తెలంగాణలో జనసేనాని జెండా పాతేనా? జగన్‌ను ఓడించిన జోష్‌లో పవన్‌ వేస్తున్న ఎత్తులేంటి?

అభిమానులే కార్యకర్తలుగా క్యాడర్ ఉంది. ఎన్నికల క్షేత్రంలోకి దిగాక ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది..

పవన్ కల్యాణ్‌… తెలుగు స్టేట్స్‌లో ఓ వైబ్రేషన్. తానే ఒక సైన్యమై. అతడే ఒక ధైర్యమై.. కోట్లాదిమంది అభిమానం సొంతం చేసుకున్న పవన్ కల్యాణ్.. నైజాం గడ్డ మీద జనసేన జెండా పాతేందుకు రెడీ అవుతున్నారు. ఎప్పటి నుంచో తెలంగాణతో విడదీయ లేని అనుబంధం కలిగి ఉన్న పవన్.. ఇక్కడి ప్రజలంటే తెగ ఇష్ట పడుతారు. తెలంగాణ ప్రజల పోరాట పటిమ అంటే ఆయనకు ఎంతో ఇష్టం.

ఇక్కడి యువకుల తిరుగుబాటు పవన్‌లో స్పూర్తిని నింపుతోంది. ఇది ఎవరో చెప్పిన మాట కాదు. పవన్ కల్యాణే ఏపీలో జనసేన సభల్లో మాట్లాడిన మాటలు ఇవి. తెలంగాణ ప్రజల మనసు చాలా స్వచ్చతతో ఉంటుందని.. ఇక్కడి ప్రజల్లో తిరుగుబాటు తత్వం అంటే తనకు ఎంతో ఇష్టమని ఎన్నోసార్లు చెప్పారు పవన్. తెలంగాణ ప్రజల్లో ఉన్నట్లుగా ఏపీ ప్రజల్లో పోరాడేతత్వం ఉంటే..ఆంధ్రప్రదేశ్‌ పాలకుల తీరు మారేదని చాలాసార్లు ఆవేదన వ్యక్తం చేశారు పవన్.

తెలంగాణ ప్రజలంటే ఎంతో ఇష్టపడే పవన్.. ముందు నుంచి ఇక్కడి రాజకీయాలపై ఆసక్తిగా ఉన్నారు. ప్రజారాజ్యం ఏర్పాటు సమయంలోనూ కీలకంగా పనిచేశారు పవర్ స్టార్. చిరంజీవి తమ్ముడిగా.. కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్‌తో పాటు తెలంగాణ జిల్లాల చుట్టేశారు. అప్పుడు ప్రజారాజ్యానికి తెలంగాణలో రెండు ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. అందులో పవన్ రోల్‌ కీలకంగా ఉందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు.

ప్రజారాజ్యం పార్టీలో క్రియాశీలకంగా
ప్రజారాజ్యం పార్టీలో క్రియాశీలకంగా తిరిగినప్పటి నుంచే తెలంగాణ మారుమూల గ్రామాల్లో ఉన్న సమస్యలు, ఇక్కడి ప్రజల మనస్తత్వం ఏంటో తెలుసుకున్నారు పవన్. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం తర్వాత పొలిటికల్‌గా సైలెంట్ అయిపోయారు పవన్. కొన్నాళ్లు తన సినిమాలు చేసుకుని 2014లో జనసేనానిగా మళ్లీ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో టీడీపీకి మద్దతుగా.. 2023లో బీజేపీకి మద్దతుగా తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు పవన్‌. కానీ పెద్దగా ప్రభావం చూపలేకయారు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీతో కలసి పొత్తులో కొనసాగారు పవన్. తెలంగాణలో 32 చోట్ల పోటీ చేస్తామని ప్రకటించిన జనసేనాని.. అలయన్స్‌లో భాగంగా 8 అసెంబ్లీ సీట్లలో అభ్యర్థులను పోటీలో పెట్టారు. పోటీ చేసిన ఆ ఎనిమిది మంది అభ్యర్థులు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. డిపాజిట్లు కూడా రాలేదు. కూకట్‌పల్లి, తాండూరు, కొత్తగూడెంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రచారం చేశారు.

అయినా కనీసం పోటీలో నిలవలేకపోయారు జనసేన అభ్యర్థులు. కూకట్‌పల్లి, తాండూరు, కోదాడ, నాగర్‌కర్నూల్, ఖమ్మం, కొత్తగూడెం, వైరా, అశ్వరావుపేట స్థానాలో పవన్ పార్టీ పోటీలో నిలబడింది. పలువురు బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా కూడా పవన్ క్యాంపెయిన్ చేశారు. జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ సుమారు 90 స్థానాల్లో డిపాజిట్లను రాబట్టుకోలేకపోయింది. ఎన్నికలలో ఓట్లు, సీట్లు ఎలా ఉన్నా.. తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్‌కు ఉన్న ఫ్యాన్‌ బేస్‌ అంతా ఇంతా కాదు. అతడంటే ప్రాణాలు ఇచ్చేంత అభిమానం ఉన్న ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే జనం కోసమే నిలబడి పదేళ్లపాటు పోరాడారు పవన్ కల్యాణ్.

ఆధ్మాత్మిక అనుబంధం
తెలంగాణలోని కొండగట్టుతో పవన్ కల్యాణ్‌కు ఆధ్మాత్మిక అనుబంధం ఉంది. కొండగట్టు అంజన్న స్వామిపై అమితమైన భక్తి, నమ్మకం ఉన్నాయి.. గతంలో ఒకసారి తనకు ప్రాణగండం ఉందని తెలియగానే కొండగట్టు వచ్చి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఓ హైటెన్షన్‌ తీగ తెగి తనపై పడిందని పవనే గత కొండగట్టు టూర్‌లో గుర్తుచేసుకున్నారు.

ఆ సమయంలో తన వెంట ఉన్నవారందరికీ షాక్‌ కొట్టిందని.. కానీ తాను మాత్రం ప్రాణాలతో బయటపడ్డానని పవన్‌ చెప్పారు. అప్పుడు తనకు కొండగట్టు పునర్జన్మను ఇచ్చిందని భావించిన పవన్‌ ఏ ముఖ్య కార్యక్రమం మొదలుపెట్టినా కొండగట్టుకు వస్తారు. తన వారాహికి కొండగట్టులోనూ పూజలు చేయించారు. ఇప్పుడు వారాహి అమ్మవారి దీక్షలో ఉన్న పవన్ కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు.

పదేళ్ల పొలిటికల్ జర్నీ అట్టర్ ఫ్లాప్ షో అనే కామెంట్స్ హోరెత్తించారు ప్రత్యర్థులు.. ఐనా వెనక్కి తగ్గలేదు.. మొక్కవోని దీక్షతో పొలిటికల్ సమరాన్ని కొనసాగించారు.. అంతే విజయం సొంతమైంది.. అది కూడా అలాంటి ఇలాంటి విజయం కాదు.. వందకు వందశాతం రిజల్ట్‌తో.. తెలుగు స్టేట్స్‌లో కాటమరాయుడు రాజకీయ కాక రేపారు.. ఓటమి అనే అజ్ఞాతం వీడి.. గెలుపే తన అడ్డా అని నిరూపించుకున్నారు. అందుకే రాజకీయంగా పవన్‌ను ఇప్పటిదాకా చూసిన తీరు మారిపోయింది. జనం అతడ్ని విశ్లేషించే విధానంలోనూ మార్పు వచ్చింది. ఏపీలో దక్కిన అప్రతిహత విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో పాగా వేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు పవన్.

