Prasanna Vadanam : ‘ప్రసన్న వదనం’ మూవీ రివ్యూ.. సుహాస్ మళ్ళీ హిట్ కొట్టాడా..?

సుహాస్ హీరోగా ఫేస్ బ్లైండ్ నెస్ అనే కాన్సెప్ట్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ ప్రసన్న వదనం తెరకెక్కించారు.

Prasanna Vadanam Movie Review : సుహాస్(Suhas) ఇప్పటికే హ్యాట్రిక్ హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. తాజాగా ‘ప్రసన్న వదనం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సుహాస్ హీరోగా, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్ గా, రాశీసింగ్, నందు, వైవా హర్ష, సాయి శ్వేత, నితిన్ ప్రసన్న.. ముఖ్య పాత్రల్లో సుకుమార్ శిష్యుడు అర్జున్ వైకె దర్శకత్వంలో జెఎస్ మణికంఠ, టిఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మాణంలో ఈ ప్రసన్న వదనం సినిమా తెరకెక్కింది. ప్రసన్న వదనం సినిమా నేడు మే 3న గ్రాండ్ గా రిలీజ్ అయింది. ముందుగానే మీడియా, పలువురు సినీ ప్రముఖులకు ప్రీమియర్ షో వేశారు. ఫేస్ బ్లైండ్ నెస్ అనే కాన్సెప్ట్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ ప్రసన్న వదనం తెరకెక్కించారు. టీజర్, ట్రైలర్స్ తో ముందు నుంచి సినిమాపై అంచనాలు పెంచారు.

ప్రసన్న వదనం కథ విషయానికొస్తే..
సూర్య(సుహాస్)కి ఒక యాక్సిడెంట్ లో వాళ్ళ అమ్మ నాన్నలు చనిపోతారు. ఈ యాక్సిడెంట్ వల్ల సూర్యకి ఫేస్ బ్లైండ్ నెస్ (ప్రోసోపాగ్నోసియా) అనే వ్యాధి వస్తుంది. దీని వల్ల ఎవరి మొహాలను గుర్తుపట్టలేడు. అంతే కాకుండా వాయిస్ లు కూడా గుర్తుపట్టలేడు. సుహాస్ ఆర్జేగా పనిచేస్తూ ఉంటాడు. తన సమస్య ఎవరికీ తెలియకుండా మెయింటైన్ చేస్తూ వస్తాడు. కేవలం తనతో ఉండే ఫ్రెండ్ విగ్నేష్(వైవా హర్ష)కి మాత్రమే తెలుసు. ఈ క్రమంలో తన జీవితంలోకి అనుకోకుండా ఆద్య(పాయల్) వస్తుంది. ఏదో ఒకరకంగా తను రెగ్యులర్ గా కలుస్తున్నా గుర్తుపట్టడు. కొన్ని సంఘటనల అనంతరం మంచి ఫ్రెండ్స్ అయి ఆ తర్వాత ప్రేమలో పడతారు.

సూర్య లైఫ్ హ్యాపీగా సాగిపోతున్న టైంలో తెల్లవారుజామున ఓ అబ్బాయి ఓ అమ్మాయి(సాయి శ్వేత)ని లారీ కిందకి తోసి మర్డర్ చేయడం చూస్తాడు. కానీ అది ఎవరు చేశారో తన ఫేస్ బ్లైండ్ నెస్ ప్రాబ్లమ్ వల్ల తెలుసుకోలేడు. కానీ ఏదో ఒకటి చేయాలని పోలీసులకు బయట కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేసి అది యాక్సిడెంట్ కాదు మర్డర్ అని చెప్తాడు. అనంతరం ఓ వ్యక్తి సూర్యపై అటాక్ చేస్తాడు. దీంతో సూర్య పోలీస్ స్టేషన్ కి వెళ్లి ACP వైదేహి(రాశీసింగ్)కి జరిగిన విషయం, అతని సమస్య చెప్తాడు. కానీ అనుకోకుండా సూర్య అదే మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. అసలు మర్డర్ అయిన అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయిని ఎవరు, ఎందుకు చంపారు? పోలీసులు ఏం చేసారు? ఈ మర్డర్ వల్ల సుహాస్ కి ఎదురైనా ఇబ్బందులు ఏంటి? అసలు సుహాస్ ని ఎవరు ఈ మర్డర్ కేసులో ఇరికించారు? సుహాస్ కి తనకున్న ఫేస్ బ్లైండ్ నెస్ ప్రాబ్లమ్ వల్ల వచ్చిన సమస్యలేంటి? తన ప్రేమ సంగతేంటి? తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : SSMB 29 Update : రాజమౌళి మహేష్ సినిమా అప్డేట్ ఇచ్చిన నిర్మాత.. ఆసక్తికర వ్యాఖ్యలు..

