Sridevi Property Dispute: సుప్రీం కోర్టులో శ్రీదేవి ఆస్తి రగడ.. బోనీ కపూర్, జాన్వీకి బిగ్ షాక్.. కోర్టు కీలక ఆదేశాలు
దివంగత ప్రముఖ నటి శ్రీదేవి(Sridevi Property Dispute) కుటుంబానికి చెందిన చెన్నైలోని ఆస్తి వివాదంలో సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేసింది.
Supreme court orders status quo on late sridevi chennai property dispute
- ఆస్తిపై సుప్రీం స్టేటస్ కో
- బోనీ కపూర్ కుటుంబానికి నోటీసులు
- 1988 సేల్ డీడ్‌పై వివాదం
Sridevi Property Dispute: దివంగత ప్రముఖ నటి శ్రీదేవి కుటుంబానికి చెందిన చెన్నైలోని ఆస్తి వివాదంలో సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. చెన్నైలోని సదరు భూమికి సంబంధించి ప్రస్తుతం ఉన్న పరిస్థితినే యథాతథంగా కొనసాగించాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ కె.వి.విశ్వనాథన్, జస్టిస్ అరుణ్ పల్లీల ధర్మాసనం.. శ్రీదేవి భర్త బోనీ కపూర్ తో పాటు వారి కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్లకు నోటీసులు జారీ చేసింది.
1988 నాటి సేల్ డీడ్‌పై వివాదం.. పిటిషనర్ల వాదనలు:
ఈ వివాదం 1988 నాటి సేల్ డీడ్‌కు సంబంధించింది. అప్పట్లో శ్రీదేవి(Sridevi Property Dispute), ఆమె చెల్లి శ్రీలత, తల్లి రాజేశ్వరి కలిసి ఎం.సి. నిత్యానంద ముదలియార్ నుంచి ఈ ఆస్తిని కొనుగోలు చేశారు. అయితే, ఆ భూమి తమ తాతగారైన సంబంధ ముదలియార్దని, తమ తండ్రి చంద్రశేఖరన్ ద్వారా అందులో 1/5వ వంతు వాటా తమకు దక్కాల్సి ఉందంటూ ఎం.సి. శివకామి, ఆమె సోదరుడు నటరాజన్ చెంగల్పట్టు కోర్టును ఆశ్రయించి, సేల్ డీడ్‌ను రద్దు చేయాలని కోరారు.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు:
ఈ పిటిషన్లపై గతంలో స్పందించిన మద్రాస్ హైకోర్టు.. పిటిషనర్ల తండ్రి చంద్రశేఖరన్ మొదటి భార్య జీవించి ఉన్న సమయంలోనే ఈ సంబంధం ఏర్పడిందని, వీరికి వారసత్వ హక్కులు చెల్లవని పేర్కొంటూ వారి దావాను కొట్టివేసింది. ఆస్తిని ఆక్రమించుకునే ఉద్దేశంతోనే ఈ వ్యాజ్యం వేశారని వ్యాఖ్యానించింది. అయితే, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ ఆస్తి వివాదం ఇప్పుడు మళ్లీ కొత్త మలుపు తిరిగింది.
