార్టీ ఎంపీ సహా తొమ్మిది మరణించారు. అధికార పార్టీ ఎంపీలు, మిత్ర పక్ష పార్టీల నేతల ఇళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు.

Former Sri Lanka PM Mahinda Rajapaksa Banned From Leaving Country

ఈ పరిణామాల నేపథ్యంలో రాజపక్స, ఆయన మద్దతుదారుల అరెస్ట్‌ కోసం వారెంట్‌ జారీ చేయాలని కోరుతూ శ్రీలంక కోర్టులో ఒక పిటిషన్‌ దాఖలైంది. అయితే ఈ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.

కాగా, ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను అణిచివేసేందుకు సోమవారం రాజపక్స మద్దతుదారులైన సుమారు మూడు వేల మందిని బస్సుల్లో నిరసన జరుగుతున్న ప్రాంతానికి తరలించారు. దీంతో ప్రశాంతంగా నిరసనలు చేస్తున్న వారిపై రాజపక్స మద్దతుదారులు దాడులు చేశారు. ప్రభుత్వ భద్రతా సిబ్బంది కూడా నిరసనకారులపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా తలెత్తిన హింసాకాండలో బౌద్ధ సన్యాసులు, చర్చి ఫాదర్లతో సహా సుమారు 225 మంది గాయపడ్డారు.

Sri Lanka Crisis: శ్రీలంకలో ఆందోళనకారులపై ‘షూట్ ఎట్ సైట్’ ఆదేశాలు ఉన్నాయి: ఆదేశ రక్షణశాఖ

ప్రజల నుంచి తీవ్ర నిరసన రావడంతో మహింద రాజపక్స ఎట్టకేలకు ప్రధాని పదవికి రాజీనామా చేశారు. దేశంలో హింసాత్మక ఆందోళనలు చెలరేగిన నేపథ్యంలో ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేసి నావల్ బేస్‌లో తలదాచుకుంటున్నారు. కాగా, శ్రీలంక నూతన ప్రధాని కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. రానిల్ విక్రమ్ సింఘే శ్రీలంక ప్రధానిగా ప్రమాణం చేయబోతున్నట్టు సమాచారం.

రానిల్ విక్రమ్ సింఘే ఇది వరకు నాలుగు సార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గత ప్రభుత్వంలో మైత్రిపాల సిరిసేన ఆయనను ప్రధాని పదవి నుంచి తొలగించారు. ఆ తర్వాత మళ్లీ ప్రధానిగా స్వీకరించారు. కానీ, గత పార్లమెంటు ఎన్నికల్లో రానిల్ విక్రమ్ సింఘే పార్టీ యునైటెడ్ నేషనల్ పార్టీ దారుణంగా తుడిచిపెట్టుకుపోయింది. 225 స్థానాలున్న పార్లమెంటు ఎన్నికల్లో దేశంలోనే పురాతనమైన ఈ పార్టీ కేవలం ఒకే సీటు గెలిచింది. గెలిచింది కూడా ఆ పార్టీ చీఫ్ రానిల్ విక్రమ్ సింఘే మాత్రమే. ఇప్పుడా పార్టీ ప్రతిపక్షంలో ఉంది. కానీ, దేశంలోని తీవ్ర పరిస్థితుల నేపథ్యంలో ఆయనకు ప్రధానిగా బాధ్యతలు చేపట్టే బంపర్ ఆఫర్ వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు