Cm Revanth Reddy : ఈటల రాజేందర్, కేసీఆర్ వేర్వేరు కాదు- సీఎం రేవంత్ రెడ్డి

రిజర్వేషన్లు రద్దు చేసే బీజేపీ వైపు ఉంటారో.. ఎస్సీ, ఎస్టీ, బీసీల వైపు ఉంటారో తేల్చుకోవాలి. అంగీ మార్చినా, రంగు మార్చినా.. ఎన్ని వేషాలు వేసినా ప్రజలు నమ్మరు.

Cm Revanth Reddy : మల్కాజ్ గిరి పార్లమెంటును బీజేపీకి బీఆర్ఎస్ తాకట్టు పెట్టిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ఒక దిష్టిబొమ్మను ముందు పెట్టింది తప్ప.. ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు. 2001 నుంచి 2021 వరకు 20ఏళ్లు కేసీఆర్ తో కలిసి తెలంగాణను విధ్వంసం చేసింది మీరు కాదా? అని ఈటల రాజేందర్ ను ప్రశ్నించారు సీఎం రేవంత్. మీకు పంపకాల్లో పంచాయితీతో విడిపోయారు తప్ప ప్రజల కోసం కాదని అన్నారు. 2021లో వరదలు వచ్చి ఈ ప్రాంతం ముంపునకు గురైతే ఈటల పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.

పదేళ్లు మంత్రిగా ఉండి ఏనాడైనా ఉప్పల్ కు వచ్చావా..? అని ప్రశ్నించారు. నువ్వు ఏం చేశావని..? ఏం తెచ్చావని? మల్కాజిగిరి ప్రజలను ఓటు అడుగుతావు అని నిలదీశారు. మల్కాజిగిరి ప్రజలను ఓటు అడిగే హక్కు నీకు లేదు అని సీఎం రేవంత్ అన్నారు. ఉప్పల్ లో కార్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు.

” ఈటల రాజేందర్, కేసీఆర్ వేర్వేరు కాదు.. నాణానికి బొమ్మ బొరుసు లాంటి వారు. కేసీఆర్ కాళేశ్వరం పేరుతో దోచుకుంటుంటే ఆర్ధిక మంత్రిగా నిధులు విడుదల చేసింది నువ్వు కాదా రాజేందర్? కరోనా సమయంలో సంతోశ్ రావు కోట్లాది రూపాయలు వెనకేసుకుంటుంటే.. వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్నది నువ్వు కాదా రాజేందర్? నువ్వే కదా దొంగలకు సద్దులు మోసింది రాజేందర్? అప్పుడే మర్చిపోయావా? హైదరాబాద్ చుట్టూ భూములను దోచుకుంటుంటే.. చూస్తూ ఊరుకుంది నువ్వు కాదా? గద్దర్ ను అవమానించిన నాడు ఎందుకు ప్రశ్నించలేదు? కేసీఆర్ అవినీతిపై ఈటల ఏనాడైనా అమిత్ షా, మోదీకి ఫిర్యాదు చేశారా? ఈటల, కేసీఆర్ ది పగలు కుస్తీ.. చీకట్లో దోస్తీ. ఈటలకు పదవి, పరపతి తప్ప.. తెలంగాణ ప్రజల సంక్షేమం పట్టదు.

రిజర్వేషన్లు రద్దు చేసే బీజేపీ వైపు ఉంటారో.. ఎస్సీ, ఎస్టీ, బీసీల వైపు ఉంటారో రాజేందర్ తేల్చుకోవాలి. అంగీ మార్చినా, రంగు మార్చినా.. ఎన్ని వేషాలు వేసినా రాజేందర్ ను ప్రజలు నమ్మరు. మోదీ తెలంగాణకు ఇచ్చిందేమీ లేదు.. గాడిద గుడ్డు తప్ప.. మల్కాజిగిరి పార్లమెంట్ లో సునీతక్కను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించండి” అని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు.

Also Read : నా బిడ్డను జైల్లో పెట్టినా భయపడను, లొంగిపోయే ప్రసక్తి లేదు- కేసీఆర్

ట్రెండింగ్ వార్తలు