Rain Alert : రెయిన్ అలర్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఐదు రోజులు వానలేవానలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు
Rain Alert : తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 15 నుంచి 20వ తేదీ వరకు ద్రోణి ప్రభావంతో రెండు విడతల్లో కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు.
Rain Alert
- తెలంగాణకు రెయిన్ అలర్ట్
- నేటి నుంచి 20వ తేదీ వరకు వానలు
- ఐదు రోజులపాటు తగ్గనున్న ఉష్ణోగ్రతలు
Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఉదయం 9గంటల దాటితే బయటకు రావాలంటే ఎండ తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి పరిస్థితి. ఇక మధ్యాహ్నం సమయంలో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. సాయంత్రం సమయంలో ఉక్కపోతతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ చల్లటి కబురు తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 15 నుంచి 20వ తేదీ వరకు ద్రోణి ప్రభావంతో రెండు విడతల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈనెల 15 నుంచి 17వ తేదీ మధ్య ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
ఈనెల 16వ తేదీ నుంచి 20వ తేదీ మధ్య రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులు, ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వానలుకూడా పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. పలు జిల్లాల్లో 40డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో వర్షాలు పడనుండటంతో ఎండల తీవ్రత తగ్గనుంది.
వారంరోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ఉరుములు, మెరుపుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ముఖ్యంగా వర్షాలు పడే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని, ఈదురు గాలులు వీచే అవకాశం ఉంటుందని.. ఆ సమయాల్లో ప్రజలు చెట్ల కింద, హోర్డింగ్లు, విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు ఉండే ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
మరోవైపు.. ప్రస్తుతం రైతులు సాగు చేసిన పంటలు చేతికొచ్చే సమయం.. ఇలాంటి సమయంలో ఈదురుగాలులు, వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. కొన్ని ప్రాంతాల్లో పంటలు పొలాల్లో కోత దశలో ఉండగా.. కొన్ని ప్రాంతాల్లో కల్లాల్లో ఉన్నాయి. ఇలాంటి సమయంలో వర్షాలు పడితే రైతులకు ఇబ్బందికరంగా మారుతుంది. దీంతో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు ముందస్తుగా పంటలను కాపాడుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
