గందరగోళంగా మాజీ ఎంపీ సోయం రాజకీయ భవిష్యత్‌

ఇటీవలే కేంద్ర మంత్రి బండి సంజయ్‌తోపాటు బీజేపీలో ప్రధాన నేతలను కలిసి తన రాజకీయ భవిష్యత్తుపై..

సరైన సమయంలో.. సరైన నిర్ణయం తీసుకున్నవారే విజేతలు… నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యమే… విలువైన అవకాశాలను చేజార్చుతుంటుంది… ఇలా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేని ఓ నేత…. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు.. అయ్యో ఎంత పనైందంటూ చింతిస్తున్నారట… అయ్యిందేదో అయ్యింది… ఇప్పటికైనా మార్పు కోరుకుంటే తప్పేంటనే ఆలోచనతో పక్క పార్టీ తలుపు తడుతున్నారట… ఇంతకీ విలువైన అవకాశాన్ని కోల్పోయిన ఆ నేత ఎవరు? ఏంటా స్టోరీ?

ఆదివాసీ ఉద్యమ నేత, మాజీ ఎంపీ సోయం బాపూరావు రాజకీయ భవిష్యత్‌ గందరగోళంగా మారిందనే టాక్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం బీజేపీలో ఉన్న సోయం బాపూరావు అసెంబ్లీ ఎన్నికల్లో బోధ్‌ నుంచి పోటీ చేసి ఓటమి చవిచూడగా, పార్లమెంట్‌ ఎన్నికల్లో టికెట్‌ దక్కించుకోలేకపోయారు. రాష్ట్రంలో సిట్టింగ్‌ ఎంపీలు అందరికీ టికెట్లు ఇచ్చిన బీజేపీ అధిష్టానం… సోయం బాపూరావును మాత్రం పక్కనపెట్టడం అప్పట్లో విస్తృత చర్చకు దారితీసింది. అయితే కేంద్రంలో నామినేటెడ్‌ పదవి ఇస్తామనే హామీతో పార్టీ అభ్యర్థి నగేశ్‌ విజయానికి పనిచేశారు బాపూరావు. ఐతే అధికారంలోకి వచ్చాక పార్టీ తనను పట్టించుకోవడం లేదని ఇప్పుడు అసంతృప్తితో రగిలిపోతున్నారట మాజీ ఎంపీ సోయం బాపూరావు…

ఆదివాసీ ఉద్యమ నాయకుడిగా మాజీ మాజీ ఎంపీ సోయం బాపూరావుకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఆదివాసీల హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ వేదికగా ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004లో బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా తొలిసారి గెలుపొందారు. ఆ తర్వాత 2014లో టిడిపి, 2018లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చవిచూశారు.

అప్పట్లో సంచలన విజయం
ఆ తర్వాత బాబూరావు రాజకీయ భవిష్యత్తుకి పుల్ స్టాప్ పడుతుందనుకునే సమయంలో 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి సంచలన విజయం సాధించారు. 2004 – 2019 మధ్య నాలుగు పార్టీలు మారిన బాపూరావు.. ఇప్పుడు మరోసారి పార్టీ మారాలనే ప్రయత్నాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. 2019 వరకు ఉమ్మడి జిల్లాలో బీజేపీకి పెద్దగా బలం లేకపోయినా, బాపూరావు గెలుపు తర్వాత…. కమలం పార్టీకి గట్టి పునాదులు వేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను పెద్ద ఎత్తున కైవసం చేసుకున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల నాటికి జిల్లాలో బీజేపీని బలమైన శక్తిగా తయారు చేశారు. ఉమ్మడి జిల్లాలో బీజేపీ పటిష్టతకు ఇంతలా శ్రమించిన తమ నేతను అధిష్టానం గుర్తించలేదని, తగిన గుర్తింపు ఇవ్వడం లేదని బాపూరావు అనుచరులు వాపోతున్నారు.

MPగా ఉండగా సోయం బాపూరావు కేంద్ర మంత్రి అవుతారనే ప్రచారం జరిగింది. మంత్రివర్గ విస్తరణలో ఆ అవకాశం తృటిలో తప్పిపోయిన తర్వాత… బాపూరావు తలరాత పూర్తిగా మారిపోయింది. మొన్నటి పార్లమెంట్‌ ఎన్నికల్లో టికెట్‌ కూడా దక్కించుకోలేని దుస్థితి ఏర్పడింది. దీంతో లోక్‌సభ ఎన్నికలకు ముందే మాజీ ఎంపీ బాపూరావు పార్టీని వీడేందుకు సిద్ధం అయ్యారనే టాక్‌ వినిపించింది.

ఐతే బీజేపీ జాతీయ నాయకత్వం రంగంలోకి దిగి బుజ్జగించడంతో ఆయన వెనుకడుగు వేశారు. అయితే గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటూ వస్తున్న సోయం…. ఇప్పుడు పక్కచూపులు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

రాజకీయ భవిష్యత్తుపై చర్చ
ఇటీవలే కేంద్ర మంత్రి బండి సంజయ్‌తోపాటు బీజేపీలో ప్రధాన నేతలను కలిసి తన రాజకీయ భవిష్యత్తుపై చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీ పెద్దల నుంచి ఎలాంటి హామీ దక్కక పోవడంతో పార్టీతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డితోపాటు టీపీసీపీలో పలువురు పెద్దలతో బాపూరావుకి మంచి సంబంధాలే ఉన్నాయంటున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో బోథ్ నుంచి, అనంతరం పార్లమెంటు స్థానానికి సోయం బాపూరావుకి కాంగ్రెస్‌ టికెట్‌ ఇస్తుందని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, కాంగ్రెస్‌ ఆఫర్‌పై నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేసిన బాపూరావు ఇప్పుడు రెండింటికీ చెడ్డ రేవడిలా మారిపోయారంటున్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడమే మాజీ ఎంపీ రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకునేలా చేశాయంటున్నారు.

బీజేపీకి రాజీనామా?
ఈ పరిస్థితుల్లో మాజీ ఎంపీ సోయం బాపూరావు బీజేపీకి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం అందుతోంది… పార్టీపై తీవ్ర అసంతృప్తి.. అసహనంతో ఉన్న మాజీ ఎంపీ కమలం పార్టీతో తెగతెంపులు చేసుకోనున్నారని పొలిటికల్‌ సర్కిల్స్‌లో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తన రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చిన బీజేపీని వీడాలని ఆయన అనుచరులు సైతం ఒత్తిడి చేస్తున్నారని తెలుస్తోంది. దీంతో త్వరలోనే మాజీ ఎంపీ పార్టీ మార్పు ఉంటుందని చెబుతున్నారు.

ఏది ఏమైనా బాపూరావు అడుగులు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. బలమైన ఆదివాసీ నేత వస్తామంటే కాంగ్రెస్‌ కూడా చేర్చుకుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే బీజేపీ అధిష్టానాన్ని బ్లాక్‌మెయిల్‌ చేయడానికే బాపూరావు పార్టీ మార్పు ప్రచారాన్ని తెరపైకి తెచ్చారని బీజేపీ వర్గాలు ఎదురుదాడి చేస్తున్నాయి. దీంతో ఆదిలాబాద్‌ బీజేపీ రాజకీయం ఆసక్తి రేపుతోంది. బాపూరావు ఫ్యూచర్‌పై సస్పెన్స్‌ కొనసాగుతోంది.

Also Read: సిక్కోలు టీడీపీకి వచ్చిన సమస్యేంటి? ఏం జరుగుతోంది?