New Rules : జనన, మరణాల రిజిస్ట్రేషన్‌పై కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి! ఆలస్యం చేస్తే ఇకఅంతే..
Birth Death Registration New Rules 2026 : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జనన, మరణాల రిజిస్ట్రేషన్ (సవరణ) చట్టం–2026 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.
Birth Death Registration New Rules 2026
Birth Death Registration New Rules 2026 : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జనన, మరణాల రిజిస్ట్రేషన్ (సవరణ) చట్టం–2026 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఆలస్యంగా జనన, మరణాలను నమోదు చేసుకునే నిబంధనలను ఈ చట్టం మరింత కఠినతరం చేస్తోంది. ఈ సవరణ బిల్లు లోక్‌సభ, రాజ్యసభ ఆమోదం పొందగా, రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారింది.
కొత్త చట్టం ప్రకారం.. జననం లేదా మరణం జరిగిన ఒక సంవత్సరం దాటిన తర్వాత, రెండేళ్లలోపు రిజిస్ట్రేషన్ చేయాలంటే సంబంధిత అధికారిక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అనుమతి తప్పనిసరి. ఈ దశలో ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులు పరిశీలించిన తర్వాతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే, రెండేళ్లకు మించి ఆలస్యమైన జనన, మరణాల నమోదుకు ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆదేశం తప్పనిసరి కానుంది. అంటే ఇలాంటి దరఖాస్తులపై ఇకపై మరింత కఠినమైన న్యాయపరమైన పరిశీలన ఉండనుంది.
జనన, మరణాల నమోదును ఆలస్యం చేయకుండా ప్రజలను ప్రోత్సహించడమే ఈ సవరణల ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం పేర్కొంది. ఆలస్యమైన నమోదుకు సంబంధించి సులభమైన, క్రమబద్ధమైన ధ్రువీకరణ వ్యవస్థను తీసుకురావడంతో పాటు నిబంధనలను కఠినతరం చేసినట్లు తెలిపింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో రెండేళ్లకు మించి ఆలస్యమైన జనన, మరణాల రిజిస్ట్రేషన్ విషయంలో ప్రజలు న్యాయపరమైన అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
1969లో అమల్లోకి వచ్చిన జనన, మరణాల రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం.. జననాలు, మరణాల నమోదు తప్పనిసరి. ఈ రిజిస్ట్రేషన్ ద్వారా జారీ అయ్యే ధ్రువపత్రాలు వ్యక్తి జననం లేదా మరణాన్ని నిరూపించేందుకు చట్టపరమైన ఆధారంగా ఉపయోగపడతాయి.
