వైసీపీకి బిగ్ షాక్‌ తప్పదా? అధికార పార్టీకి దగ్గరవుతున్న ఎమ్మెల్సీలు..!

గతంలో మైనార్టీ వ్యవహారాల మంత్రి ఫరూక్‌తో భేటీ అయిన జకియా ఖానం అప్పట్లోనే టీడీపీలో చేరతారని ప్రచారానికి బీజం వేశారు. ఇప్పుడు లోకేశ్‌ను కలవడంతో ఆమె టీడీపీలో చేరడం దాదాపు ఖాయమన్న టాక్‌ వినిపిస్తోంది.

Gossip Garage : దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సూక్తిని వైసీపీ ఎమ్మెల్సీలు పాటిస్తున్నారా? ప్రతిపక్ష పార్టీలో కొనసాగలేక.. అధికార పార్టీ వైపు చూస్తున్నారా? మంత్రి లోకేశ్‌తో శాసనమండలి వైఎస్‌ చైర్‌పర్సన్‌ జకియా ఖానం భేటీ దేనికి సంకేతం… గతంలో మంత్రి ఫరూక్‌ను కలిసిన జకియా ఖానం.. టీడీపీకి దగ్గరవుతున్నారా? అనే అనుమానాలకు బీజం వేశారు. ఇప్పుడు టీడీపీ యువనేత లోకేశ్‌ను కలవడంతో ఆమెకు రూట్‌ క్లియర్‌ అయిందంటున్నారు. జకియా ఒక్కరే కాదు మరికొంతమంది వైసీపీ ఎమ్మెల్సీలు ఆమె తోవలోనే నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పొలిటికల్‌ గాసిప్‌లో నిజానిజాలేంటి?

శాసనమండలిలో వైసీపీకి షాక్‌ తగిలే పరిస్థితులు..!
శాసనమండలిలో వైసీపీకి షాక్‌ తగిలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని వైసీపీ…. శాసనమండలి ద్వారా ప్రభుత్వంపై పోరాటానికి ప్రణాళికలు రచిస్తోంది. ఇదే సమయంలో ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు అధికార పార్టీకి దగ్గరవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. శాసనమండలి వైఎస్‌ చైర్మన్‌ జకియా ఖానం రెండు రోజుల కిందట మంత్రి నారా లోకేశ్‌ను కలవడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది.

గతంలో మైనార్టీ వ్యవహారాల మంత్రి ఫరూక్‌తో భేటీ అయిన జకియా ఖానం అప్పట్లోనే టీడీపీలో చేరతారని ప్రచారానికి బీజం వేశారు. ఇప్పుడు లోకేశ్‌ను కలవడంతో ఆమె టీడీపీలో చేరడం దాదాపు ఖాయమన్న టాక్‌ వినిపిస్తోంది. జకియాతోపాటు మరికొందరు ఎమ్మెల్సీలు టీడీపీతో టచ్‌లోకి వెళ్లినట్లు చెబుతున్నారు. ఐతే ఎమ్మెల్సీలను పార్టీలోకి తీసుకునే విషయంలో సీఎం చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు.

పార్టీ మారేందుకు మాజీ ఎమ్మెల్యే వ్యవహార శైలే ప్రధాన కారణం..!
మైనార్టీ కోటాలో 2020లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు జకియా ఖానం. మహిళ, మైనార్టీ కావడంతో 2021లో ఆమెకు మండలి వైఎస్‌ చైర్మన్‌ పదవి అప్పగించారు. గత అసెంబ్లీ ఎన్నికల వరకు వైసీపీతో మంచి సంబంధాలే నెరిపిన జకియా ఖానం…. ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత మనసు మార్చుకున్నట్లు కనిపిస్తున్నారు. నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు మంత్రులను కలవడంతోపాటు… వైసీపీ బహిష్కరించిన శాసన మండలి సమావేశాలకు సైతం హాజరయ్యారు. దీంతో జకియా ఖానం పొలిటికల్‌ జర్నీపై అంతా ఫోకస్‌ చేస్తున్నారు.

వైసీపీకి చెందిన రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డితో జకియా ఖానంకు విభేదాలు ఉన్నట్లు చెబుతున్నారు. శ్రీకాంత్‌రెడ్డి ఆధిపత్యం వల్ల తను నియోజకవర్గంలో నామమాత్రంగా మిగిలిపోయినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట జకియా ఖానం. పార్టీ మారేందుకు మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి వ్యవహార శైలే ప్రధాన కారణంగా ఆరోపిస్తున్నారు.

