Chandu Pavithra Jayaram : గుండెలు పిండే విషాదం.. కలిచివేస్తున్న సీరియల్ నటులు పవిత్ర, చందుల మరణం

"రెండు రోజులు ఆగు.." అంటూ ఆ రోజే ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టాడు చందు. అలా ప్రతి రోజూ పవిత్రతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పోస్టులు పెడుతూ కుమిలిపోయేవాడు.

Chandu Pavithra Jayaram : బుల్లితెర నటుడు చందు మరణం పలువురిని కలిచివేస్తోంది. తన ప్రియురాలు, సహనటి పవిత్ర జయరాం మరణాన్ని తట్టుకోలేని చందు.. తన ప్రాణాన్ని తీసుకోవడం గుండెలను పిండేస్తోంది. ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్న చందు, పవిత్ర.. 5 రోజుల వ్యవధిలో మరణించడంతో ఇండస్ట్రీలో విషాదం అలుముకుంది.

చందు, పవిత్రల బంధాన్ని తెంపిన రోడ్డు ప్రమాదం..
త్రినయని సీరియల్‌ నటులు చందు, పవిత్రల మరణం తెలుగు చిత్రసీమలో తీవ్ర విషాదాన్ని నింపింది. సీరియల్‌లో భార్యాభర్తలుగా నటించిన చందు, పవిత్ర.. నిజ జీవితంలోనూ తమ బంధాన్ని కొనసాగించారు. ఆరేళ్ల నుంచి ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఇప్పటికే పెళ్లి అయిన చందు.. పవిత్రతో సాన్నిహిత్యం ప్రేమగా మారడంతో ఆమెను వదలలేకపోయాడు. భార్య పిల్లలకు దూరంగా ఉంటూ పవిత్రతోనే ఐదారేళ్లుగా కలిసి జీవిస్తున్నాడు.

తమ మధ్య ఉన్న అన్ అఫీషియల్ బంధాన్ని త్వరలోనే అఫీషియల్‌గా అనౌన్స్ చేద్దామని ప్లాన్ చేసుకునేలోగా మృత్యువు ఇద్దరినీ కబళించింది. మహబూబ్‌నగర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం వారి బంధాన్ని తెంపేసింది. ప్రియురాలు పవిత్ర ఎడబాటును తట్టుకోలేని చందు చివరికి తన ప్రాణాన్ని తీసుకున్నాడు.

పవిత్ర మరణాన్ని తట్టుకోలేకపోయిన చందు..
మే 12వ తేదీ ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంతో చందు, పవిత్ర మధ్య బంధం తెగిపోయింది. మహబూబ్‌నగర్‌ వద్ద చందు, పవిత్ర ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనలో చందుకు తీవ్ర గాయాలు అవ్వగా, ఆ దృశ్యాన్ని చూసి గుండెపోటుతో పవిత్ర మరణించింది. పవిత్ర మృతితో శోకసంద్రంలో మునిగిపోయిన చందూ.. దగ్గరుండి ఆమె అంత్యక్రియలను జరిపించాడు. తన కళ్లెదుటే ప్రియురాలు మరణించడాన్ని తట్టుకోలేని చందు.. అప్పటి నుంచి తీవ్ర మనో వేదనకు లోనయ్యాడు. పవిత్రతో తన బంధాన్ని గుర్తుచేసుకుంటూ.. ప్రియురాలి ఎడబాటును భరించలేనంటూ తన ఇన్‌స్టాలో పోస్టులు పెట్టేవాడు.

పవిత్ర పిలుస్తోంది అంటూ..
పవిత్ర మరణం తనను ఎంతగా బాధపెట్టింది ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉన్నాడు చందు. రెండు రోజుల కిందట పవిత్ర పుట్టినరోజు కావటంతో.. చందు మరింత డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. “రెండు రోజులు ఆగు..” అంటూ ఆ రోజే ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టాడు చందు. అలా ప్రతి రోజూ పవిత్రతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పోస్టులు పెడుతూ కుమిలిపోయేవాడు. చందును ఓదార్చేందుకు స్నేహితులు ప్రయత్నించినప్పటికీ కోలుకోలేకపోయాడు. పవిత్ర చనిపోలేదని.. తమ మధ్యే ఉందంటూ చెప్పుకొచ్చిన చందు.. తాను కేవలం సీరియల్‌లో పవిత్రకు భర్తగా నటించలేదని.. పవిత్ర తన జీవితమంటూ ఎమోషనల్ అయ్యేవాడు. చివరికి పవిత్ర పిలుస్తోందంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసి ప్రాణాన్ని తీసుకున్నాడు.

ఐదేళ్ల నుంచి భార్య, పిల్లలకు దూరం..
చందుకు 2015లోనే వివాహమైంది. 2015లో శిల్పను ప్రేమ వివాహం చేసుకున్నాడు చందు. తెలుగులో త్రినయని, కార్తీక దీపం, రాధమ్మ పెళ్లి వంటి సీరియల్స్‌లో నటించి మెప్పించాడు. ప్రస్తుతం కార్తీక దీపం-2 సీరియల్‌లోనూ నటిస్తున్నాడు. మరోవైపు.. పవిత్రకు కూడా పెళ్లి కాగా.. కొన్నేళ్లుగా భర్త నుంచి దూరంగా ఉంటోంది. పవిత్రకు 22 ఏళ్ల కుమారుడు, 19 ఏళ్ల కూతురు కూడా ఉన్నారు. ఐదేళ్లుగా పవిత్రతో చందు సహజీవనం చేస్తున్నారని చందు వైఫ్ శిల్ప చెప్పారు. చందు తన వెంటపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని తెలిపారు. త్రినయని ప్రాజెక్టు నుంచి చందుకు పవిత్రతో సంబంధం మొదలైందని.. పవిత్రతో రిలేషన్‌లో ఉంటూ చందు తనని, పిల్లల్ని వదిలేశారని తెలిపారు. తాను చందుతో ఐదేళ్ల నుంచి మాట్లాడలేదన్నారు శిల్ప.

గుండెలవిసేలా రోదించిన చందు తల్లిదండ్రులు..
బలవన్మరణానికి పాల్పడిన సీరియల్‌ నటుడు చందు అంత్యక్రియలు మే 18వ తేదీన సికింద్రాబాద్ బన్సీలాల్ పేట శ్మశానవాటికలో పూర్తయ్యాయి. చందును కడసారి చూసేందుకు.. అభిమానులు భారీగా తరలివచ్చారు. చందు మరణం కుటుంబ సభ్యులను తీవ్రంగా కలిచివేస్తోంది. ముఖ్యంగా ఆయన తల్లిదండ్రులు కుమారుడి మృతిని తట్టుకోలేక గుండెలవిసేలా రోదిస్తున్నారు. చందు స్నేహితులు, బంధువులు సైతం కన్నీరుమున్నీరవుతున్నారు.

Also Read : ప్రాణాలతో బయటపడ్డాను అంటూ ఎమోషనల్ అయిన జబర్దస్త్ నటి.. యాక్సిడెంట్‌లో తుక్కు తుక్కు అయిన కార్..

ట్రెండింగ్ వార్తలు