Sarathi: ప్రముఖ హాస్యనటుడు సారథి కన్నుమూత

తెలుగు సినిమా పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హాస్యనటుడు కడలి జయసారథి గతకొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ, ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Sarathi :టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ఒకప్పుడు తనదైన హాస్యంతో తెలుగు ప్రేక్షకులను నవ్వించిన హాస్య నటుడు సారథి కన్నుమూశారు. ఆయన పూర్తిపేరు కడలి జయసారథి అయినా.. టాలీవుడ్‌లో సారథిగా పాపులర్ అయ్యారు. ఆయన గతకొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లుగా.. నగరంలోని సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారని సారథి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. టాలీవుడ్‌లో దాదాపు 372 సినిమాల్లో నటించిన సారథి, ఆయన చేసిన కామెడీ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు.

సీతారామ కళ్యాణం, జగన్మోహిని, పరమానందయ్య శిష్యుల కథ, గూఢచారి నెం.1 తదితర సినిమాల్లో ఆయన చేసిన పాత్రలు ఆయనకు మంచి పేరును తీసుకొచ్చాయి. సినిమాలే కాకుండా ఆయన ఎన్నో స్టేజీ నాటకాలలో అవార్డులు గెలుచుకుని తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. హాస్య పాత్రలను తనదైన హావభావాలతో ప్రేక్షకుల మనసుల్లో గుర్తుండిపోయేలా చేసిన నటుడిగా సారథి కీర్తిని సంపాదించారు. నిర్మాతగా కూడా సారథి పలు సినిమాలు చేశారు.

అయితే సారథి మరణంతో టాలీవుడ్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతిపై పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. కాగా, ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో జయసారథి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ట్రెండింగ్ వార్తలు