తెలంగాణ ప్రాంతం పొలిటికల్ అవేర్నెస్ ఉన్న భిన్న రాజకీయాలకు వేదిక. అలాంటి పొలిటికల్‌ గ్రౌండ్‌లో పాలిటిక్స్ ప్లే చేసేందుకు రెడీ అవుతున్నారు పవన్. ఏపీ ఎన్నికల్లో దక్కిన విజయం అతనిలో ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఒక్కరోజుతో విజయం రాకపోయినా.. కష్టపడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టొచ్చనే ధీమా అతనిలో కనిపిస్తోంది. అందుకే నైజాం గడ్డపై నయా పాలిటిక్స్ చేసేందుకు రెడీ అవుతున్నారు పొలిటికల్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్.

ఎన్నికష్టాలు పడినా ఒక్కసారి విజయం నీదైతే అప్పటిదాకా నిన్ను తిట్టినవాడే పొగుడుతాడు. చీకొట్టి, చీత్కరించినవాడే దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తాడు. అందుకే గెలుపు ఇచ్చిన నమ్మకం మరేదీ అవ్వదు. ఇప్పడదే నమ్మకంతో తెలంగాణలో జనసేన జెండాను రెపరెపలాడించే ప్లాన్ చేస్తున్నారు పవర్ స్టార్. పగిలే కొద్ది గ్లాస్ పదునెక్కినట్లు.. వరుస ఓటములే విజయానికి బాటలు వేస్తాయని గ్రహించిన పవన్.. ఇప్పటికే తెలంగాణలో బీజేపీతో కలసి నడుస్తోన్న పవన్ సరికొత్త ప్లాన్ చేస్తున్నారు. గత పదేళ్లుగా ఎన్డీయేలో కొనసాగుతోన్న పవన్.. బీజేపీతో అత్యంత సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. ఎన్నికల్లోనూ కమలం పార్టీకి తన సహకారం అందించారు.

కీ రోల్ ప్లే
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటులో కీరోల్ ప్లే చేశారు పవన్ కల్యాణ్. పవన్‌ వల్లే ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ఏర్పడిందని అన్‌ డౌటెడ్‌గా చెప్పొచ్చు. బీజేపీకి ఇష్టం లేకపోయినా పవన్ మాట విని కూటమిగా ఏర్పడేందుకు ముందుకొచ్చింది కమలం పార్టీ. అంతలా బీజేపీ పెద్దలతో పవన్‌కు అనుబంధం ఉంది. అందుకే ఆయన బీజేపీతో కలసి తెలంగాణలో పాలిటిక్స్‌ చేయాలనుకుంటున్నారు.

తెలంగాణలో బీజేపీకి పట్టు పెరుగుతూ వస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో 4 సీట్లు గెలుచుకున్న కమలం పార్టీ ఈసారి ఏకంగా 8 లోక్‌సభ సీట్లతో ప్రభంజనం సృష్టించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణలో ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే వస్తే ఈసారి ఏకంగా 8 సీట్లు గెలుచుకుంది. 35 ఎమ్మెల్యే సీట్లలో ట్రయాంగిల్ ఫైట్‌కు కారణమైంది కమలదళం.

అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం కూడా పెంచుకుంది. ఇలా చూస్తే తెలంగాణలో బీజేపీ బలపడుతుంది. అందులో తన బలం కూడా కలిస్తే.. బీఆర్ఎస్, కాంగ్రెస్‌యేతర ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చనేది పవన్ ఆలోచన. పైగా అవరమైతే టీడీపీ సహకారం కూడా తీసుకోచ్చనేది సేనాని అభిప్రాయంగా చెబుతున్నారు పొలిటికల్ ఎనలిస్టులు.

