Hydra demolitions: హైడ్రాపై కాంగ్రెస్‌లోనూ గుస్సా! ఏం జరుగుతోంది?

హైడ్రా పేరుతో ఏం చేస్తున్నారని ప్రభుత్వ పెద్దలతో కాంగ్రెస్ అధిష్ఠానం ఆరా తీసిందని పార్టీలో..

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్‌పై సొంత పార్టీ నేతలే గుర్రుగా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న హైడ్రాపై కాంగ్రెస్‌ నేతలు కారాలు, మిరియాలు నూరుతున్నారు. ఇన్నాళ్లు విపక్షమే హైడ్రాను టార్గెట్‌ చేస్తే.. ఇప్పుడు హస్తం పార్టీ చేతులు పడుతున్నాయి. ఇష్టం వచ్చినట్లు కూల్చేస్తే ఎలా అంటూ ప్రశ్నిస్తున్న కాంగ్రెస్‌ సీనియర్లు ఏకంగా అధిష్టానానికి ఫిర్యాదులు పంపుతున్నారట… కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు తాజాగా చేసిన ట్వీట్‌లతో ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించినట్లైందంటున్నారు.

తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన హైడ్రా ఇప్పుడు టాక్ ఆఫ్ ద స్టేట్‌గా మారింది. ఎక్కడ చూసిన హైడ్రా పేరే మారు మ్రోగుతోంది. ముఖ్యంగా అవుటర్ రింగ్ రోడ్ లోపల గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు కాపాడటం కోసం రేవంత్ రెడ్డి సర్కారు హైడ్రా తీసుకొచ్చింది. దీనికి సీనియర్ ఐపీఎస్ ఏవీ రంగనాథ్‌ను కమిషనర్‌గా నియమించి ఫుల్ పవర్స్ ఇచ్చింది ప్రభుత్వం.

రోజుకొక చోట హైడ్రా బుల్డోజర్లు
రూల్స్‌కు భిన్నంగా ఉన్న కట్టడాలను నిర్ధాక్ష్యిణంగా కూల్చేయమని ఆదేశాలిచ్చింది సర్కారు. దీంతో రోజుకొక చోట హైడ్రా బుల్డోజర్లు అక్రమ కట్టడాలపై విరుచుకుపడుతున్నాయి. ఇక చెరువుల్లో ఫుల్ ట్యాంక్ లెవల్ – ఎఫ్టీఎల్‌లో ఉన్న నిర్మాణాలు తొలగించుకోవాలని ఇప్పటికే వందల నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది.

ఇంత వరకు అంతా బాగానే ఉన్నా… కొన్ని అంశాలు సర్కారుకు తలనొప్పిగా మారుతున్నాయి. బంజారాహిల్స్లో ఒక పార్కు స్థలం విషయంలో ఏకంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై కేసు పెట్టింది హైడ్రా. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న దానం.. హైడ్రాపై చిర్రుబుర్రులాడారు. సిటీకి ఎంతో మంది కమిషనర్లు వస్తుంటారు.. పోతుంటారు.. దానం లోకల్ అంటూ సినీ డైలాగ్స్ వదిలారు దానం.

అలా దానం రెచ్చిపోయినప్పటి నుంచి హైడ్రా దూకుడు మరింత పెంచింది. దానం నాగేందర్‌కు కూడా సీఎం అక్షింతలు వేశారనే టాక్ కూడా నడిచింది. ఇక సినీ నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో బడాబాబుల్లో ఒక్కసారిగా హైడ్రా దడ మొదలైంది… ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారింది. ఆ తర్వాత నాగార్జున ఎన్ కన్వేన్షన్ ఇష్యూ లో స్టే ఇవ్వడంతో ఆ అంశం ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది.

ఇక తాజాగా హైడ్రాపై మరో సీనియర్ కాంగ్రెస్ నేత కన్నెర్ర చేశారు. కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు సోదరులకు సంబంధించిన ప్రాపర్టీని కూడా హైడ్రా నేలమట్టం చేసింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పల్లంరాజు .. తెలంగాణ సర్కారు తీరుపై గుర్రుగా ఉన్నారు. అవుటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ఏడు ఎకరాల విస్తీర్ణంలో తన సోదరుడు ప్రసాద్ నిర్వహిస్తున్న స్పోర్ట్స్ విలేజ్‌ను ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు పల్లం రాజు.

పార్టీ అగ్రనాయకత్వం దృష్టికి
నోటీసులు లేకుండా.. తమ వాదన వినకుండా ఏకపక్షంగా హైడ్రా వ్యవహరించడం బాధగా ఉందంటూ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు పల్లంరాజు. ఇదే విషయాన్ని పార్టీ అగ్రనాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. పార్టీలో ఎంతో సిన్సియర్‌గా, కేంద్ర మంత్రిగా పనిచేసి గౌరవప్రదంగా ఉన్న తమను అనవసరంగా రోడ్డు మీదకు లాగారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పల్లంరాజు. తమ కుటుంబానికి చెందిన స్థలంలో స్పోర్ట్స్ విలేజ్ ను నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు తీసుకొని నిర్వహిస్తున్నా ఇలా చేయడం కరెక్ట్ కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని పార్టీ అగ్ర నాయకత్వం రాహుల్ గాంధీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జ్ కేసీ వేణుగోపాల్, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలను కలిసి పల్లం రాజు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది

మాజీ మంత్రి పల్లంరాజు చేసిన ఫిర్యాదుపై పార్టీ అధిష్టానం కూడా ఆరా తీసిందట. ఇంతకీ తెలంగాణలో ఏం జరుగుతోందని వాకబు చేసిందట. హైడ్రా పేరుతో ఏం చేస్తున్నారని ప్రభుత్వ పెద్దలతో కాంగ్రెస్ అధిష్ఠానం ఆరా తీసిందని పార్టీలో చర్చ జరుగుతోంది. అప్పటి నుంచే హైడ్రా నోటీసులు ఇవ్వడం ప్రారంభించిందనే టాక్ నడుస్తోంది. ఇక దీనికి తోడు గండిపేట, హిమాయత్‌సాగర్ చుట్టూ కాంగ్రెస్‌ ముఖ్యనేతల ఫామ్‌ హౌస్లు ఉండటంతో ఆయా నేతలు సైతం ఆందోళన చెందుతున్నారు.

వీరి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారంటూ ప్రతిపక్షం తీవ్ర ఒత్తిడి చేస్తోంది. ఇదంతా ఒక ఎత్తయితే.. సకలం చెరువులో ఓవైసీ కుటుంబం నిర్మించిన కాలేజ్ ను ఎందుకు కూల్చడం లేదంటూ బిజేపీ ఏకంగా హైడ్రా కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. మరోవైపు అక్బరుద్దీన్ ఓవైసీ తనపై బులెట్ల వర్షం కురిపించండి.. కానీ తన కాలేజీల జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ అల్టిమేటం జారీ చేశారు.

ఇలా హైడ్రా దూకుడు ఇప్పుడు సీఎం రేవంత్ కు పులి మీద స్వారీలా మారింది. హైడ్రా చర్యలు ప్రభుత్వ పెద్దలకు పెద్ద తలనొప్పిగా మారాయి. విపక్షాల విమర్శలు, స్వంత పార్టీ నేతల ఒత్తిడితో సర్కారుకు హైడ్రా సెగ గట్టిగానే తగులుతోంది. మునుముందు ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందోనని ఆసక్తి నెలకొంది.

Also Read: కాంగ్రెస్‌లో రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యల కలకలం.. ఏం జరుగుతోందో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు