‘Anti-Suicide’ Fan Rod: ‘ఆత్మహత్య నివారణ ఫ్యాన్ కడ్డీ”ల వ్యాపారానికి రూ.50 లక్షలు నిధులు

తానూ అభివృద్ధి చేసిన ఈ "Anti-Suicide Ceiling Fan Rod" ఒక్క నిండు ప్రాణాన్ని నిలబెట్టినా..తాను అనుకున్నది సాదించినట్టేనని శరద్ అషానీ చెబుతున్నాడు

Anti-Suicide’ Fan Rod: సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యలకు పాలపడుతున్న సంఘటనలు చూసిన శరద్ అషానీ చలించిపోయాడు. చిన్న చిన్న కారణాలతో క్షణికావేశంతో నిండు నూరేళ్ళ జీవితాన్ని పోగొట్టుకుంటున్న వారిని చూసి ఆయన హృదయం ద్రవించుకుపోయేది. అటువంటి ఆత్మహత్యలను నివారించేందుకు తనవంతుగా ఏదైనా చేయాలనుకున్నాడు శరద్ అషానీ. అనుకున్నదే తడవుగా..సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుంటే.. వెంటనే ఊడిపడేలా ఒక రాడ్డు తయారు చేయాలనీ భావించాడు. ఎన్ని విమర్శలు వచ్చినా, ఎంత సమయం తీసుకున్నా చివరకు తాను అనుకున్నదానికి ఒక రూపం తీసుకొచ్చి చివరకు.. దాన్ని వ్యాపార మార్గంగా అభివృద్ధి చేశాడు. లాభాపేక్షణ లేని అతని ఆలోచనను నచ్చి “Shark Tank India” రూ.50 లక్షల నిధులను అందించింది. బహుమతి గెలుచుకున్న శరద్ గురించి “The Better India” అనే వెబ్ సైట్ ప్రచురించిన కథనం మేరకు..

Also read: Rahul Gandhi: బీజేపీ ప్రభుత్వంపై లోక్‌సభ సాక్షిగా రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

ఎవరు ఈ శరద్ అషానీ? ఏం చేశాడు?
ముంబైకి చెందిన శరద్ అషానీ అనే వ్యక్తి గతంలో(2011కి ముందు) ఒక ప్రైవేటు సంస్థలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పనిచేసేవాడు. 2004లో ప్రముఖ మహిళా మోడల్ ఒకరు సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పేపర్ లో చదివాడు. మరుసటి రోజు కూడా అలాంటి ఆత్మహత్య వార్తలు పేపర్ లో చూసి శరద్ అషానీ ఆలోచనలో పడ్డాడు. అదే ఏడాది.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) విడుదల చేసిన నివేదికలో.. 1,13,000 ఆత్మహత్యలు చోటుచేసుకుంటే వాటిలో 30 శాతం సీలింగ్ ఫ్యాన్ ఆత్మహత్యలే ఉన్నట్లు పేర్కొన్నారు. ఇదంతా గమనిస్తున్న శరద్..దీనిపై సమగ్ర అధ్యాయనం చేశాడు. బాధితులు సీలింగ్ ఫ్యాన్ ఎంచుకోవడానికి కారణాలు విశ్లేషించిన శరద్..ఉరి వేసుకునే సమయానికి అది ఊడిపడేలా రాడ్డును ఏర్పాటు చేస్తే సమస్యను పరిష్కరించవచ్చని నిర్ధారించుకున్నాడు.