సినిమా విశ్లేషణ..
ఫస్ట్ హాఫ్ లో అరగంట సేపు సీన్స్ సీన్స్ గా షూట్ చేసి అతికించినట్టు ఉంటుంది. ఫ్రెండ్స్ మధ్య సీన్స్, సూర్య పరిస్థితి చెప్పడానికి కొన్ని సీన్స్, హీరోయిన్ తో కొన్ని సీన్స్ సాగుతాయి. సూర్య మర్డర్ చూసిన దగ్గర్నుంచి కథ కొంచెం ఆసక్తిగా సాగుతుంది. ఇంటర్వెల్ కి ఆ మర్డర్ ఎవరు చేసారో ప్రేక్షకులకు చెప్పేస్తారు. దీంతో ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోతుంది. కానీ సూర్య పాయింట్ అఫ్ వ్యూలో ఎవరు చంపారో తెలీదు కాబట్టి సెకండ్ హాఫ్ అంతా సూర్య కోణంలోంచి కథ సాగుతుంది. సెకండ్ హాఫ్ అంతా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ లా నెక్స్ట్ ఏం జరుగుతుందా అని చాలా ఆసక్తిగా సాగుతుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ లు కూడా బాగుంటాయి. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అయితే ఎవరూ ఊహించరు కూడా. ఇక క్లైమాక్స్ సినిమా అయ్యాక ఏదైనా ఎండింగ్ ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. ఫేస్ బ్లైండ్ నెస్ కాన్సెప్ట్, హీరో పాత్ర మొహాలు గుర్తు పట్టలేడు అనే విషయాన్ని ఎలాంటి సందేహాలు రాకుండా చక్కగా చూపించగలిగారు.

నటీనటుల పర్ఫార్మెన్స్..
సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కామెడీ, లవ్, ఎమోషన్, విలనిజం.. ఇలా అన్ని జానర్స్ లో ఆల్రెడీ మెప్పించాడు. ఈ సినిమాలో కూడా సుహాస్ తన నటనతో అదరగొట్టేసాడు. ముఖ్యంగా తన సమస్యతో మనుషుల్ని గుర్తుపట్టలేని పరిస్థితిలో బాధపడే సన్నివేశాల్లో జీవించేశాడు. పాయల్ రాధాకృష్ణ పర్వాలేదనిపించింది. ముఖ్యంగా ఈ సినిమాలో రాశీసింగ్ నటనకు అందరూ ఫిదా అయిపోతారు. కొన్ని సీన్స్ లో వావ్ అనిపిస్తుంది. లేడి పోలీసాఫీసర్ గా పర్ఫెక్ట్ గా సెట్ అయింది రాశీసింగ్. నితిన్ ప్రసన్న కూడా మెప్పిస్తాడు. వైవా హర్ష, నందు.. ఓకే అనిపిస్తారు.

సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది. సెకండ్ హాఫ్ అంతా BGM వేరే లెవెల్. బేబీ లాంటి లవ్ స్టోరీకి మ్యూజిక్ ఇచ్చిన విజయ్ బుల్గనిన్ ఈ సినిమాకు సంగీతం ఇచ్చాడంటే ఆశ్చర్యపోవాల్సిందే. పాటలు మాత్రం యావరేజ్. అలాగే సినిమాలో యాక్షన్ సీన్స్ ఉండాలి అన్నట్టు కాకుండా హీరో పరిస్థితి, అతని క్యారెక్టర్ కి తగ్గట్టు పర్ఫెక్ట్ గా ఫైట్స్ డిజైన్ చేసారు. కథ పరంగా చూస్తే ఒక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. ఇలాంటి పాయింట్ తో చాలా సినిమాలు వచ్చినా హీరోకి ఫేస్ బ్లైండ్ నెస్ అనే సమస్యని పెట్టి దాని వల్ల వచ్చే ప్రతికూల పరిస్థితులతో ఎలా మర్డర్ మిస్టరీ సాల్వ్ చేసాడు అనేది కొత్త కథనంతో రాసుకున్నాడు దర్శకుడు. సుకుమార్ రెండో సినిమా నుంచి ఇప్పటివరకు ఆయన దగ్గర పనిచేసిన అర్జున్ ఈ సినిమాతో దర్శకుడిగా మారి సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.

మొత్తంగా ‘ప్రసన్న వదనం’ సినిమా ఓ ఫేస్ బ్లైండ్ నెస్ సమస్య ఉన్న వ్యక్తి అనుకోకుండా ఓ మర్డర్ చూస్తే ఆ మర్డర్ కేసులో తనే ఇరుక్కుంటే ఎలా బయటకి వచ్చాడు? మర్డర్ చేసిన వాళ్ళని ఎలా కనిపెట్టాడు అనే కథాంశంతో సస్పెన్స్ గా సాగుతుంది. ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని థియేటర్లో చూడాల్సిందే. ఈ సినిమాకు రేటింగ్ 3 ఇవ్వొచ్చు. సుహాస్ ఈ సినిమాతో కూడా హిట్ కొట్టి తన హ్యాట్రిక్ హిట్స్ ని కంటిన్యూ చేస్తాడనే చెప్పొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ట్రెండింగ్ వార్తలు