Cat Vs Snake : నాగుపాము బారి నుండి యజమాని కుటుంబాన్ని కాపాడిన పిల్లి

ఒడిశా రాష్ట్రంలోని భీమాతంగి ప్రాంతానికి చెందిన సంపద్ కుమార్ పరిదా కుటుంబం ఓ పిల్లిని పెంచుకుంటుంది.

Cat Vs Snake : పెంపుడు జంతువులు తమ యజమాని రక్షణ విషయంలో ఎంత సాహసం చేసేందుకైనా వెనుకాడవు. ఇంట్లో పెంచుకునే కుక్కలు ఎంతో విశ్వాసాన్ని ప్రదర్శిస్తాయి. కుక్కలే కాదు ఆకోవలోకి పిల్లులు కూడా వచ్చి చేరాయి. ఒడిశాలో కుక్కలాగే,  ఓ పిల్లి సాహసోపేతంగా నాగు పాము బారి నుండి తన యజమాని కుటుంబాన్ని కాపాడింది. ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఒడిశా రాష్ట్రంలోని భీమాతంగి ప్రాంతానికి చెందిన సంపద్ కుమార్ పరిదా కుటుంబం ఓ పిల్లిని పెంచుకుంటుంది. తెల్లని వర్ణం కలిగి చూడటానికి అందంగా కనిపించే ఆపిల్లికి చిను అనే పేరుకూడా పెట్టారు. తన యజమాని పెరట్లోకి వెళుతున్న సమయంలో ఓ నాగుపాము ఆయనకు చేరువలోకి రావటాన్ని గమనించిన చిను , పాముకు ఎదురుగా వెళ్ళి అడ్డుగా నిలబడింది. పెరట్లోని పామును ఇంటిలోని ప్రవేశించకుండా అడ్డుపడింది.

బుసలు కొడుతూ పడగవిప్పి పిల్లిని కాటువేసేందుకు ప్రయత్నిస్తున్నా అదరకబెదరక ధైర్యంగా నిలబడింది. దాదాపు అరగంటకు పైగా పామును ఇంటి లోపలికి రాకుండా పిల్లి అడ్డుకుంటూ తన యజమాని కుటుంబాన్ని పాము బారి నుండి కాపాడింది. ఈలోగా ఇంటి యజమాని సంపద్ స్నేక్ హెల్ప్ లైన్ కు కాల్ చేశాడు. వెంటనే వారు అక్కడి చేరుకుని పామును పట్టుకుని అడవిలో వదిలేశారు. ఈ సంఘటను చూసిన వారంతా ఆశ్ఛర్యపోయారు. పిల్లులు తమ యజమాని కోసం ఇంతలా విశ్వాసం ప్రదర్శిస్తాయని ఈఘటనతో ప్రత్యక్షంగా తెలుసుకున్నామని స్ధానికులు అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు