Telangana Rain Alert : తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరికలు జారీ
Telangana Rain Alert : గురు, శుక్రవారాల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలతోపాటు ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Telangana Rain Alert
Telangana Rain Alert : అర్నబ్ అతి తీవ్ర తుపాను తాకిడికి ఏపీలోని పలు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. భారీ వర్షాలతోపాటు.. భీకర గాలుల కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడగా.. పంట పొలాలు నేలవాయి. భారీగా ఆస్తినష్టం సంభవించింది. ఈ తుపాను ప్రభావం తెలంగాణ రాష్ట్రంపైనా పడింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. భారీ ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో రైతులు సాగుచేసిన పంటలు దెబ్బతిన్నాయి. అయితే, గురువారం కూడా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలతోపాటు ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వెల్లడించింది.
తుపాను ప్రభావంతో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.5 నుంచి 5.8 డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యాయి. బుధవారం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడంతో వాతావరణం చల్లబడింది. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.
ఇవాళ, రేపు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.
