Telangana Rains : తెలంగాణలోని ఈ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు.. భీకర గాలులు.. హెచ్చరికలు జారీ..
Telangana Rains : తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాబోయే మూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
- తెలంగాణకు భారీ వర్ష సూచన
- రాబోయే మూడు రోజులు వానలు
- హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ
Telangana Rains : తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్ నగరంలో సోమవారం సాయంత్రం నుంచి వర్షం కురుస్తోంది. మంగళవారం ఉదయం కూడా పలు ప్రాంతాల్లో వర్షం పడింది. మరోవైపు.. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Also Read : Telangana Govt : విద్యార్థులకు గుడ్న్యూస్.. తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం.. వారందరికీ ఉచిత ప్రవేశం..
సముద్ర మట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి బికనేర్, ఢిల్లీ, లక్నో, పాట్నా మీదుగా మణిపూర్ వరకు వ్యాపించి, సముద్ర మట్టానికి సుమారు 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందన్నారు. అదే సమయంలో, ఉత్తర కర్ణాటక నుంచి దక్షిణ కర్ణాటక, కేరళ, తమిళనాడు మీదుగా కొమొరిన్ ప్రాంతం వరకు విస్తరించి ఉన్న మరొక ద్రోణి ప్రస్తుతం బలహీనపడింది. ఈ వాతావరణ మార్పుల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలలతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు.
వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. మూడ్రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొట్టనున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మురుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
వర్షాలతోపాటు 30 నుంచి 40కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచించారు.
