Narasapuram Lok Sabha Segment : ఉమాబాల వర్సెస్ వర్మ.. నరసాపురంలో ఎవరి సత్తా ఎంత?

తొలిసారి లోక్‌సభకు పోటీ చేస్తున్న ఈ ఇద్దరిలో ఎవరి సత్తా ఎంత?

Umabala Guduri Vs Bhupathiraju Srinivasa Varma

Narasapuram Lok Sabha Segment : నరసాపురం పార్లమెంట్‌ నియోజకవర్గం.. ఈ ఐదేళ్లు ఈ పేరు వినని వారు ఉండరు. రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారిన వైసీపీ బహిష్కృత ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న నరసాపురంలో పొలిటికల్‌ ట్విస్టులు పెద్దఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. అధికార పార్టీపై తిరుగుబాటు చేసి కూటమి అభ్యర్థిగా తానే పోటీలో ఉంటానని స్వయంగా ప్రకటించుకున్న రఘురామకృష్ణరాజుకు ఝలక్‌ ఇచ్చాయి కూటమి పార్టీలు.

ఆయన స్థానంలో వైసీపీ బీసీ వర్గానికి చెందిన మహిళా నేత ఉమాబాలను బరిలో దించగా, ఎన్‌డీఏ కూటమి నుంచి బీజేపీ అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాసవర్మ పోటీ చేస్తున్నారు. తొలిసారి లోక్‌సభకు పోటీ చేస్తున్న ఈ ఇద్దరిలో ఎవరి సత్తా ఎంత?

రాష్ట్ర రాజకీయాల్లో సెంటరాఫ్ అట్రాక్షన్ గా RRR..
రాజుల ఖిల్లాగా పేరొందిన నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ రాజకీయం చిత్ర విచిత్ర పరిణామాలకు కేంద్రంగా మారుతోంది. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ప్రకటన పూర్తయి.. వారు ప్రచార పర్వంలో బిజిగా ఉండగా, తాను కూడా రేసులో ఉన్నానని… తానే ఎన్‌డీఏ అభ్యర్థినంటూ చెబుతున్న సిట్టింగ్‌ ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణరాజు పొలిటికల్‌ ట్విస్టులు ఆసక్తికరంగా మారుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా విజయం సాధించిన రఘురామ గత నాలుగేళ్లుగా రాష్ట్ర రాజకీయాలకు సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా మారారు. అంతేకాకుండా ఈసారి పోటీ పక్కా అంటూ చెప్పుకున్న ఆయనకు ఏ పార్టీ అవకాశం ఇవ్వకపోవడం కూడా విస్తృత చర్చకు దారితీస్తోంది.

క్షత్రియులు, కాపుల ప్రభావం ఎక్కువ..
పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఆచంట, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, ఉండి, నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ ఏడు నియోజకవర్గాల్లోనూ క్షత్రియుల డామినేషన్ ఎక్కువ. ఇక కాపు సామాజిక వర్గం ప్రభావం కూడా అధికంగానే ఉంటుంది. ఉండి, నరసాపురం, ఆచంట నియోజకవర్గాల శాసనసభ్యులుగా క్షత్రియులే ఎన్నికవగా.. పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెంలో కాపు సామాజిక వర్గానికి చెందిన వారే శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. అంటే నియోజకవర్గం పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు ఆరుచోట్ల రెండు సామాజిక వర్గాల హవాయే కనిపిస్తోంది.

ఒక్క తణుకు నియోజకవర్గంలో మాత్రమే బీసీ నేత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో వచ్చే ఎన్నికల్లోనూ ఎంపీగా ఎవరు ఎన్నికవుతారనేది ఆసక్తికరంగా మారింది. అధికార పార్టీ వైసీపీ.. ఈసారి నరసాపురం నుంచి బీసీ, మహిళా నేతను బరిలోకి దింపి కొత్త ప్రయోగం చేస్తోంది. ఇక ఎన్‌డీఏ కూటమి నుంచి బీజేపీ తన అభ్యర్థిగా శ్రీనివాసవర్మను నిలుపుతోంది.

మూడో స్థానంలో నాగబాబు..
నరసాపురం పార్లమెంటులో 18 లక్షల జనాభా ఉండగా, 13 లక్షల ఓటర్లు ఉన్నారు. 2019 ఎన్నికలలో దాదాపు 11 లక్షల 74 వేల 441 ఓట్లు పోలయ్యాయ. వైసీపీ, టీడీపీ, జనసేన అభ్యర్థుల మధ్య జరిగిన త్రిముఖ పోటీలో కనుమూరు రఘరామ కృష్ణరాజుకు విజయం సాధించారు. ఆయనకు 4 లక్షల 47 వేల 594 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి శివరామరాజుకు 4 లక్షల 15 వేల 685 ఓట్లు వచ్చాయి.. ఇక జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన చిరంజీవి సోదరుడు నాగబాబుకు రెండు లక్షల 50 వేల 259 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కనుమూరు బాపిరాజు, ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా కేఏ పాల్ కూడా గత ఎన్నికల్లో నరసాపురం నియోజకవర్గంలోనే పోటీ చేసి డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు..

