AP Bandh: ఏపీ విద్యార్థులకు అలర్ట్.. కళాశాలలు బంద్..
AP Colleges Bandh: అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆగస్టు 5న రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు అన్ని కళాశాలల బంద్కు పిలుపునిచ్చింది.
ABVP Calls AP Colleges Bandh On August 5 Demanding Fee Reimbursement
- ఆగస్టు 5న ఏపీ బంద్
- రూ. 6,800 కోట్ల బకాయిలు
- జీవో 77 రద్దు డిమాండ్
AP Colleges Bandh: ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని ఆరోపిస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) పోరాటానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా ఆగస్టు 5న రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు అన్ని కళాశాలల బంద్ (AP Colleges Bandh)కు పిలుపునిచ్చింది. విద్యార్థుల భవిష్యత్తు, హక్కుల రక్షణే ధ్యేయంగా చేపడుతున్న ఈ ఆందోళన కార్యక్రమానికి సంబంధించిన ప్రచార వాల్ పోస్టర్ను ఏబీవీపీ నాయకులు పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఆవిష్కరించారు.
రూ. 6,800 కోట్ల బకాయిలు, జీవో 77 రద్దు డిమాండ్:
రాష్ట్రంలో పేరుకుపోయిన రూ. 6,800 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది. ఉన్నత విద్యకు శాపంగా మారిన జీవో నంబర్ 77ను రద్దు చేసి, పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ పునరుద్ధరించాలని స్పష్టం చేసింది. డిగ్రీ ప్రవేశాల్లో ఆలస్యం, అకడమిక్ క్యాలెండర్ల గందరగోళం, నామమాత్రపు తనిఖీలతో సాగుతున్న కార్పొరేట్ విద్యా వ్యాపారంపై విమర్శలు గుప్పించింది. వసతి గృహాల్లో సౌకర్యాలు లేక విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారని, నాణ్యమైన భోజనం అందించాలని కోరింది.
విద్యార్థి లోకం ఐక్యంగా కదలాలి:
తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఇప్పటికే అన్ని కళాశాలల యాజమాన్యాలకు ముందస్తు నోటీసులు అందించినట్లు ఏబీవీపీ ప్రతినిధులు వెల్లడించారు. ఆగస్టు 5న తలపెట్టిన ఈ రాష్ట్రవ్యాప్త బంద్ విజయవంతమయ్యేలా విద్యాసంస్థల యజమానులు, అధ్యాపకులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పూర్తిస్థాయిలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విద్యారంగ పరిరక్షణ కోసం సాగుతున్న ఈ పోరాటానికి సమాజంలోని అన్ని వర్గాలు మద్దతుగా నిలవాలని కోరారు.
