Goa Govt Jobs New Rule : ప్రైవేటు ఉద్యోగ అనుభవం ఉన్నవారికే ప్రభుత్వ ఉద్యోగం : గోవా గవర్నమెంట్ కొత్త రూల్..

ప్రభుత్వ ఉద్యోగానికి ఏడాది ప్రైవేటు ఎక్స్ పీరియన్స్ ఉండాల్సిందే గోవా గవర్నమెంట్ కొత్త రూల్ పెట్టింది. ప్రభుత్వానికి నైపుణ్యం కలిగి అనుభవం ఉన్నవారు కావాలని గోవా సీఎం వెల్లడించారు.

Goa Govt Jobs New Rule : ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకునే వారికి గోవా గవర్నమెంట్ ఓ సరికొత్త రూల్ ను ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం ఏడాది పాటు ఏదైనా ప్రైవేటు సంస్థలో పనిచేసిన అనుభవం తప్పనిసరి అని పేర్కొంది. మంగళవారం (నవంబర్ 8,2022) ఉత్తరగోవాలోని తలీగావో గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గోవా సీఎం ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ..ప్రభుత్వానికి అనుభవం కలిగిన ఉద్యోగులు కావాలని ఇకపై ప్రభుత్వ ఉద్యోగాలు కావాలనుకునేవారికి తప్పకుండా ప్రైవేటు రంగంలో పనిచేసిన అనుభవం ఉండాలని వెల్లడించారు. ఎలాంటి అనుభవంలేని వాళ్లను నేరుగా ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకోవడం వల్ల పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు.

ప్రైవేటులో అనుభవం రూల్ వల్ల ప్రభుత్వ ఉద్యోగాలకు నైపుణ్యం కలిగిన అభ్యర్థులు లభిస్తారని అన్నారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్ సీ) ద్వారా చేపట్టే నియామకాల్లో ఈ రూల్ ను తప్పనిసరి చేస్తున్నామని..ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని అనుకుంటే ముందు ప్రైవేటు రంగంలో ఏడాది పాటు పని చేయాలని యువతకు సూచించారు సీఎం. అలాగే ఉద్యోగం కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకుల చుట్టూ తిరగకుండా అభ్యర్ధులు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు అని స్పష్టంచేశారు.

ప్రభుత్వ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా.. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. ఉద్యోగ అనుభవంతో యువతకు బాధ్యతలు తెలిసొస్తాయని, నైపుణ్యం పెరుగుతుందని చెప్పారు. ఈ నిబంధన వల్ల ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నైపుణ్యం కలిగిన అభ్యర్థులు దొరుకుతారని ఆయన వివరించారు.

ట్రెండింగ్ వార్తలు