ప్రధాని పోటీ వైసీపీ, ఎన్డీయే కూటమి మధ్యే..
ఇక వచ్చే నెల 13న జరిగే ఎన్నికల్లో ద్విముఖ పోటీయే కనిపిస్తోంది. ప్రధానంగా వైసీపీ, ఎన్‌డీఏ కూటమి మధ్యే పోటీ జరగనుంది. ఇతర పార్టీలు పోటీ చేసినా, పెద్దగా ప్రభావం చూపే అవకాశం కనిపించడం లేదు. ఇక ప్రస్తుత ఎంపీ రఘురామకృష్ణరాజు… సొంత పార్టీపై తిరుగుబాటు చేసి గత ఐదేళ్లు నియోజకవర్గానికి దూరంగానే ఉంటూ వచ్చారు. ఒకటి రెండు సార్లు మాత్రమే నియోజకవర్గంలో పర్యటించిన రఘురామకృష్ణరాజు ఈసారి పోటీ చేస్తానని చెబుతున్నా.. ఎన్‌డీఏ కూటమి అభ్యర్థిని ఇప్పటికే ప్రకటించడంతో రఘురామ పోటీపై సస్పెన్స్‌ కొనసాగుతోంది.

100కోట్ల విలువైన పనులకు సీఎం జగన్ శంకుస్థాపన..
ఇదే సమయంలో వైసీపీ తన సిట్టింగ్‌ స్థానాన్ని నిలుపుకునేందుకు తెగ ప్రయత్నిస్తోంది. రఘురామకృష్ణరాజుకు వైఖరితో విసిగిపోయిన వైసీపీ.. ఈసారి బీసీ, మహిళా నేత గుడూరు ఉమాబాలకు టికెట్‌ ఇచ్చింది. అంతేకాకుండా నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. సీఎం జగన్‌ గత ఏడాది నియోజకవర్గంలో పర్యటించి దాదాపు 100కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఈ పనులు నిర్మాణ దశలో ఉన్నాయంటున్నారు వైసీపీ అభ్యర్థి ఉమాబాల. సీఎం జగన్‌ అమలు చేస్తున్న ప్రభుత్వ, సంక్షేమ పథకాలతో తాను విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఉమాబాల.

సంచలనం సృష్టిస్తానంటున్న వర్మ..
మరోవైపు బీజేపీ అభ్యర్థి శ్రీనివాసవర్మ కూడా విజయంపై గట్టి నమ్మకంతోనే ఉన్నారు. విద్యార్థి దశ నుంచి బీజేపీలోనే కొనసాగుతున్న శ్రీనివాసవర్మకు అనూహ్యంగా టికెట్‌ లభించింది. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో పని చేస్తున్న శ్రీనివాసవర్మ… క్షేత్రస్థాయి పరిస్థితులపై అవగాహన పెంచుకుంటున్నారు. ముఖ్యంగా ప్రధాని మోదీ ఇమేజ్‌తోపాటు కూటమి పార్టీల బలంతో తన విజయం ఖాయమంటున్నారు శ్రీనివాసవర్మ. నరసాపురం నియోజకవర్గం నుంచి గతంలో మూడుసార్లు బీజేపీ పోటీచేస్తే రెండుసార్లు విజయం సాధించిందని, ఒకసారి తక్కువ ఓట్ల తేడాతోనే ఓడిపోయిందని చెబుతున్నారు శ్రీనివాసవర్మ. ఇక వచ్చే ఎన్నికల్లో గెలిచి సంచలనం సృష్టిస్తానంటున్నారు. ఐతే సిట్టింగ్‌ ఎంపీ రఘురామ బీజేపీలో చేరలేదని… ఆయన చేరిన తర్వాతే నరసాపురం నుంచి పోటీపై మాట్లాడాలని అంటున్నారు శ్రీనివాసవర్మ.

ఇద్దరూ ఎన్నికల రాజకీయానికి కొత్త వారే..
మొత్తానికి నరసాపురం రాజకీయం మొత్తం ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్రంగానే జరుగుతోంది. రఘురామకు చెక్‌ చెప్పి వైసీపీ ఓవైపు.. ఆయన ఏ పార్టీలో లేడని కూటమిలోని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు మరోవైపు ఝలక్‌ ఇవ్వడమే పెద్ద చర్చకు దారితీస్తోంది. ఇక ఈసారి ప్రత్యర్థులుగా తలపడుతున్న ఇద్దరు నేతలు.. ఎన్నికల రాజకీయానికి కొత్త కావడంతో ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రభావంపైనే ఆధారపడ్డారు. ప్రస్తుతం నరసాపురం పార్లమెంట్‌ పరిధిలో ఉండిలో మాత్రమే టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తుండగా, మిగతా ఆరుచోట్ల వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు గెలుకుంటుందో ఎంపీ స్థానాన్ని ఆ పార్టీయే కైవసం చేసుకునే చాన్స్‌ కనిపిస్తోంది.

Also Read : కోలగట్ల, అదితి మధ్య టఫ్ ఫైట్.. విజయనగరంలో హైటెన్షన్ రాజకీయం

పూర్తి వివరాలు..

ట్రెండింగ్ వార్తలు