కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి నిధులివ్వడంపై హరీశ్ రావు ఏమన్నారంటే..

తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి ఎందుకింత నిర్లక్ష్యం? ఏపీలో వెనుకబడిన జిల్లాల గురించి మాట్లాడిన కేంద్రం.. తెలంగాణలో వెనుకబడిన జిల్లాల గురించి ఎందుకు మాట్లాడలేదు?

Harish Rao : కేంద్ర బడ్జెట్ పై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో జాతీయ పార్టీలను గెలిపిస్తే.. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారని హరీశ్ రావు విమర్శించారు. బడ్జెట్ లో రాష్ట్రానికి నిధులు కేటాయించేలా.. కేంద్రాన్ని ఒప్పించడంతో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని హరీశ్ రావు మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్న హరీశ్ రావు, రెండు జాతీయ పార్టీల ఎంపీలు(బీజేపీ, కాంగ్రెస్) నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని హరీశ్ రావు అన్నారు. తెలంగాణపై కేంద్రం శీతకన్ను ప్రదర్శిస్తోందని ధ్వజమెత్తారు.

”కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు మళ్లీ మొండి చేయి చూపించారు. బడ్జెట్ లో రాష్ట్రానికి నిధుల కేటాయించడం పక్కన పెడితే.. కనీసం తెలంగాణ పేరు కూడా ప్రస్తావించలేదు. కాంగ్రెస్, బీజేపీ నేతలు తెలంగాణకు తీరని అన్యాయం చేశారు. కేంద్ర బడ్జెట్ చూస్తే చాలా బాధగా ఉంది. ఆంధ్రప్రదేశ్ పేరుని చాలా సార్లు ఉచ్చరించారు. ఏపీకి నిధులు ఎందుకిచ్చారని నేను అడగను. ఏపీలో పోలవరం త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. రాజధానికి డబ్బులు ఇస్తామన్నారు. వెనుకబడిన జిల్లాలకూ డబ్బులిస్తామన్నారు.

ఏపీకి నిధులు ఇస్తామని చెప్పడం సంతోషం. మరి తెలంగాణ సంగతి ఏంటి? రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తోంది? కేంద్రంతో మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాం అన్నారు. మోదీకి చాలా దగ్గరగా ఉన్నామన్నారు. కేంద్ర మంత్రులను రోజూ కలుస్తున్నామన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశాయి. తెలంగాణలో 9 వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి. ఏపీలో వెనుకబడిన జిల్లాల గురించి మాట్లాడిన కేంద్రం.. తెలంగాణలో వెనుకబడిన జిల్లాల గురించి ఎందుకు మాట్లాడలేదు?

తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు చొరవ చూపడం లేదు? ఆంధ్రలో వెనుకబడిన జిల్లాలకు డబ్బులు ఇచ్చినప్పుడు.. తెలంగాణలోని వెనుబడిన జిల్లాలకు ఎందుకు మొండిచేయి చూపుతున్నారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి ఎందుకింత నిర్లక్ష్యం? అని అడుగుతున్నా. జాతీయ ప్రాజెక్ట్ గురించి ఊసే లేదు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వొచ్చు కదా. ఏపీకి ఇచ్చినప్పుడు మాకూ ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వాలి కదా” అని హరీశ్ రావు అన్నారు.

”కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం. శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా మాజీ స్పీకర్ మధుసూదనాచారిని ఎన్నుకున్నాం. మిగతా కార్యవర్గాలను త్వరలోనే ఎన్నుకుంటాము. 25, 26 తేదీల్లో మేడిగడ్డ, కన్నెపల్లి ప్రాజెక్టుల సందర్శన. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రాజెక్టుల సందర్శన. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేసుకున్నాము. నిరుద్యోగులకు ప్రభుత్వం తీరని ద్రోహం చేసింది. మీరు మేనిఫెస్టోలో పెట్టిన దాన్నే అమలు చేయాలని కోరాము.

రేపు నిరుద్యోగుల అంశంపైనే వాయిదా తీర్మానం. ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోతుంది. ధాన్యం కుంభకోణంపై పోరాటం చేస్తాం. పక్క రాష్ట్రంలో నిషేధం ఉన్న సోం డిస్టిలరీస్ కు ఎలా అనుమతి ఇచ్చారు? అనుమతుల వెనుక ఉన్న అదృశ్య శక్తులు ఎవరు? దీని వెనుక ఉన్నదెవరో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. బయట పెడతాము. రుణమాఫీ, రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోంది. ఈ అంశాలల్లో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతాము. తెలంగాణకు నిధులు ఇవ్వాలని రాహుల్ గాంధీని మాట్లాడమని చెప్పండి. రాహుల్ కు తెలంగాణ అవసరం లేదా?” అని హరీశ్ రావు ప్రశ్నించారు.

Also Read : తెలంగాణ పట్ల కక్షపూరితంగా వ్యవహరించారు, ఇంత వివక్ష ఎప్పుడూ జరగలేదు- కేంద్ర బడ్జెట్‌పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్

ట్రెండింగ్ వార్తలు