Cattle Reproduction : పశువుల పునరుత్పత్తిలో రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు

యదను సకాలంలో గుర్తించి సరైన సమయంలో కృత్రిమ గర్భధారణ లేదా సహజ సంపర్కం చేయించాలి. ఇందుకోసం రైతులు యదలక్షణాలను గమనించాలి. యదకు వచ్చిన ఆవులు చిరాకుగా అటుఇటు తిరుగుతుంటాయి. ఇతర పశువుల మీద ఎక్కుతాయి. ఇతర పశువులు ఎక్కబోతే కదలకుండా ఉంటాయి.

Cattle Reproduction : వాణిజ్యస్ధాయిలో విస్తరించిన వ్యవసాయ అనుబంధ రంగం పాడిపరిశ్రమ. రైతులు పదుల సంఖ్య నుండి వందల సంఖ్యలో పశువులను పెంచుతూ ఆర్ధికంగా నిలదొక్కుకుంటున్నారు. నిర్వాహణలో సరైన అవగాహన లేకపోవటం వల్ల కొందరు నష్టాలను చవి చూస్తున్నారు. దీనికిగల కారణాల్లో ప్రధానంగా కనిపిస్తుంది పశువుల పునరుత్పత్తి యాజమాన్యం. లక్షలు పోసి కొన్న పశువులు సరైన సమయంలో సూడికట్టకపోతే రైతులకు ఖర్చు తడిసి మోపెడవుతుంది.

దీనివల్ల ఈతల మధ్య వ్యవధి పెరిగి , పాడికాలం తగ్గి రైతుకు ఆర్ధికంగా తీవ్రనష్టం వాటిల్లుతుంది. ఇలాంటి సమస్యల నుండి గట్టెక్కాలంటే పునరుత్పత్తి యాజమాన్యాల గురించి అవగాహనతో ముందడుగు వేయాలి. సాలుకు ఒక దూడ..ఏడాది పొడవున పాల దిగుబడి అన్న సూత్రమే పాడిపరిశ్రమ అభివృద్ధికి మూలం. పశుపోషణలో రైతులు లాభాలు పొందాలంటే ఏడాదికి ఒక దూడ పుట్టేవిధంగా జాగ్రత్తలు తీసుకోవాలి.

READ ALSO : Crave Crops : పంటలను ఆశించే చీడ పీడలను ఆకర్షించే ఎరపంటలు!

ఇందుకోసం పశువు ఈనిని మూడో నెలలోనే సూలు కట్టించాలి. చాలా మంది రైతులు పశువులు త్వరగా సూలు కట్టిస్తే పాలదిగుబడి తగ్గుతుందనే ఉద్దేశంతో సూలు కట్టించరు. దీని వల్ల పశువు వట్టిపోయే కాలం పెరిగి మేపు ఖర్చు భారమవుతుంది. ముఖ్యంగా ఆవులు ప్రతి సంవత్సరం ఈని పదిమాసాలు పాలిచ్చి రెండు మాసాలు వట్టిపోతుంటాయి. గేదెలలో అయితే వట్టిపోయే కాలం రెండు నుండి నాలుగు మాసాల వరకు ఉంటుంది. సాధారణంగా పాడి పశువులు పదేళ్ళ లోపు కనీసం ఐదారుసార్లు ఈనితే పశు పోషణ లాభసాటిగా ఉంటుంది.

పుట్టిన పెయ్యదూడలలో మేలైన వాటిని శ్రద్ధగా పోషిస్తే త్వరగా పెరిగి రెండేళ్ళకే యదకొచ్చి మూడేళ్ళలోపు మొదటిసారి ఈనుతాయి. పోషణబాగుంటే పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. పూర్వం పశువులను సూలికట్టించటానికి ప్రతి గ్రామంలో ఒక ఆంబోతు, దున్నను పోషించేవారు. కృత్రిమ గర్భోత్పత్తి కార్యక్రమాలు చేపట్టిన తరువాత వేలాది మైళ్ళ దూరంలో ఉన్న ఆంబోతు, దున్న వీర్యాన్ని తెప్పించుకుని సంతతిని పెంపొందించుకునే అవకాశం లభించింది.

సాధారణంగా ప్రభుత్వ పశువైద్యశాలలో ఇలాంటి వీర్యధారణ కార్యక్రమాలను రెండు తెలుగు రాష్ట్రాల్లో పశుసంవర్ధక శాఖలు నిర్వర్తిస్తున్నాయి. ముఖ్యంగా భారత దేశంలో పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా పాల ఉత్పత్తి పెరగాల్సిన అవసరం ఉంది. ఇది సంకర జాతి పశువులతోనే సాధ్యం. అయితే మేపు, పోషణ బాగా ఉంటే ఇది సాధ్యమౌతుంది. మన ప్రాంతంలో అనువైన సంకర జాతి ఆవులలో హెచ్ ఎఫ్, జర్సీ మంచి పాలదిగుబడిని ఇస్తున్నాయి. గేదెలలో ముర్రాజాతి అత్యంత అనుకూలం…

READ ALSO : Prevent Pests In Cotton : పత్తిలో చీడపీడలు నివారించేందుకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

వాస్తవానికి దేశీయ పశువులు మూడునుండి నాలుసంవత్సరాల్లో యదకు వస్తే విదేశీ ఆవులు పదిహేను నుండి ఇరవై మాసాలకే యదకొస్తాయి. యదకాలంలో ఆవుల్లో 19గంటలు, గేదెల్లో 18 నుండి 36గంటలు ఉంటుంది. గర్భధారణ కాలం 280 ఉంటే గేదెల్లో 310 రోజులు ఉంటుంది. దేశవాళి ఆవులు 7నెలలు పాలిస్తే విదేశీ సంకర జాతి ఆవులు, ముర్రాగేదెలు 10నెలలు పాలిస్తాయి. పాడిపరిశ్రమ లాభసాటిగా ఉండాలంటే ఈతకు ఈతకు మధ్య తక్కువకాలం ఉండాలి. దీని వల్ల పాడిపశువు వట్టిపోయే కాలం తక్కువగా ఉంటుంది.

దేశవాళి ఆవుల్లో ఈతకు ఈతకు మధ్య 18 నుండి 24 మాసాలు ఉంటుంది. విదేశీ సంకర జాతి ఆవులలో 12 నుండి 15 మాసాలు, గేదెలలో 15 నుండి 16 మాసాలు ఉండగా సాధారణంగా ఆవుకాని, గెదెకాని ఐదు , ఆరు సార్లు ఈనుతాయి. ఒంగోలు మేలు జాతి ఆవులు సగటున రోజుకు 5 నుండి 6 లీటర్లు పాలిస్తుంటే విదేశీ ఆవులు మాత్రం 12 లీటర్లు వరకు ఇస్తాయి. మరికొన్ని ఆవులు 20 నుండి 30 లీటర్లు పాలిస్తాయి.

పాడిపశులు సాధారణంగా ఈనిన రెండో నెలలో యదకు వస్తాయి. ప్రతి 21 రోజులకు ఒకసారి యదకు వస్తాయి. యదకట్టిన తరువాత 12 గంటల నుండి 14 గంటలకు అండాశయం నుండి అండం విడుదలవుతుంది. అండం విడుదలయ్యేలోగా సహజ సంపర్కం ద్వారా, ఆంబోతు, దున్నపోతుతో దాటించటంకాని, కృత్రిమసంపర్కం ద్వారాకాని వీర్యాన్ని ప్రవేశపెట్టాలి. ఆవుల్లో ఏడాదిపొడవున గర్భోత్పత్తి చేయవచ్చు. అయితే గేదెలు అధిక వేడిన భరించలేవు. వేసవిలో గెదెలు త్వరగా యదకు రావు. చల్లని వాతావరణం కల్పిస్తే యదకు వస్తాయి.

యదను సకాలంలో గుర్తించి సరైన సమయంలో కృత్రిమ గర్భధారణ లేదా సహజ సంపర్కం చేయించాలి. ఇందుకోసం రైతులు యదలక్షణాలను గమనించాలి. యదకు వచ్చిన ఆవులు చిరాకుగా అటుఇటు తిరుగుతుంటాయి. ఇతర పశువుల మీద ఎక్కుతాయి. ఇతర పశువులు ఎక్కబోతే కదలకుండా ఉంటాయి. మానం ఉబ్బి నిగనిగలాడుతుంది. చిలుకుచిలుగా మూత్రవిసర్జన చేస్తాయి. ఆకలి మందగిస్తుంది. అరుస్తుంటాయి. ఆంబోతు కోసం పరుగులు పెడతాయి. ఇతర పశువులను నాకుతాయి. పాల దిగుబడి తగ్గుతుంది.

READ ALSO : Pests In Sesame : నువ్వు పంటసాగులో చీడపీడలు, సస్యరక్షణ చర్యలు!

అదే గేదెలో అయితే పళ్లుబయటపెట్టి విచిత్రంగా అరుస్తాయి. తెంచుకుని పారిపోతాయి. చిరుమూత్రం పోస్తాయి. వీటిలో మూగ ఎదలక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆవుల్లో ఉదయం యదకు వస్తే సాయంత్ర, సాయంత్రం యదకు వస్తే మరుసటి రోజు ఉదయం వీర్యధానం చేయించాలి. ఇతర పశువులు దాటకుండా జాగ్రత్తపడాలి. తిరిగి యదకు వస్తే సూలికట్టించాలి. రెండుమూడుసార్లు సూలు నిలవకుంటే పశువైద్యులను సంప్రదించి వైద్యసహాయం పొందాలి. వీర్యదానం చేసిన తరువాత పశువు తిరిగి యదకు రాకుంటే సూలికట్టిందని భావించాలి. మూడు మాసాల తరువాత పశువైద్యులతో పరీక్షలు చేయించాలి.

 

ట్రెండింగ్ వార్తలు