Bhagwant Mann : తగ్గేదేలే…అంటున్న పంజాబ్ కొత్త సీఎం భగవంత్ మాన్‌

పంజాబ్‌లో నయా పాలిటిక్స్‌ షురూ అయ్యాయి. అధికారం చేపట్టకముందే.. ఆప్‌ సీఎం క్యాండిడేట్ భగవంత్ సింగ్‌ మాన్‌ తగ్గేదే లే అంటున్నారు. వచ్చీ రావడంతోనే అధికారులను ఉరుకులు పరుగులు

Bhagwant Mann : పంజాబ్‌లో నయా పాలిటిక్స్‌ షురూ అయ్యాయి. అధికారం చేపట్టకముందే.. ఆప్‌ సీఎం క్యాండిడేట్ భగవంత్ సింగ్‌ మాన్‌ తగ్గేదే లే అంటున్నారు. వచ్చీ రావడంతోనే అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. ఊహించని నిర్ణయాలు తీసుకుంటూ.. అందరికీ షాకిస్తున్నారు. పంజాబ్‌లో సామాన్యుడి ప్రభుత్వం అంటే ఎలా ఉంటుందో చూపిస్తామంటూ హింట్ ఇస్తున్నారు.

పంజాబ్‌లో ఎలాంటి పాలన ఉండబోతోంది..? కొత్తగా వచ్చే ఆప్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోందనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. అయితే.. తమ పాలన ఎలా ఉంటుందనేది ప్రభుత్వం ఏర్పాటు చేయకముందే చెప్తోంది ఆ పార్టీ. ఆ పార్టీ అభ్యర్థి కాబోయే సీఎం భగవంత్ సింగ్ మాన్ తనదైన శైలిలో పాలనకు ఇప్పటి నుంచే శ్రీకారం చుట్టారు. అప్పుడే ప్రత్యర్థుల దుమ్ము దులపడం మొదలుపెట్టేశారు.

సీఎంగా పదవీ ప్రమాణం చేయకముందే రాష్ట్రంలో ఉన్న పలువురు మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేల భద్రత తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. రాజ్‌భవన్ లో కాకుండా భగత్ సింగ్ గ్రామమైన ఖట్కర్ కలన్‌లో సీఎంగా ప్రమాణం చేస్తానని ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించిన ఆయన.. ఇక నుంచి గవర్నమెంటు ఆఫీసుల్లో సీఎం ఫొటోలు ఉండవని, షహీద్ భగత్ సింగ్, బాబా సాహెబ్ అంబేద్కర్ ఫొటోలు ఉండాలని ఆదేశించడంతో జనం జేజేలు కొడుతున్నారు.

భగవంత్‌ సింగ్ మన్ సీఎం కానేలేదు.. కానీ, ఆయన తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నాయి. తాజాగా పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూతో పాటు 122 మంది మాజీ ఎమ్మెల్యేలకు భద్రతను పీకి పారేశారు. కీలక నేతలైన రజియా సుల్తానా, పర్గత్ సింగ్, ధరంబీర్ అగ్ని హోత్రి, తర్లోచన్, అరుణ్ నారంగ్, రాణా గుర్జీత్ సింగ్, మన్ ప్రీత్ సింగ్ బాదల్, భరత్ భూషణ్ అషు, నాథూ రామ్, దర్శన్ లాల్ లతో పాటు ఇతరుల భద్రతను వెనక్కి పిలిచారు.

కేంద్ర హోంశాఖ గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు భద్రతలో ఉన్న బాదల్‌ కుటుంబానికి, కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌, చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ వంటి మాజీ సీఎంలకు మాత్రమే భద్రత కొనసాగించారు. వీరు మినహా మిగిలిన కాంగ్రెస్‌, అకాలీదళ్, ఇతర నేతలకు ఇచ్చిన భద్రతను తొలగించారు.

Bhagawant Man, Aravind Kejriwal

మాది సామాన్యుడి పాలన అంటున్నారు భగవంత్‌మాన్… ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కూడా అలానే ఉంటున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలకు కూడా కీలక ఆదేశాలు జారీ చేశారు. రాజధానిలో ఉండటం కాదు మీ నియోజకవర్గాల్లోనే ఎక్కువ గడపండి అంటూ సూచించారు. విజయగర్వం నెత్తికెక్కించుకోకుండా ప్రజలే దేవుళ్లు అనేలా వ్యవహరించాలని సూచించారు.
AlsoRead : Telangana Police : పోలీసు శాఖలో 18,334 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు
గతంలో కాంగ్రెస్‌, శిరోమణి అకాలీదళ్‌ ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఎక్కువగా ప్రజలతో దురుసుగా వ్యవహరించి చెడ్డపేరు తెచ్చుకున్నారు. కానీ తమ పార్టీ అలాంటి పేరు తెచ్చుకోకుండా జాగ్రత్త పడుతున్నారు మాన్‌.  అటు, పంజాబ్‌ అమృత్‌సర్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది.

స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకున్న తర్వాత ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, పంజాబ్‌కు కాబోయే ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో కలిసి రోడ్‌ షో నిర్వహించారు. రోడ్‌ షోలో వేలాది మంది ఆప్‌ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 16న భగత్‌సింగ్‌ పూర్వీకుల గ్రామమైన ఖట్కర్‌కలన్‌లో పంజాబ్‌ సీఎంగా భగవంత్ మాన్‌ బాధ్యతలు చేపట్టనున్నారు.

ట్రెండింగ్ వార్తలు