Telangana Rains : దూసుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలంగాణలో నాలుగు రోజులు భారీ వర్షాలు.. ఈ 15జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ..
Telangana Rains : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని.. దీని ప్రభావంతో ఈ నెల 20వ తేదీ నుంచి నాలుగు రోజులు పాటు రాష్ట్రంలోని 15 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Telangana Rains
Telangana Rains : తెలంగాణలోని పలు జిల్లాల్లో కొద్దిరోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అయితే, తాజాగా.. రాష్ట్రంలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈనెల 20వ తేదీ నుంచి నాలుగు రోజులపాటు పలు జిల్లాల్లో భీకర గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. సెప్టెంబర్ 19వ తేదీ నాటికి ఇది మరింత బలపడి ఆ తరువాత మూడునాలుగు రోజుల్లో పశ్చిమ – వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా – ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలవైపు దూసుకువచ్చే అవకాశం ఉంది. మరోవైపు రుతుపవన ద్రోణి ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉండటంతోపాటు, మరాఠ్వాడా నుంచి కర్ణాటక, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు మరో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 20 నుంచి నాలుగు రోజులపాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ఈనెల 20 నుంచి 23వ తేదీ వరకు 15 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, కామారెడ్డి, నాగర్కర్నూల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. నేడు, రేపు కూడా రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
వర్షాలతోపాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో పాటు, ఉరుములు, మెరుపులు వచ్చే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పిడుగుపాటు ముప్పుకూడా ఉన్నందున.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో.. ఈదురుగాలుల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగుల వద్ద ఉండొద్దని అధికారులు సూచించారు. వ్యవసాయ పనుల్లో ఉండే రైతులు, పొలాల్లో పనిచేసే కూలీలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.
