Miami Airport Plane : విమానంలో ఒక్కసారిగా మంటలు.. తప్పిన పెనుప్రమాదం..!

విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో 126 మంది ప్రయాణికులు ఉన్నారు. రన్‌వేపై విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

Miami Airport Plane : విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో 126 మంది ప్రయాణికులు ఉన్నారు. రన్‌వేపై విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ ప్రయాణికులందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ముగ్గురికి మాత్రమే స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన అమెరికాలోని మియామి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో రన్‌వేపై జరిగింది. రెడ్ ఎయిర్ ఫ్లైట్ ఫ్రంట్‌ ల్యాండింగ్ గేర్‌ పెయిలవ్వడంతో విమానంలో ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. విమానంలోని ప్రయాణీకులంతా భయంతో వణికిపోయారు.


డొమినికన్ రిపబ్లిక్‌లోని శాంటో డొమింగో నుంచి వస్తున్న విమానం కొద్దిసేపట్లో ల్యాండ్ కావాల్సి ఉంది. అదే సమయంలో విమానంలో ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. రన్‌వే నుంచి విమానం పక్కకు జరిగిపోయింది. ఈ క్రమంలో విమానం క్రేన్ టవర్ సహా అనేక వస్తువులను ఢీకొట్టింది. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి మంటలను అదుపు చేయడంతో పెనుప్రమాదం తప్పింది. స్వల్పంగా గాయపడిన ముగ్గురు ప్రయాణికులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విమానంలోని ప్రయాణికులు ప్రమాద సమయంలో గజగజ వణికిపోయారని ఎన్‌బీసీ-6 అధికారి ర్యాన్ నెల్సన్ పేర్కొన్నారు. మెక్‌డొనెల్ డగ్లస్ MD-82 విమానానికి ప్రమాదం జరిగిన ఘటనా ప్రాంతానికి పరిశోధకుల బృందాన్ని పంపనున్నారు. విమానంలో మంటలు చెలరేగడానికి గల కారణాలపై విశ్లేషించనున్నారు. నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ ప్రకారం..  ఫ్రంట్ ల్యాండింగ్ గేర్ కూలిపోవడమే మంటలకు కారణమని భావిస్తోంది. విమానం ప్రమాద ఘటన కారణంగా అదే ఎయిర్ పోర్టుకు చేరుకోవాల్సిన మరి కొన్ని విమానాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Read Also : Karnataka Leader: ప్రిన్సిపాల్‌ను చెంపదెబ్బ కొట్టిన కర్ణాటక లీడర్

ట్రెండింగ్ వార్తలు