నా కుటుంబంలో చిచ్చు పెట్టారు.. కూతురు వ్యాఖ్యలపై స్పందించిన ముద్రగడ
పవన్ కల్యాణ్ విజయం కోసం తనవంతు ప్రయత్నం చేస్తానంటూ తన కూతురు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఘాటుగా స్పందించారు.
- Naga Srinivasa Rao Poduri
- Published On : May 3, 2024 / 01:18 PM IST
Mudragada Padmanabham: తన కుమార్తె క్రాంతి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్పందించారు. జనసేన నాయకులు తన కుటుంబంలో చిచ్చుపెట్టారని, వెనక్కు తగ్గేదిలేదని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన కుటుంబంలో చిచ్చు పెట్టిన వ్యక్తికి ఆ భగవంతుడే శిక్ష విధిస్తాడని అన్నారు.
”నా కూతురుతో కూడా నాపై తప్పుడు ప్రచారం చేయించారు. నా కుమార్తెకి ఎప్పుడైతే పెళ్లయిందో అప్పటి నుంచి తను నా ఆస్తి కాదు. నా కుమారుడు మాత్రమే నా ప్రాపర్టీ. నా కుమార్తెతో ఆమె మామగారు, జనసేన నాయకులు నా గురించి తప్పుగా మాట్లాడించారు. నేను భయపడే వ్యక్తిని కాదు, భయపడేది లేదు. నాకు ఎలాంటి పదవికాంక్ష లేదు. జగన్మోహన్ రెడ్డికి తోడుగా ఉండడానికే నేను వచ్చాను. ఎన్నికలు ముగిసిన తర్వాత నా పేరు ముద్రగడ పద్మనాభంగా ఉండాలా లేదా ముద్రగడ పద్మనాభం రెడ్డిగా ఉండాలో ప్రజలే నిర్ణయిస్తార”ని అన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలను క్రాంతి తప్పుబట్టారు. పవన్ కల్యాణ్‌ను తిట్టించడానికే తన తండ్రిని వైసీపీ వాడుకుంటోందని.. ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయనను పక్కనపెట్టేస్తారని అన్నారు. పవన్ కల్యాణ్ విజయం కోసం తనవంతు ప్రయత్నం చేస్తానని వీడియో సందేశంలో క్రాంతి ప్రకటించారు. దీనిపై తాజాగా ముద్రగడ పద్మనాభం ఘాటుగా స్పందించారు.
Also Read: పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఓడిపోవడం ఖాయం: ముద్రగడ పద్మనాభం
