మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంపై చంద్రబాబు సమీక్ష

ఈ పథకం అమలు చేస్తున్న తెలంగాణ, కర్ణాటకకు వెళ్లి అధికారులు అధ్యయనం చేశారు.

Chandrababu Naidu

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంపై ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించనున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల నెలకి రూ.250 కోట్లు భారం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ పథకం అమలు చేస్తున్న తెలంగాణ, కర్ణాటకకు వెళ్లి అధికారులు అధ్యయనం చేశారు. ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఏపీలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌తో పాటు విజయవాడ, విశాఖలోని సిటీ ఆర్డినరీ, మెట్రో సర్వీసులలో ఉచిత సదుపాయం కల్పించే అవకాశం ఉంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని ఆర్టీసీకి ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ చేయనుంది.

ప్రస్తుతం 70 శాతం ఉన్న ఏపీఎస్ఆర్టీసీ ఆక్యుఫెన్సీ రేషియో.. మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతిస్తే 95 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇవాళ జరిగే రివ్యూలో విధివిధానాలు ఎప్పటినుంచి అమలు చేసే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: గోల్డ్‌ రేట్లు తగ్గడానికి సుంకం తగ్గింపే కారణమా?

ట్రెండింగ్ వార్తలు