Karnataka Election 2023 : పెరట్లోని చెట్టుపై మూట, మూటలో కోటి రూపాయలు .. కన్నడనాట సిత్రాలు ఇసిత్రాలు..!!

కర్ణాటకలో నోట్ల కట్టలు చెట్లకు కాస్తున్నాయి..ఇదేదో వింత అనుకోవద్దు. నిజ్జంగా నిజం. చెట్టుపై మూటను చూసి కిందకు దించి చూడగా మూటలో కోటి రూపాయలున్నాయి..!!

karnataka election 2023 : డబ్బులేమన్నా చెట్లకు కాస్తున్నాయా? అనే మాట విన్నాం.కానీ కర్ణాటక ఎన్నికలు జరుగుతున్న సమయంలో నిజంగా రాష్ట్రంలో చెట్లకు డబ్బులు కాస్తున్నాయి. ఏంటీ షాక్ అవుతున్నారా? ఓ చెట్టుమీద కోటి రూపాయలు కనిపించాయి. మరి చెట్టుకు డబ్బులు కాస్తున్నట్లేగా..ఇంతకీ చెట్టేంటీ? డబ్బుల కాయటమేంటీ? అసలు మేటరేంటీ? అంటే.. అదో ఇల్లు.ఇంటి వెనుక ఓ పెరడు. పెరటి చెట్టుమీద ఓ మూట..ఆ మూటలో అక్షరాల కోటి రూపాయాలు దొరికాయి.! ఇదంతా కన్నడ నాట ఎన్నికల సిత్రాల్లో భాగం..

మరో వారం రోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో పార్టీలన్నీ ముమ్మరంగా ప్రచారాల్లో బిజీ బిజీగా ఉన్నాయి. ఓటర్లను ఆకట్టుకోవటానికి పార్టీలు తమ తమ స్లైల్లో హామీల వర్షం కురిపిస్తున్నాయి. మరి ఇవి సరిపోతాయా? ఓటర్లను ఆకట్టుకోవాలంటే..అబ్బే కోట్ల కొద్దీ డబ్బులు చేతులు మారుతోంది. ఈసీ కూడా దీనిపై నిఘా పెట్టింది. అయినా డబ్బులు చేతులు మారుతునే ఉంది.

ఈక్రమంలో మైసూరులో ఓ వ్యక్తి ఇంట్లోని పెరట్లో చెట్టుపై దాచిన కోటి రూపాయలను ఆదాయ పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పుత్తూరు నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థిగా అశోక్ కుమార్ రాయ్ సోదరుడు సుబ్రమణ్య రాయ్ ఇంట్లో అధికారులు సోదాలు చేపట్టగా పెరటిలోని చెట్టుపై దాచిన డబ్బుల్ని కనిపెట్టేశారు ఈసీ అధికారులు. చెట్టుపై బాక్సులు ఉండటం గమనించి అనుమానించారు. వాటిని తీసి చూడగా నోట్ల కట్టలు కనిపించాయి. మొత్తం కోటి రూపాయలను ధికారులు సీజ్ చేశారు.

ఇలా ఓటర్లకు పంచటానికి దాచి పెట్టిన డబ్బుల్ని  కనిపెట్టి స్వాధీనం చేసుకుంటోంది IT శాఖ.పెద్ద మొత్తంలో డబ్బు తరలింపులపై నిఘా పెట్టింది. అలా ఇప్పటిదాకా రూ.300 కోట్లకు పైగా లెక్క చూపని డబ్బును సీజ్ చేసింది. ఇందులో ఒక్క బెంగళూరులోనే రూ.82 కోట్లను స్వాధీనం చేసుకుంది. కాగా మే 10న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మే 13న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

 

ట్రెండింగ్ వార్తలు