Threads App Features: థ్రెడ్స్ యాప్ వచ్చేసింది.. యూజర్లు ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి..

థ్రెడ్స్ యాప్ అందుబాటులోకి రావడంతో ఈ యాప్‌లో ఏఏ ఫీచర్స్ ఉన్నాయి.. ఎక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.. ఎలా లాగిన్ కావాలి.. ఇలా పలు విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

Threads App Features

Threads App: ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌కు పోటీగా మెటా సరికొత్త యాప్‌ థ్రెడ్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. థ్రెడ్స్ పేరుతో తీసుకొచ్చిన ఈ టెక్ట్స్ ఆధారిత యాప్ గురువారం ఐవోఎస్, ఆండ్రాయిడ్ వినియోగదార్లకు అందుబాటులోకి వచ్చింది. మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ ఈ యాప్‌ను ప్రారంభించిన తొలి రెండు గంటల్లోనే రెండు మిలియన్ల మంది, నాలుగు గంటల్లో ఐదు మిలియన్ల మంది, ఆ తరువాత కొద్ది గంటలకే ఏడు మిలియన్ల మంది డౌన్‌లోడ్స్ చేసుకున్నారు. దీనిలో ఫీచర్స్ ట్విటర్ తో సమానంగా ఉంటాయని మెటా తెలిపింది. ఇన్ స్టాగ్రామ్ నుండి చాలా ఫీచర్లను ఇందులో అందుబాటులో ఉన్నాయి.

Elon Musk: ‘థ్రెడ్స్’ ఫీచర్స్ ట్విటర్ నుంచి కాపీ ఫేస్ట్ చేశారా? ఎలాన్ మస్క్ ట్వీట్ వైరల్

థ్రెడ్స్ అందుబాటులోకి రావడంతో ఈ యాప్‌లో ఏఏ ఫీచర్స్ ఉన్నాయి, ఎక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఎలా లాగిన్ కావాలి? అనే విషయాలను తెలుసుకుందాం.

థ్రెడ్స్ యాప్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లలో యాప్ స్టోర్, ప్లే స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది. యూజర్లు డెస్క్‌టాప్‌సైట్ నుంచి కూడా థ్రెడ్స్‌ను వినియోగించవచ్చు.

థ్రెడ్స్ యాప్‌లో వినియోగదారులు గరిష్టంగా 500 అక్షరాలతో ఒక ఫోస్ట్ చేయొచ్చు.

థ్రెడ్స్ యాప్‌లో ఫొటోలు, వీడియోల విషయానికి వస్తే.. ట్విటర్‌లో మాదిరిగానే మీ ఖాతా నుంచి ఫొటోలను పంచుకోవచ్చు. ఐదు నిమిషాల నిడివి ఉన్న వీడియోలను పోస్టు చేయొచ్చు.

ఇన్ స్టాగ్రామ్‌లో అకౌంట్ ఉంటే థ్రెడ్స్ యాప్ కోసం మీరు ప్రత్యేకంగా ఖాతా తెరవాల్సిన అవసరం లేదు.  థ్రెడ్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వొచ్చు. యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే లాగిన్ అవ్వడానికి మీ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను ఆటోమెటిక్‌గా చూపుతుంది. మీరు మీ ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ను లాగిన్ అయ్యి ఉంటే పాస్‌వర్డ్ అవసరం లేదు.

థ్రెడ్స్ యాప్ లాగిన్ అయిన తరువాత ఫాలోవర్స్ ను ఎలా జోడించాలి అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది.. అయితే, మీరు ఎవరిని అనుసరించాలో ఎంచుకొనే అవకాశం ఉంటుంది. లాగిన్ అయిన తరువాత  మీ ఇన్ స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్న వ్యక్తుల మొత్తం జాబితాను యాప్‌లో చూపిస్తుంది. మీ ఎంపిక ఆధారంగా ఒకటి, కొన్ని, అందరిని ఫాలో కావొచ్చు. అంతేకాక, మీ ప్రొఫైల్‌ను పబ్లిక్‌గా, ప్రైవేట్‌గా ఉంచే అవకాశమూ ఉంటుంది.

థ్రెడ్స్‌లో ప్రకటనల కనిపిస్తాయా? అనే విషయానికి వస్తే.. ప్రస్తుతానికి థ్రెడ్స్ అనేది యాడ్ -ఫ్రీ యాప్. అయితే, యాప్‌లో త్వరలో మార్పులు చేసే అవకాశం ఉంది. అప్పటి వరకు వినియోగదారులకు ప్రకటనలు కనిపించవు.

థ్రెడ్స్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌ ఫీచర్స్‌ను పోలి ఉంటాయి. అదేవిధంగా ట్విటర్‌లో ఉన్న దాదాపు అన్ని ఫీచర్లను కలిగి ఉంటుంది. థ్రెడ్స్ మన్ముందు కాలంలో ట్విటర్‌కు పోటీగా సరికొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి.

–  మొత్తానికి థ్రెడ్స్ యాప్ అందుబాటులో రావటంతో ట్విటర్, థ్రెడ్స్ మధ్య సరికొత్త పోటీ ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు.

ట్రెండింగ్ వార్తలు