Happy Journey Review : ‘హ్యాపీ జర్నీ’ రివ్యూ.. ఏడుగురు ఆడవాళ్లు ఫ్రాన్స్ ట్రిప్ కి వెళ్తే ఏం జరిగింది?
Happy Journey Movie Review : కొంతమంది గ్రూప్ గా ఏదో ఒక ట్రిప్ కి వెళ్లడం, అక్కడ జ్ఞాపకాలు, ఎమోషన్స్ అనే డైలాగ్స్ తో గతంలో అనేక సినిమాలు వచ్చాయి.
Happy Journey Review
Happy Journey Review : అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినీషా అలిశెట్టి, రూపా శ్రీనివాస్, సునైనా, వంశీ, రవి శివ తేజ.. ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘హ్యాపీ జర్నీ’. గుత్తా ప్రొడక్షన్స్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి నిర్మాణంలో అభిరామ్ నాయుడు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. హ్యాపీ జర్నీ సినిమా సెప్టెంబర్ 18న రిలీజ్ అవుతుండగా మూడు రోజుల ముందు నుంచే ప్రీమియర్స్ వేయడం మొదలుపెట్టారు.
కథ విషయానికొస్తే..
గోవింద్(వంశి), అప్పారావు(రవి శివతేజ) ఓ ట్రావల్ కంపెనీని నడిపిస్తూ ఉంటారు. తమ కంపెనీ నష్టాల్లో ఉందని బయటకు తీసుకు రావడానికి ఒక ఐడియా అని చెప్పి కొంతమంది ఆడవాళ్లను ఫ్రీ ట్రిప్ తో ఫ్రాన్స్ దేశానికి తీసుకువెళ్ళడానికి ప్లాన్ చేస్తారు. సావిత్రి(అన్నపూర్ణమ్మ), మినిస్టర్ భార్య చాముండేశ్వరి(ఆమని), నయన(జినీషా), శ్రీలత(ఝాన్సీ), తన కూతురు తన్వి(పాయల్ రాజ్ పుత్), విహన(రూప శ్రీనివాస్), దివ్య(సునైనా).. ఈ ఏడుగురికి ఫ్రీ ట్రిప్ అని ఫోన్ చేసి వీళ్ళందర్నీ ఫ్రాన్స్ దేశానికి తీసుకువెళ్తారు. అక్కడికి వెళ్ళాక వీళ్లంతా ఫుల్ ఎంజాయ్ చేస్తూ, గొడవలు పడుతూ ఉంటారు.
తన్వికి కాబోయే భర్త నిఖిల్(పృథ్వి) అక్కడే ప్యారిస్ లో ఉంటాడు. శ్రీలత తన అల్లుడి గురించి గొప్పలు చెప్తుంది కానీ తన్వి పెళ్లి చేసుకోవాలా వద్దా అనే కన్ఫ్యూజన్ లో ఉంటుంది. విహన ప్యారిస్ లో ఉండే తన ఇన్స్టాగ్రామ్ బాయ్ ఫ్రెండ్ ని కలవడానికి వస్తుంది. సావిత్రి లైఫ్ ఒంటరిగా ఎంజాయ్ చేయడానికి వస్తుంది. దివ్య అన్నిటికి భయపడుతూ ఉంటుంది. నయన తన భర్తతో విడాకుల విషయంలో గొడవయి వస్తుంది. అలా వీళ్లందరిది ఒక్కొక్కరిది ఒక్కో కథ. ఒక రోజు అనుకోకుండా దివ్య తప్పిపోతుంది. దివ్య మళ్ళీ వీళ్ళ టీమ్ తో కలుస్తుందా? తన్వి పెళ్ళికి ఓకే చెప్తుందా? దివ్య ఎందుకు భయపడుతుంది? విహన తన బాయ్ ఫ్రెండ్ ని కలుస్తుందా? నయన-తన భర్త కథేంటి..? అసలు గోవింద్ వీళ్ళందర్నీ ఎందుకు ఫ్రీగా ట్రిప్ కి తీసుకొచ్చాడు? వీళ్ళకు స్పాన్సర్ చేసింది ఎవరు? ఫ్రాన్స్ దేశంలో వీళ్ళు చేసిన అల్లరి, వీళ్ళు ఏర్పరుచుకున్న జ్ఞాపకాలు ఏంటి.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
సినిమా విశ్లేషణ..
