Hyderabad : హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌కు చెక్.. సైబరాబాద్ పోలీసుల మాస్టర్ ప్లాన్.. వన్-వే విధానంపై ఫోకస్..
Hyderabad IT Corridor Traffic : హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో రోజూ ట్రాఫిక్ కష్టాలతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులకు ఊరట కలిగించేలా సైబరాబాద్ పోలీసులు కీలక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
Hyderabad IT Corridor Traffic
Hyderabad IT Corridor Traffic : హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సైబరాబాద్ పోలీసులు కీలక చర్యలకు సిద్ధమవుతున్నారు. హైటెక్ సిటీ, బయోడైవర్సిటీ జంక్షన్, నాలెడ్జ్ సిటీ పరిసరాల్లో నిత్యం ఏర్పడుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు సమగ్ర ప్రణాళికను రూపొందిస్తున్నారు.
ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం క్రమంలో బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి ఐకియా రోటరీ, రహేజా మైండ్‌స్పేస్ సి-గేట్, నాలెడ్జ్ సిటీ, డల్లాస్ సెంటర్ మీదుగా మై హోమ్ భూజా వద్దకు చేరుకుని, అక్కడి నుంచి తిరిగి బయోడైవర్సిటీ జంక్షన్‌కు చేరుకునేలా ‘వన్-వే లూప్’ విధానాన్ని అమలు చేయాలని ప్రతిపాదిస్తున్నారు. ఈ విధానం అమలైతే కీలక కూడళ్ల వద్ద వాహనాల రద్దీ తగ్గి, రాకపోకలు మరింత సులభతరం అవుతాయని అధికారులు భావిస్తున్నారు.
ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ రద్దీకి కారణమవుతున్న నాలుగు ప్రధాన బాటిల్‌నెక్ పాయింట్లను గుర్తించి, వాటిని తొలగించడమే లక్ష్యంగా అధికారులు కార్యాచరణ చేపట్టారు. వాహనాలు కూడళ్ల వద్ద ఎక్కువసేపు నిలిచిపోకుండా, నిరంతరాయంగా ముందుకు సాగేలా రహదారి మౌలిక వసతులు, జంక్షన్ల పరిస్థితులను సమీక్షిస్తున్నారు.
ప్రతిపాదిత వన్-వే లూప్ మార్గంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. జాయింట్ సీపీ ట్రాఫిక్ సున్‌ప్రీత్ సింగ్, సీనియర్ ట్రాఫిక్ అధికారులు, ఎస్సీఎస్సీ సీఈఓ నవీద్ ఖాన్‌తో కలిసి వాక్‌త్రూ నిర్వహించారు. ఈ సందర్భంగా మార్గంలోని రహదారుల పరిస్థితి, జంక్షన్ల వద్ద ఎదురవుతున్న సమస్యలు, ట్రాఫిక్ నిర్వహణలో ఉన్న ఇబ్బందులను పరిశీలించారు. వన్-వే లూప్ విధానాన్ని అమలుచేస్తే వాహనాల రాకపోకల వేగం, ట్రాఫిక్ రద్దీపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకునేందుకు సమగ్ర ట్రాఫిక్ సిమ్యులేషన్ పరీక్షలు నిర్వహించారు. అలాగే ఐటీ కంపెనీలు, వాణిజ్య సంస్థలు, స్థానిక భాగస్వాములతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలు, సూచనలను సేకరించనున్నారు.
అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే వన్-వే లూప్ విధానంపై తుది నిర్ణయం తీసుకుంటామని సీపీ వెల్లడించారు. ఈ విధానాన్ని అమలు చేయాల్సి వస్తే దశలవారీగా ముందుకు వెళ్లనున్నట్లు తెలిపారు. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ముందుగానే ట్రాఫిక్ అడ్వైజరీలు, రూట్ డైవర్షన్ల వివరాలను విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఐటీ కారిడార్‌లో రోజూ ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కొనే ఉద్యోగులు, వాహనదారులకు ఉపశమనం కల్పించడమే ఈ ప్రణాళిక ప్రధాన ఉద్దేశంకాగా.. ప్రతిపాదిత మార్పులు అమలులోకి వస్తే హైటెక్ సిటీ, బయోడైవర్సిటీ పరిసరాల్లో ట్రాఫిక్ నిర్వహణ మరింత మెరుగుపడే అవకాశం ఉంది.