తిరిగి టీడీపీలోకి వచ్చేస్తామంటున్న వైసీపీలోకి వెళ్లిన ఎమ్మెల్సీలు..
మండలి వైఎస్‌ చైర్‌పర్సన్‌ జకియాతోపాటు మరికొంతమంది ఎమ్మెల్సీలు టీడీపీతో టచ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఇద్దరితోపాటు రాయలసీమకే చెందిన మైనార్టీ నేతలు కూడా టీడీపీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నట్లు అమరావతిలో టాక్‌ వినిపిస్తోంది. ఐతే టీడీపీ నుంచి ఇంతవరకు ఎవరికీ గ్రీన్‌సిగ్నల్‌ రాలేదని అంటున్నారు. కానీ, మండలిలో వైసీపీకి మెజార్టీ ఉండటంతో… ఆ పార్టీ నుంచి ఎమ్మెల్సీలను చేర్చుకోవాలనే ప్రతిపాదన టీడీపీ అధిష్టానం పరిశీలనలో ఉందంటున్నారు.

గతంలో టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన ఎమ్మెల్సీలు కూడా తిరిగి వచ్చేస్తామని మంత్రులను కలుస్తున్నట్లు చెబుతున్నారు. ఐతే ఇలాంటి వారి విషయంలో చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ పోతుల సునీత వంటివారు తిరిగి పార్టీలోకి వస్తామన్నా చేర్చుకోవద్దని కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్నారంటున్నారు.

త్వరలో చేరికలకు టీడీపీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చే అవకాశాలు..
ప్రస్తుతం శాసనమండలిలో వైసీపీకి మెజార్టీ ఉంది. మొత్తం 58 మంది సభ్యులకు గాను నాలుగు ఖాళీలు ఉన్నాయి. మిగిలిన 54 మందిలో వైసీపీ బలం 38. టీడీపీకి 9 మంది, జనసేనకు ఓ ఎమ్మెల్సీ ఉన్నారు. నలుగురు స్వతంత్రులు, ఇద్దరు పీడీఎఫ్‌ సభ్యులు మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సభలో టీడీపీ మెజార్టీ సాధించాలంటే ఇంకా 18 మంది ఎమ్మెల్సీలు అవసరం ఉంది. దీంతో ఇప్పుడు కాకపోయినా.. కొద్దిరోజుల్లో చేరికలకు టీడీపీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం జకియా ఖానంతోపాటు ఇద్దరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, ముగ్గురు మైనార్టీ ఎమ్మెల్సీలు, పోతుల సునీత టీడీపీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నట్లు చెబుతున్నారు.

అదేవిధంగా శాసనమండలి పక్ష నేతగా తనను ఎంపిక చేయనందుకు సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సైతం అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఉమ్మారెడ్డి అల్లుడు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య వైసీపీకి రాజీనామా చేశారు. దీంతో ఉమ్మారెడ్డి వైసీపీలో కొనసాగడంపై చర్చ జరుగుతోంది. జనసేన నేతలతో ఉమ్మారెడ్డి కుటుంబం టచ్ లో ఉందనే ప్రచారం రాజకీయంగా హీట్‌ పుట్టిస్తోంది.

చాలా మంది ఎమ్మెల్సీలు జంపింగ్‌కు సిద్ధంగా ఉన్నారనే టాక్..
ఇలా జకియా ఖానం తోవలో చాలా మంది ఎమ్మెల్సీలు జంపింగ్‌కు సిద్ధంగా ఉన్నారనే టాక్‌…. ఏపీలో రాజకీయాన్ని రంజుగా మార్చేస్తోంది. ప్రస్తుతం నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో బిజీగా ఉన్న చంద్రబాబు…. శ్రావణమాసంలో ఎమ్మెల్సీలపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. మొత్తానికి అమరావతిలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు… వైసీపీకి షాక్‌నిచ్చేలా కనిపిస్తున్నాయంటున్నారు.

Also Read : మీకు చంద్రబాబు పిచ్చి పట్టుకుంది.. అద్దంలో కూడా ఆయనే కనిపిస్తున్నారు: జగన్‌పై షర్మిల ఫైర్

ట్రెండింగ్ వార్తలు