Also read: Bajaj – Triumph new Bike: బజాజ్, ట్రయంఫ్ కలయికలో మొదటి బైక్ రెడీ, ఇక ప్రత్యర్థులతో యుద్ధమే

ఊపిరిపోసుకున్న శరద్ ఆలోచన?
అయితే తాను అనుకున్న ఉత్పత్తికి ఊపిరి పోసేందుకు ఏళ్లపాటు పరిశోధన జరిపిన శరద్.. 2011లో పూర్తి స్థాయి ఉత్పత్తితో ముందుకు వచ్చాడు. దేశంలోని ప్రఖ్యాత IIM అహ్మదాబాద్, AIIMS జోధ్‌పూర్, కోటలోని హాస్టళ్లు, అంబాలా జైలు వంటి సంస్థలు శరద్ వద్ద ఆ రాడ్డును కొనుగోలు చేశారు. అయితే అప్పట్లో అది వివాదానికి దారి తీసింది. ఆత్మహత్యలను ఎలా నివారించాలో నేరుగా బాధితులకు కౌన్సెలింగ్ ఇవ్వాల్సింది పోయి.. ఇలా రాడ్డులు కొనుగోలు చేయడం ఏంటంటూ విమర్శలు వచ్చాయి. దీంతో కొంత నొచ్చుకున్న శరద్.. తన రాడ్డుకు బిగించిన సీలింగ్ ఫ్యాన్ జారీ ఒక వ్యక్తి బ్రతికిబట్టకట్టినట్లు పేపర్ లో చదివాడు. ఇక దీంతో దైర్యం తెచ్చుకున్న శరద్.. తన ఉత్పత్తిపై పూర్తి స్థాయి నమ్మకం ఉంచి ముందుకు సాగాడు. అయితే మొదట్లో రాడ్డును తయారు చేసేందుకు స్క్రాప్ మెటీరియల్స్ ను వాడేవాడు. అనంతరం శరద్ ఆలోచనను మెచ్చిన మహీంద్రా సంస్థ.. తమ “స్పార్క్ ది రైజ్ పోటీ” ద్వారా రూ.4 లక్షలు బహుమతి అందించింది.

పూర్తి స్థాయి ఉత్పత్తిపై ద్రుష్టి:
ఆ బహుమతి మొత్తాన్ని ఉపయోగించి పూర్తిస్థాయి వనరులను సమకూర్చుకున్న శరద్ అషానీ.. “Gold Life”(బంగారు జీవితం) అనే పేరుతో సంస్థను స్థాపించి వ్యాపారాన్ని విస్తరించాడు. ఫరీదాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్కూలే.. శరద్ మొదటి కస్టమర్ అంటే.. ఆ రాడ్డుకు ఉన్న ప్రాముఖ్యత ఏంటో అర్ధం అవుతుంది. ఫరీదాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్కూల్ తమ హాస్టల్ కి గానూ మొత్తం 300 రాడ్లను ఆర్డర్ చేసింది. శరద్ సంస్థ Gold life తయారు చేసిన “Anti-Suicide Ceiling Fan Rod” గురించి తెలుసుకున్న IIM కాశీపూర్ అధికారులు తమ క్యాంపస్ లోని హాస్టల్ కోసం 500 రాడ్లను ఆర్డర్ చేసింది. అలా ఇప్పటివరకు భారత దేశంలోని అనేక ఆసుపత్రులు, హోటళ్ళు, హాస్టళ్లు, జైళ్లు మరియు ప్రభుత్వ క్వార్టర్లలోని సీలింగ్ ఫ్యాన్లలో 50,000 పైగా ‘ఆత్మహత్య నిరోధక’ రాడ్‌లను శరద్ తన సంస్థ ద్వారా పంపిణీ చేశాడు.

Also read: CM Jagan: థర్డ్‌ వేవ్‌లో ఉన్నాం.. కరోనా కట్టడికి కఠినంగా ఉండాల్సిందే!

