Divyanshu Rawat : దివ్యాన్షు రావత్ సక్సెస్ స్టోరీ.. కోచింగ్ లేకుండానే ఎస్ఎస్‌బీ పరీక్షలో 78వ ర్యాంకు సాధించాడు!

Divyanshu Rawat : చిన్నతనం నుంచి తాను ఆర్మీ యూనిఫాం వేసుకోవాలని కలలు కన్నాడు. ఇప్పుడు, అతను ఎట్టకేలకు సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (SSB) పరీక్షలో విజయం సాధించి తన కలను సాకారం చేసుకున్నాడు.

Divyanshu Rawat : సంకల్పం, కృషి, పట్టుదల ఉండాలేగానీ ఏదైనా సాధించవచ్చు. ఎంతటి కఠినమైన లక్ష్యాన్ని అయినా సులభంగా చేరుకోవచ్చు. ఇది అక్షరాలా సత్యమని నిరూపించి తమ కలను నిజం చేసుకున్న వారెందరో ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు ఉత్తరాఖండ్‌లోని శ్రీనగర్ గర్వాల్‌కు చెందిన దివ్యాన్షు రావత్. పట్టువదలని విక్రమార్కునిలా సంకల్పంతో ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు.

చిన్నతనం నుంచి తాను ఆర్మీ యూనిఫాం వేసుకోవాలని కలలు కన్నాడు. అందుకోసం రాత్రింబవళ్ళు కష్టపడి చదివాడు. ఇప్పుడు, ఎట్టకేలకు సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (SSB) పరీక్షలో విజయం సాధించి తన కలను సాకారం చేసుకున్నాడు. అంతేకాదు.. తల్లిదండ్రులను, ఉపాధ్యాయుడిని గర్వించేలా చేశాడు.

Read Also : CBSE Board Exams : టెన్త్, ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు..!

శ్రీనగర్ గర్వాల్‌కి ఆనుకుని ఉన్న చౌరాస్ ప్రాంతానికి చెందిన దివ్యాన్షు రావత్ తన ఎస్‌ఎస్‌బీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఆల్ ఇండియన్ (AIR) 78వ ర్యాంకు సాధించాడు. రావత్ విజయాన్ని ఆనందించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, బంధువులు ఎంతో గర్వపడుతున్నారు.

ఎస్‌ఎస్‌బీ ఎలా క్లియర్ చేశాడంటే? :
టెక్నికల్ ఆఫీసర్ ఎంట్రీ ద్వారా తాను ఎస్‌ఎస్‌బీ క్లియర్ చేశాడు. ఫిజికల్ స్కిల్స్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించాడు. ఆపై, ఇంటర్వ్యూలో విజయం సాధించాడు. ఇప్పుడు, దివ్యాన్షు రావత్ కనీసం 4 ఏళ్ల పాటు ఇంటెన్సివ్ ట్రైనింగ్ తీసుకోనున్నాడు. అనంతరం తాను ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్‌గా పనిచేయనున్నాడు.

శ్రీనగర్ గర్వాల్‌లోని రెయిన్‌బో పబ్లిక్ స్కూల్‌లో ఇంటర్మీడియట్ చదువును రావత్ పూర్తి చేశాడు. ఆ తర్వాత, ఢిల్లీ యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌ను చదివేందుకు అందులో చేరాడు. ప్రస్తుతం రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఒక ఇంటర్వ్యూలో.. రావత్ తాను ఎస్ఎస్‌బీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు ఎలాంటి కోచింగ్ సెంటర్‌లో కూడా కోచింగ్ తీసుకోలేదని వెల్లడించాడు.

కోచింగ్ లేకుండానే చదివి ఆల్ ఇండియా ర్యాంకు :
తనకు తాన సొంతంగా చదువుకుని ఎస్‌ఎస్‌బీలో ఉత్తీర్ణత సాధించాడు. పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే కోచింగ్ క్లాస్ తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. అందుకు బదులుగా, ఒక వ్యక్తి విజయాన్ని సాధించాలంటే ఎంతైన క్రమశిక్షణ, ఓర్పు, సహనం ఎంతో అవసరమని అన్నాడు.

తాను విజయం సాధించేలా ఎంతో ప్రేరేపించిన తన అన్నయ్య ప్రియాంషు రావత్‌కు ఆ క్రెడిట్ ఇచ్చాడు. ప్రియాంషు రావత్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఎ)ని కూడా క్లియర్ చేసి ఇప్పుడు ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. దివ్యాన్షు రావత్ తండ్రి ఒక ఉపాధ్యాయుడు కాగా.. తన కుమారుడి విజయం పట్ల చాలా సంతోషంగా, గర్వంగా ఉందన్నాడు.

అలాగే, స్కూల్ టీచర్ రిదేష్ ఉనియాల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దివ్యాన్షు ఎప్పుడూ చురుకైన విద్యార్థిగా ఉండేవాడని, ఇంటర్ పరీక్షల్లో 90 శాతం స్కోర్ చేశాడని ఆయన గుర్తు చేశారు. స్కూల్లో స్పోర్ట్స్ కెప్టెన్‌గా కూడా ఉండేవాడని, కష్టపడి చదివి ఆల్ ఇండియా ర్యాంకు సాధించి దివ్యాన్షు రావత్ ఎందరికో ఆదర్శంగా నిలిచాడని స్కూల్ టీచర్ కొనియాడారు.

Read Also : CBSE Boards Exam 2024 : పరీక్షల ఒత్తిడిని తగ్గించుకోవడానికి విద్యార్థులకు సీబీఎస్ఈ సూచనలు.. ఏం చేయాలి? ఏం చేయకూడదంటే?

ట్రెండింగ్ వార్తలు