కొంతమంది గ్రూప్ గా ఏదో ఒక ట్రిప్ కి వెళ్లడం, అక్కడ జ్ఞాపకాలు, ఎమోషన్స్ అనే డైలాగ్స్ తో గతంలో అనేక సినిమాలు వచ్చాయి. అలా ఓ ఏడుగురు ఆడవాళ్లు డిఫరెంట్ ఏజ్ ఉన్నవాళ్లు వెళితే ఎలా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కో కథ, ఎమోషన్ పెట్టి ఈ హ్యాపీ జర్నీ సినిమాని తీశారు. సినిమా ఆరంభంలోనే గోవింద్, అప్పారావు పాత్రలు, వాళ్ళ ట్రావెల్స్ పరిచయం చేసి మిగిలిన లేడీస్ పాత్రలన్నీ ఒక్కొక్కటిగా పరిచయం చేసి ఫ్రాన్స్ ఫ్లైట్ ఎక్కించేసారు.
ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ కామెడీతో దేశం కాని దేశంలో వీళ్ళు చేసే హడావిడి, ఓ సాంగ్ తో సాగుతుంది. మధ్యమధ్యలో దివ్య ఎమోషన్, లేడీస్ ఎమోషన్ తో సాగి దివ్య తప్పిపోవడంతో ఇంటర్వెల్ ఇచ్చారు. దీంతో సెకండ్ హాఫ్ దివ్య వీళ్ళ దగ్గరకు ఎలా వస్తుంది అనే ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా వీరి ట్రావెలింగ్ నడుస్తూనే మధ్యమధ్యలో కామెడీ నడుస్తూనే ఒక్కొక్కరి కథ, వ్యథ, కన్నీటి గాధ చూపించారు. ఇవి చూస్తుంటే ఈ కాలంలో ఆడవాళ్లు మగవాళ్ళని దాటేసి, తోసేసి ముందుకు వెళ్లిపోతున్నా ఇంకా దర్శకుడు ఎక్కడో పదేళ్ల క్రితమే ఆగిపోయి అప్పటి సమస్యలని చూపించాడు అనిపిస్తుంది. మధ్యలో కొన్ని సూడో ఫెమినిజం భావాలు ఇరికించారు. ఫ్యామిలీ అంటే తప్పు, లైఫ్ ఎంజాయ్ చేయాలి అనే కాన్సెప్ట్ చూపించారు. ఒక్కో పాత్ర ఒక్కోలా బిహేవ్ చేస్తుంది సెకండ్ హాఫ్. కష్టాలు కానీ వాటిని కూడా ప్రపంచంలోని కష్టాలు అన్ని వీళ్ళకే ఉన్నట్టు చూపించారు. ఈ ఆడవాళ్ళ మధ్య గొడవలు అవుతాయి. ఆ గొడవలు కూడా కామెడీగానే చూపించారు. అసలు తాగడం తప్పు అనేవాళ్ళచేత ఫుల్ గా తాగించారు. కొన్ని లాజిక్స్ లేకుండా ఆ పాత్ర అప్పటికి ఎలా బిహేవ్ చేస్తే అంతే అన్నట్టు రాసుకున్నారు.
సెకండ్ హాఫ్ అంతా మరీ ఆడవాళ్ళ కష్టాలు చూపించేస్తే మగవాళ్ళు బాధపడతారు ఏమో అని మధ్యలో ఓ రెండు డైలాగ్స్ మగవాళ్ల కష్టాల గురించి రాసారు. ఏదైతే సెకండ్ హాఫ్ ఎమోషన్ పండించాలి అనుకున్నారో అదే సినిమాకు మైనస్ అయింది. ఏడిపించాలి అని రాసుకున్న ఎమోషన్ సీన్స్ ఒక్కటి కూడా పండలేదు. చివర్లో ఝాన్సీ చెప్పే ఎమోషన్ సీన్ చాలా డెప్త్ ఉండి బాధపెట్టే సీన్. కానీ దాన్ని ఓవర్ డ్రమాటిక్ గా అసలు ఎమోషన్ లేకుండా రాసుకున్నారు. ఇలా సెకండ్ హాఫ్ అంతా ఎటెటో వెళ్ళిపోతుంది అనుకునే సమయానికి క్లైమాక్స్ లో గోవింద్ ఇచ్చిన ట్విస్ట్ తో హమ్మయ్య బతికించారు అనిపిస్తుంది. ఫ్యామిలీ వ్యాల్యూస్ చెప్తూ చివర్లో ఇచ్చిన క్లైమాక్స్ సినిమాకు పరిపూర్ణత తెచ్చింది అనుకోవచ్చు. ఈ సినిమా చూస్తుంటే వెంకటేష్ జయం మనదేరా ఫస్ట్ హాఫ్ గుర్తుకు రావడం ఖాయం. ఇవివి గారి ఎవడి గోల వాడిదే సినిమా కూడా గుర్తొస్తుంది. అలాంటి సినిమాల బాటలోనే కథనాన్ని రాసుకున్నారు. అలాగే ఫ్రాన్స్ దేశం ట్రావెల్ వ్లోగ్ కూడా చూసినట్టు ఉంటుంది. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాని చూడొచ్చు.

నటీనటుల పర్ఫార్మెన్స్..
ఎన్నో సినిమాలతో మెప్పించిన అన్నపూర్ణమ్మ మొదటిసారి మోడ్రన్ డ్రెస్సులు వేసి ఫుల్ గా నవ్విస్తూ ఫ్రాన్స్ లో ఎంజాయ్ చేసే పాత్రలో అదరగొట్టేసింది. ఈ ఏజ్ లో అలాంటి పాత్ర చేయడం గ్రేట్ అని చెప్పాలి. ఆమని ఒక మినిస్టర్ భార్య పాత్రలో బాగానే మెప్పించింది. యాంకర్ ఝాన్సీ పీనాసి పాత్రలో అక్కడక్కడా నవ్వించింది. చివర్లో కాస్త ఎమోషనల్ గా ట్రై చేసింది. హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ, జినీషా అలిశెట్టి, రూపా శ్రీనివాస్ వారి పాత్రల్లో బాగానే నటించారు.
ఇన్నాళ్లు కామెడీతో నవ్వించిన సునైనా భయపడుతూ బాధపడుతూ ఉండే పాత్రలో బాగానే నటించినా కొన్ని చోట్ల మరీ ఓవర్ డ్రమాటిక్ అనిపిస్తుంది. వంశీ ఎప్పట్లాగే ఫుల్ గా నవ్వించాడు. యూట్యూబర్ రవి శివతేజ కూడా తన పంచులతో బాగానే నవ్వించాడు. పృథ్వీ దండమూడి, మురళీధర్ గౌడ్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదు అనిపించారు.
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఫ్రాన్స్ దేశంలోని పలు నగరాలు, అక్కడి ప్రముఖ స్థలాలు అందంగా చూపించారు. సెకండ్ హాఫ్ లో కొన్ని అక్కర్లేని, ల్యాగ్ సీన్స్ ఎడిటింగ్ లో కట్ చేస్తే బెటర్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు పర్వాలేదు అనిపిస్తాయి. రొటీన్ కథే అయినా ఏడుగురు ఆడవాళ్లను పెట్టుకొని కామెడీతో, ఆడవాళ్ళ కష్టాలతో, చివర్లో ఫ్యామిలీ ఎమోషన్ తో మాములు కథనంతో తెరకెక్కించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా మాత్రం ఇంతమందిని ఫ్రాన్స్ తీసుకెళ్లి అక్కడ అన్ని నగరాల్లో షూటింగ్ చేయడానికి బాగానే ఖర్చుపెట్టనట్టు తెరపై కనిపిస్తుంది.
మొత్తంగా ‘హ్యాపీ జర్నీ’ ఇళ్లల్లో ఉండే ఆడవాళ్లు ఫ్రాన్స్ దేశానికి ట్రిప్ కి వెళ్తే అక్కడ ఏం చేశారు, వాళ్ళ కథేంటి అని కామెడీగా ఎమోషనల్ గా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