ఎందుకు ఈ రాడ్డును కనిపెట్టాడు?
విద్యార్థులు, యువత మానసికంగా ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారో మనం చెప్పలేమని.. సమస్య ఎటువంటిదైనా దానికి పరిష్కారం లేదని భావిస్తున్న కొందరు మనోవేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని.. ఆ సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకునే ఆలోచన వచ్చినా అది ఊడి పడితే ఒక నిండుప్రాణాన్ని నిలబెట్టుకోవచ్చని ఇటీవల జరిగిన “Shark Tank India” ప్రోగ్రాంలో జడ్జిలకు వివరించాడు శరద్. “Shark Tank India” అనేది స్టార్టప్ లు, వినూత్న ఆలోచనలకు పెట్టుబడి సహాయం అందించేందుకు ప్రైవేటుగా ఏర్పాటు చేసిన ఒక సంస్థ. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల వినూత్న ఆలోచనలు నచ్చితే.. వీరు ఈక్విటీ పద్దతిలో పెట్టుబడులు పెడతారు. ఇండియాలో “Sony Liv” ఛానల్ లో ఈ “Shark Tank India” ప్రోగ్రాం ప్రసారం అవుతుంది.

రాడ్డును ఎలా తయారు చేశాడు?
ఇక ‘ఆత్మహత్య నివారణ ఫ్యాన్ కడ్డీ”ని తయారు చేసేందుకు శరద్ చేసిన హోమ్ వర్క్ అంతాఇంతా కాదు. ముంబైలోని చోర్ బజార్ లో తుక్కు సామాను కొని.. తాను అనుకున్న రాడ్డుకు ఒక రూపం ఇచ్చి.. దానిపై సొంతంగా ఉరి వేసుకునే ప్రయోగాల నుంచి.. కోల్‌కతా జైలులో.. మరణశిక్ష వేసే ఉరి కొయ్యను సైతం శరద్ పరిశీలించాడు. బాధితులు ఉరి కొయ్యకు ఎలా వేలాడుతారు.. ఎంత సమయంలో ఊపిరి పోతుంది, ఎంత బరువు ఉంటే ఉరి బిగుసుకుంటుంది, వంటి విషయాలను బేరీజు వేసిన శరద్..ఆ లెక్కలన్నీ పరిగణలోకి తీసుకుని ఈ “Anti-Suicide Ceiling Fan Rod”ని తయారు చేశాడు. ఫ్యాన్ రాడ్డుకి వేలాడదీసిన సమయంలో అందులోని స్ప్రింగ్ యాక్షన్ ముందుగా కిందకు జారుతుంది. బరువుకు ఫ్యాన్, రాడ్డు ఒక వైపునే ఉండిపోతే.. రాడ్డులోని మరొక భాగం పూర్తిగా విరిగి మరొకవైపు పడిపోతుంది. దీంతో ఫ్యాన్ రాడ్డుకు వేలాడుతుంది కానీ.. జారీ మనిషిపై పడదు. దీనివల్ల మనిషి సురక్షితంగా ఉంటాడు.

Also read: Village Volunteer: వాలంటీర్ వక్ర బుద్ధి: వృద్దురాలి పెన్షన్ కాజేసిన వైనం

తానూ అభివృద్ధి చేసిన ఈ “Anti-Suicide Ceiling Fan Rod” ఒక్క నిండు ప్రాణాన్ని నిలబెట్టినా..తాను అనుకున్నది సాదించినట్టేనని చెప్పే శరద్ అషానీ..ఇదేదో వ్యాపారంగా మలుచుకునే ఉద్దేశం ఏమాత్రం లేదని The Better Indiaతో చెప్పాడు. ఈ “Anti-Suicide Ceiling Fan Rod”ని తయారు చేయడం ఒక ఎత్తయితే.. అసలు ఆత్మహత్య ఆలోచనలే రాకుండా యువతకు కౌన్సెలింగ్ ఇవ్వడం తన ప్రవృత్తి అంటున్నాడు శరద్. ఇప్పటికే ఈ రాడ్డు కోసం ఎన్నో ఆర్డర్లు వచ్చినట్లు చెబుతున్న శరద్.. దీని ధరను రూ.300-500 మధ్యలో ఉంచాడు.

ట్రెండింగ్ వార్తలు