Raj Gopal Reddy: కాంగ్రెస్‌లో రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యల కలకలం.. ఏం జరుగుతోందో తెలుసా?

రాష్ట్ర రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్‌ చిక్కరు.. దొరకరు అన్నట్లే ఉంటారు. మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి..

కోమటిరెడ్డి బ్రదర్స్‌ మాటలకు అర్థాలు వేరా…? రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారంటూ నల్లగొండ బ్రదర్స్‌లో ఒకరైన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? కాంగ్రెస్‌ మార్క్‌ పాలిటిక్స్‌లో ఏదైనా జరగొచ్చని అనుకోవాలా? మంత్రి పదవి కోసం ఉత్తమ్‌ అడ్డు రాకుండా కాకా పడుతున్నారని భావించాలా? తన నాలుకపై మచ్చ ఉందని.. తాను చెప్పేది నిజమౌతుందని చెబుతున్న రాజగోపాల్‌రెడ్డికి ఇంకేమైనా రహస్యం తెలుసా..?

కాంగ్రెస్‌ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యం కాస్త ఎక్కువ. ఎవరికి నచ్చింది వారు మాట్లాడొచ్చు ఆ పార్టీలో… ఎవరి ఇష్టం వారిది… ప్రతివారికీ ఓ లెక్కుంటుంది.. దానికో లాజిక్కు ఉంటుంది. కాంగ్రెస్‌ పాలిటిక్స్‌ తెలియనివారెవరికి అంత ఈజీగా ఏదీ అర్థం కాదు. ఇక కాంగ్రెస్‌లో సీనియర్స్‌ అయిన నల్గొండ బ్రదర్స్‌ రూటే సెపరేటు. వారి మాటలు.. వ్యూహాలు ఎవరికీ అంతుచిక్కవు. ఇద్దరు బ్రదర్స్‌లో ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ అర్థం కాదు.

ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలపై పూర్తి పట్టున్న కోమటిరెడ్డి బ్రదర్స్‌కు తొలి నుంచి అదే జిల్లాకు చెందిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పెద్దగా సంబంధాలు లేవనే చెబతారు. ఈ జిల్లాలో ముగ్గురు సీనియర్ లీడర్లు ఉండగా, ఎవరి దారి వారిదే… ఒకరు వ్యవహరాల్లో ఇంకొకరు జోక్యం చేసుకోరు.

జానారెడ్డి సైలెంట్‌ అయిపోవడంతో..
జానారెడ్డి రాజకీయంగా సైలెంట్‌ అయిపోవడంతో ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో కోటమిరెడ్డి బ్రదర్స్‌తోపాటు ఉత్తమ్ కుమార్‌రెడ్డి దంపతులు శాసిస్తున్నారు. ఐతే ఇప్పుడు ఉన్నట్లుండి మంత్రి ఉత్తమ్‌ను కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పొగడ్తలతో ముంచెత్తడమే రాజకీయంగా ఇంట్రెస్టింగ్‌ మారింది. ఏకంగా కాబోయే ముఖ్యమంత్రి ఉత్తమ్‌ అంటూ వ్యాఖ్యలు చేసిన రాజగోపాల్‌ కాంగ్రెస్‌తోపాటు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు తెరలేపారంటున్నారు.

కాంగ్రెస్‌లో సీనియర్‌ నేతగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎప్పటి నుంచో సీఎం సీటును ఆశిస్తున్నా.. గత ఎన్నికల ముందు తన ప్రజాదరణతో పార్టీని గెలిపించిన రేవంత్‌రెడ్డికి సీఎం పీఠం అప్పగించింది కాంగ్రెస్‌ అధిష్టానం. 8 నెలలుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ఇటు కోమటిరెడ్డి బ్రదర్స్‌తోపాటు అటు ఉత్తమ్‌ను సైతం ప్రోత్సహిస్తూ అన్నిరకాలుగా కలుపుకుని పోతున్నారు. ఇలాంటి సమయంలో అసలు రాజకీయంగా ఎలాంటి శూన్యత లేని పరిస్థితుల్లో కాబోయే సీఎం అంటూ రాజగోపాల్‌ చేసిన వ్యాఖ్యలతో అటు ఉత్తమ్‌తో పాటు మిగిలిన కాంగ్రెస్‌ నేతలు ఒక్కసారి కంగుతిన్నారు. రాజగోపాల్‌ వ్యాఖ్యల వెనుక మర్మమేంటంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు.

సీఎం రేవంత్‌రెడ్డి మంత్రివర్గంలో బెర్త్‌ను ఆశిస్తున్న రాజగోపాల్‌రెడ్డి… సీనియర్‌ మంత్రి ఉత్తమ్‌ అడ్డురాకుండా చూసుకోవాలనే వ్యూహంతోనే ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? లేక సీఎం రేవంత్‌రెడ్డిపై ఒత్తిడి పెంచేందుకు ఉత్తమ్‌ను పొగడ్తలతో ముంచెత్తారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రాజగోపాల్‌రెడ్డి… మంత్రివర్గంలో బెర్త్‌ హామీతోనే కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఐతే తొలివిడతలోనే రాజగోపాల్‌రెడ్డి అన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మంత్రి పదవి కేటాయించారు సీఎం రేవంత్‌ రెడ్డి. అన్నదమ్ములిద్దరినీ ఒకేసారి క్యాబినెట్లోకి తీసుకుంటే విమర్శలు వస్తాయని రాజగోపాల్‌ను వెయిటింగ్‌లో పెట్టినట్లు చెబుతున్నారు. ఐతే మలివిడత విస్తరణలో రాజగోపాల్‌రెడ్డి తప్పకుండా అవకాశమిస్తామని అప్పట్లో హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు.

రాజగోపాల్‌ రెడ్డికి పదవి?
ఇక మంత్రివర్గ విస్తరణ ఎప్పటికప్పుడు వాయిదా పడుతుండటం… ప్రధానంగా రాజగోపాల్‌ రెడ్డికి పదవి ఎలా ఇస్తారని.. ఒకే ఇంట్లో ఇద్దరికి పదవులెలా? అంటూ ప్రశ్నలు తలెత్తడం వల్లే విస్తరణ వాయిదా వేస్తున్నట్లు కాంగ్రెస్‌ వర్గాల సమాచారం. దీనికి ప్రధాన కారణం మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి భార్య పద్మావతిని కూడా మంత్రి చేయాలనే ప్రతిపాదన తెరపైకి తేవడమే అంటున్నారు. దీంతో ఉత్తమ్‌ను మెప్పించేలా రాజగోపాల్‌ కావాలనే కాబోయే సీఎం అంటూ వ్యాఖ్యలు చేశారని అనుమానిస్తున్నారు పరిశీలకులు.

కాంగ్రెస్‌ అధిష్టానం వద్ద మంత్రి ఉత్తమ్‌కు మంచి పరపతి ఉందని, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఇచ్చిన ప్రాధాన్యమే ఉత్తమ్‌కు ఇస్తోందని విశ్లేషణలు ఉన్నాయి. అందుకే రాష్ట్ర పార్టీ వ్యవహారాల్లో ఏ ముఖ్య నిర్ణయం తీసుకోవాలన్నా, ఉత్తమ్‌తో తప్పనిసరిగా సంప్రదిస్తున్నట్టు టాక్‌. ఇది తెలుసుకున్న రాజగోపాల్‌రెడ్డి… సీఎం రేవంత్‌ రెడ్డితో తనకు ఎలాంటి ఇబ్బంది లేనందున… ఉన్న ఏకైక అడ్డు తొలగించుకోవాలంటే ఉత్తమ్‌ను మంచి చేసుకోవడం ఒక్కటే మార్గమనే ఆలోచనతోనే ఈ తరహా వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు.

రాష్ట్ర రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్‌ చిక్కరు.. దొరకరు అన్నట్లే ఉంటారు. మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి బలమైన మద్దతుదారుగా మారగా, రాజగోపాల్‌రెడ్డి అటు సీఎంతో మంచి ర్యాపో మెంటెయిన్‌ చేస్తూనే ఉత్తమ్‌ను ప్రసన్నం చేసుకోడానికి ప్రయత్నిస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఏదిఏమైనా కాబోయే సీఎం ఉత్తమ్‌ అంటూ వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి… కాంగ్రెస్‌లో కలకలం రేపారు. ఈ పరిస్థితుల్లో మంత్రివర్గ విస్తరణ ఆలస్యం చేస్తే ఇంకెన్ని విధాలుగా ప్రచారాలు మొదలు అవుతాయో.. ఎవరెవరు ఎలాంటి స్టేట్‌మెంట్లు ఇస్తారోననే కాంగ్రెస్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Also Read: వైసీపీ ఫైర్‌బ్రాండ్‌ రోజా మనసు మారిందా? పూర్తి వివరాలు

ట్రెండింగ్ వార్తలు