Gaddar Dies : ఆయన మరణం బాధాకరం, తెలంగాణ ప్రజలకు తీరని లోటు- గద్దర్ మృతికి కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి సంతాపం

తెలంగాణ కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిది అన్నారు. గద్దర్ భౌతికంగా లేకపోయినా ఆయన పాట శాశ్వతంగా బతికే ఉంటుందన్నారు. Gaddar Dies

Kishan Reddy - Revanth Reddy (Photo : Google)

Kishan Reddy – Revanth Reddy : ప్రజా గాయకుడు గద్దర్ మృతికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంతాపం తెలిపారు. ”ప్రజా యుద్ధనౌకగా అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్న విప్లవ గాయకుడు గద్దర్ (గుమ్మడి విఠల్ రావ్).. కన్నుమూశారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నా. వివిధ అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన గద్దర్.. తెలంగాణ ఉద్యమంలోనూ తన పాటతో, మాటతో.. సరికొత్త ఊపును తీసుకొచ్చారు.

విశ్వవిద్యాలయాల వేదికగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిన సమయంలో.. ‘పొడుస్తున్న పొద్దమీద నడుస్తున్న కాలమా!’ అన్న గద్దర్ పాట ఓ సంచలనం. తెలంగాణ ఉద్యమ సమయంలో వారితో చాలా సందర్భాల్లో వేదిక పంచుకునే అవకాశం లభించింది. రాష్ట్ర సాధనకు సంబంధించిన ఎన్నో అంశాలను పరస్పరం పంచుకునే అవకాశం కూడా దొరికింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2012లో నేను చేపట్టిన ‘తెలంగాణ పోరుయాత్ర’ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో చేపట్టిన కార్యక్రమాల్లో గద్దర్ నాతో కలిసి నడిచారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని సంతాప సందేశం విడుదల చేశారు కిషన్ రెడ్డి.

సి.హెచ్ విద్యాసాగర్ రావు, మహారాష్ట్ర మాజీ గవర్నర్
ప్రజా సమస్యలపై మడమ తిప్పని పోరాటం చేసిన యోధుడు గద్దర్. కోట్లాది మందిని ఆకర్షించిన కంఠం మూగబోవడం మనస్తాపాన్ని కలిగించింది. సిద్ధాంత పరమైన వైరుద్యం ఉన్నప్పటికి ప్రజా సమస్యల కోసం వారు ఎంతో మంది నాయకులను కలవడం జరిగింది. గద్దర్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతూ, వారు మనోధైర్యంతో ముందుకు పోవాలని కోరుకుంటున్నా.

Also Read..Gaddar: 1997లో గద్దర్‌పై హత్యాయత్నం.. దేశ వ్యాప్తంగా సంచలనం

పాటల యుద్ధనౌక గద్దర్ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఆయన మరణం తెలంగాణకు తీరని లోటు అని వాపోయారు. తెలంగాణ కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిది అన్నారు. గద్దర్ భౌతికంగా లేకపోయినా ఆయన పాట శాశ్వతంగా బతికే ఉంటుందన్నారు. గద్దర్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈటల రాజేందర్.

ప్రజా యుద్ధ నౌక, ప్రజా గాయకుడు గద్దర్ మృతికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ, మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి సంతాపం తెలిపారు. ”గద్దర్ మరణం తెలంగాణకు, పీడిత, తాడిత ప్రజలకు తీరని లోటు. దశాబ్దాల కాలంగా ప్రజల కోసం అలుపెరగని పోరాటం చేసిన గద్దర్ మరణం బాధాకరం. గద్దర్ మృతికి సంతాప సూచకంగా అన్ని మండల కేంద్రాల్లో ముఖ్య కూడళ్లలో గద్దర్ చిత్ర పటాలు పెట్టి నివాళులు అర్పించాలి” అని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి.

”గద్దర్ తెలంగాణ పోరాటయోధుడు. తెలంగాణ సాధన కోసం తన ఆట, పాటలతో జనాన్ని ఉత్తేజపరిచారు. గాంధీ కుటుంబం పట్ల అపార అభిమానం ఉన్న వ్యక్తి గద్దర్. గద్దర్ మృతి పట్ల కాంగ్రెస్ నాయకులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాం. ఇటీవలే ఖమ్మంలో రాహుల్ గాంధీతో గద్దర్ ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. ఆయన మరణాన్ని తట్టుకోలేక పోతున్నాం” అని రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read..MLA Rajasingh: వచ్చేసారి నేను ఉండకపోవచ్చు.. అసెంబ్లీలో ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు..

ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూతపై కాంగ్రెస్ భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంతాపం తెలిపారు. ”ఉద్యమ గళం మూగబోయింది. ప్రజా యుద్ధనౌక గద్దర్ కన్నుమూశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనతో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. నా పోరాటానికి ఆయనే స్ఫూర్తి. జన నాట్యమండలి వ్యవస్థాపకుల్లో గద్దర్ ఒకరు. ప్రజా సమస్యలపై ఆయన పోరాటం అజరామరం. తనదైన పాటలతో ఎంతోమందిని ఉత్తేజ పరిచారు గద్దర్. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర కీలకం. అనేక పాటలతో ఆనాడు ఉద్యమానికి ఊపు తెచ్చారు. తెలంగాణ ఉద్యమ గళం గద్దర్ స్మృతిలో నివాళులు అర్పిస్తున్నాను.”

ప్రజా గాయకుడు గద్దర్(74) మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం (ఆగస్టు 6,2023) మరణించారు. గద్దర్‌కు 10 రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. రెండు రోజుల క్రితమే గద్దర్ కు గుండె ఆపరేషన్ సక్సెస్ ఫుల్ గా చేశారు డాక్టర్లు. అయితే, ఇవాళ ఉదయం బీపీ పెరగడంతో పాటు షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పడిపోవడంతో చికిత్స అందించారు. అయితే మధ్యాహ్నం మల్టిపుల్ ఆర్గాన్స్ దెబ్బతినడంతో గద్దర్ కన్నుమూసినట్లు డాక్టర్లు వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు