Manthani Constituency: మంథనిలో కాంగ్రెస్ ధీమా.. మరో చాన్స్ ఇవ్వమంటున్న మధు.. బీజేపీ పరిస్థితి ఏంటి?

బీఆర్‌ఎస్ అభ్యర్థి ఎవరో తేలిపోతే.. మంథని రాజకీయం మరింత రక్తి కట్టొచ్చు. ప్రస్తుతానికి పుట్టా మధు, నారాయణరెడ్డి పోటాపోటీగా తిరుగుతున్నారు.

Manthani Assembly Constituency Ground Report

Manthani Assembly Constituency: ఉద్దండులు ఓనమాలు దిద్దిన నియోజకవర్గం మంథని.. మాజీ ప్రధాని పీవీ, మాజీ స్పీకర్ శ్రీపాదరావు (Duddilla Sripada Rao) ప్రతినిధ్యం వహించిన మంథని.. కాంగ్రెస్‌కు కంచుకోట. రాష్ట్రవ్యాప్తంగా గులాబీ రెపరెపలాడినా.. ఇక్కడ మాత్రం హస్తం హవాయే కొనసాగుతోంది. 2014లో ఒక్కసారి గెలిచిన గులాబీ పార్టీ మళ్లీ గెలవాలని శతవిధాలా ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ మాత్రం చెక్కుచెదరని ధీమానే ప్రదర్శిస్తోంది. ఇక ఈ నియోజకవర్గం నుంచి కొత్తగా వికసించాలని చూస్తోంది కమలం పార్టీ. ఢీ అంటే ఢీ అనే స్థాయిలో జరుగుతున్న పొలిటికల్ ఫైట్‌లో ఈసారి విజేత ఎవరు? మంథనిలో కనిపించబోయే సీనేంటి?

పెద్దపల్లి జిల్లాలోని మంథని నియోజకవర్గం హాట్‌హాట్ రాజకీయాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా (karimnagar district) లో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే కాంగ్రెస్ గెలిచిన ఏకైక స్థానం మంథని.. గత ఎన్నికల నుంచి ఇప్పటివరకు ఎప్పుడూ వాడివేడి రాజకీయానికి వేదికగా మారింది మంథని.. ఒకప్పుడు హేమాహేమీ నాయకులను గెలిపించిన చరిత్ర మంథనిది.. ఇక్కడి ఎమ్మెల్యేగా పనిచేసిన పీవీ నరసింహారావు (PV Narasimha Rao) దేశ ప్రధానిగా సేవలు అందించారు. అంతేకాదు మావోయిస్టు ఉద్యమానికి ఆయువు పట్టుగా ఉండేది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్న ప్రాంతం కూడా మంథనే.

నియెజకవర్గంలో మొత్తం ఓటర్లు 2 లక్షల 19 వేల 120 మంది ఓటర్లు ఉండగా, వీరిలో పురుషులు లక్ష 9 వేల 14 మంది, మహిళలు లక్ష 10 వేల 101 మంది. మొత్తం పది మండలాలుండగా.. పెద్దపల్లి జిల్లా పరిధిలో మంథని, ముత్తారం, రామగిరి, కమాన్ పూర్, పాలకుర్తి మండలంలోని కొన్ని గ్రామాలు, భూపాలపల్లి జిల్లాలో కాటారం, మల్హర్, మహదేవపూర్, పలిమెల, మహముత్తారం మండలాలున్నాయి. మున్నురు కాపు, పద్మశాలి సామాజిక వర్గాల ఓట్లే అధికంగా ఉన్నాయి. ఐతే ఎన్నికల్లో కుల ప్రభావం కన్నా.. అభివృద్ధి, రాజకీయ, సామాజిక అంశాలపై ఆధారపడే తీర్పునిస్తుంటారు ఓటర్లు.

Duddilla Sridhar Babu

సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు (Duddilla Sridhar Babu) ఇప్పటివరకు నాలుగుసార్లు ఎన్నికయ్యారు. ఆయన తండ్రి, మాజీ స్పీకర్ శ్రీపాదరావు హత్య తర్వాత వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చినా.. కాంగ్రెస్‌లో మంచి పట్టుసాధించి బలమైన నాయకుడిగా ఎదిగారు. 1999 నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఒక్క 2014లో తప్ప మిగిలిన నాలుగు ఎన్నికల్లో విజయఢంకా మోగించారు శ్రీధర్‌బాబు. ఐతే ప్రతిపక్షానికి చెందిన తన నియోజకవర్గ అభివృద్ధికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం సహకరించడం లేదని ఆరోపిస్తున్నారు ఎమ్మెల్యే. ముంపు గ్రామలు, సింగరేణి నిర్వసితుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రజల దృష్టిలో పెట్టి మరోసారి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు శ్రీధర్ బాబు.