ఇన్నాళ్లు ఫెయిల్యూర్ పొలిటికల్ లీడర్‌గా ప్రచారంలో ఉన్న అతను..ఒక్కసారిగా అజ్ఞాతవాసి నుంచి..గేమ్‌ ఛేంజర్‌గా మారిపోయారు. తెలంగాణ పొలిటికల్ పిక్చర్‌లోనూ తనదైన ముద్ర వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు పవన్. వాస్తవానికి తెలంగాణలో పవన్‌కు ఉన్న ఫ్యాన్‌ బేస్‌ మరే హీరోకు లేదు. ఆయన ఓ టూర్‌కు వస్తున్నారనే ఇన్ఫో ఉంటే చాలు లక్షలాదిమంది యువత రోడ్డుమీదకు వస్తారు.

అయితే అభిమానాన్ని ఓట్లుగా మల్చుకునేందుకు ఏపీలో పవన్‌కు పదేళ్ల సమయం పట్టింది. తెలంగాణలో పరిస్థితులు ఇంకా భిన్నం. ఇది ఉద్యమం నేపథ్యం ఉన్న రాష్ట్రం. లోకల్ సెంటిమెంట్ మరింత ఎక్కువ. అలాంటి తెలంగాణ రాష్ట్రంలో పవన్‌ చేసే పాలిటిక్స్ ఎలా ఉండబోతాయనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. బీజేపీతో అతను వేసే అడుగులు.. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ను దెబ్బతీస్తాయా.. టీడీపీని కూడా కలుపుకుని వెళ్తారా అన్నది ఆస్తికకరంగా మారింది.

సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌
ఏ పార్టీతో కలసి నడిచినా.. ఎన్ని పార్టీలు కూటమిగా ఏర్పడినా.. అతడే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌. ఆయన ఉంటేనే నిలబడి కలబడగలమనే నమ్మకం. అది జాతీయ పార్టీ అయినా.. ప్రాంతీయ పార్టీ అయినా.. అతని మద్దతు తప్పనిసరి. ఇంతకీ పవన్‌కు ఎందుకంత ప్రాధాన్యం అంటే.. నమ్మిన సిద్దాంత కోసం నిలబడే వ్యక్తిగా.. సౌత్‌స్టేట్స్‌లోనే రికార్డుస్థాయి ఫ్యాన్స్ ఉన్న సినీస్టార్‌గా.. ఏదో సాధించాలనే తపన నాయకుడిగా.. పవన్‌కు ఉన్న ట్రాక్‌ రికార్డే వేరు. అందుకే ఒక్క గెలుపుతో ఆయన మాటకు విలువ పెరిగింది.

అన్నీ కలసి వచ్చి ఏపీ ఎన్నికల కురుక్షేత్రంలో సత్తా చాటారు జనసేనాని. పొత్తులో భాగంగా 21 స్థానాల్లో బరిలోకి దిగి అన్ని చోట్లా గెలిచి హండ్రెడ్ పర్సెంట్‌ విక్టరీ సాధించిన పార్టీగా.. నాయకుడిగా రికార్డు క్రియేట్ చేశారు పవన్ కల్యాణ్. ఇప్పుడు మిషన్ తెలంగాణకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో జనసేనకు లీడర్లు ఉన్నారు.

అభిమానులే కార్యకర్తలుగా క్యాడర్ ఉంది. ఎన్నికల క్షేత్రంలోకి దిగాక ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఏపీ రిజల్ట్‌ తర్వాత తెలంగాణ పాలిటిక్స్‌పై పవన్ నజర్ పెట్టారనేది ఆఫ్ ది రికార్డు స్టోరీ. ఇప్పుడు కొండగట్టు టూర్‌ను కూడా రాజకీయంగా తనకు అనుకూలంగా మల్చుకునే స్టేట్‌మెంట్‌ ఇచ్చేశారు. మరి ముందు ముందు రాజకీయం ఎలా ఉండబోతుందో చూడాలి.

పాతబస్తీలోనే కాదు.. తెలంగాణలో విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేసేందుకు ఇది మొదటి మెట్టు: జగదీశ్ రెడ్డి

ట్రెండింగ్ వార్తలు