Putta Madhu

రాష్ట్రంలో బీఆర్‌ఎస్ హవా నడుస్తోందని.. తనకు మరో చాన్స్ ఇవ్వమని కోరుతున్నారు మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు (Putta Madhu). బలమైన బీసీ నాయకుడిగా ఎదిగిన పుట్ట మధు వివాదాలకు కేంద్రంగా మారడంతో ఈ సారి టిక్కెట్ దక్కడం కష్టమనే టాక్ వినిపిస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్‌గా అవకాశం ఇచ్చింది బీఆర్‌ఎస్ అధిష్టానం. ఐతే లాయర్ వామనరావు దంపతుల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మధు వల్ల పార్టీకి చెడ్డపేరు వచ్చిందని.. ఆయన ప్రత్యర్థులు అధిష్టానానికి ఫిర్యాదు చేస్తుండటంతో ఈసారి మధుకు అవకాశం వస్తుందా? రాదా? అన్న డౌట్ క్యాడర్‌లో ఉంది. అధిష్లానం మధును దూరం పెట్టిందని కొదరు, ఆయనే దూరంగా ఉంటున్నారు మరికొందరు చర్చించుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో మధు బీజేపీ, బీఎస్పీ వైపు చూస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.

Also Read: సిరిసిల్లలో కేటీఆర్‌ను ఢీకొట్టేందుకు విపక్షాలు వేస్తున్న ఎత్తులేంటి.. బీజేపీ నుంచి పోటీచేసేదెవరు?

Chandrupatla Sunil Reddy

నిన్నమొన్నటి వరకు పుట్ట మధుకే టిక్కెట్ అని భావిస్తున్న తరుణంలో పొలిటికల్ స్క్రీన్ పైకి సడెన్ గా ఎంట్రీ ఇచ్చారు కాటారం సింగిల్ విండో చైర్మన్ చల్ల నారాయణ రెడ్డి (Challa Narayana Reddy). తనకు అధిష్టానం భరోసా ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. మధు దూరంగా పెట్టిన ఉద్యకారులను, ప్రజా ప్రతినిధులను కలుపుకుని తిరుగుతున్నారు నారాయణరెడ్డి. ఇక ఈ సెగ్మెంట్ లో బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. ఇటీవల కాలంలో ఆ పార్టీకి క్యాడర్ పెరిగింది. మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి తనయుడు సునీల్ రెడ్డి (Chandrupatla Sunil Reddy) బీజేపీ టిక్కెట్ ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీచేసిన సనత్ కుమార్ కొంతకాలంగా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో సునీల్ రెడ్డికే టిక్కెట్ అంటున్నారు బీజేపీ నాయకులు.

Also Read: ధర్మపురిలో వివేక్ పోటీ చేస్తే ట్రయాంగిల్ ఫైట్.. హీటెక్కుతోన్న ధర్మపురి రాజకీయం!

మొత్తానికి సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మరోసారి పోటీ చేయడం ఖాయంగా తేలిపోయింది. ఆయనకు మరోనేత పోటీ లేకపోవడంతో లైన్‌క్లియర్ అయినట్లే.. ఇక బీఆర్‌ఎస్‌లో మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు భవితవ్యంపైనే పెద్దగా చర్చ జరుగుతోంది. బీఆర్‌ఎస్ అభ్యర్థి ఎవరో తేలిపోతే.. మంథని రాజకీయం మరింత రక్తి కట్టొచ్చు. ప్రస్తుతానికి పుట్టా మధు, నారాయణరెడ్డి పోటాపోటీగా తిరుగుతున్నారు. ఈ ఇద్దరులో అభ్యర్థి ఎవరైనా సరే కాంగ్రెస్‌తో ఢీ అంటే ఢీ అన్న రేంజ్‌లోనే పోటీ ఉండనుంది.

ట్రెండింగ్ వార్తలు