కవిత వల్లే ఆ ఎమ్మెల్యే బీఆర్ఎస్‌ని వీడారా? అసలేం జరిగింది..

ఆ సమావేశానికి మాజీ మంత్రి హరీశ్‌రావును చీఫ్‌ గెస్ట్‌గా ఆహ్వానించినట్లు చెబుతున్నారు. హరీశ్‌రావు కూడా జగిత్యాల వస్తానని చెప్పగా, సమావేశానికి అన్ని ఏర్పాట్లు చేశారట సంజయ్‌.

Gossip Garage : కాచిన చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్లు… నమ్ముకున్న నాయకురాలే అనుమానించడం ఆ ఎమ్మెల్యేకు నచ్చలేదా? తాను ఎంతగానో అభిమానించిన నేత… ఎవరో… ఏదో.. చెబితే తనను టార్గెట్‌ చేయడం సహించలేకపోయారా? అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అన్న చందంగా… ప్రతిసారి తనను అవమానించడం.. అనుమానించడంతో వేరే దారి చూసుకున్నారా? బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల జంపింగ్‌లో ఈ ట్విస్టు ఏంటి? ముఖ్య నేత తీరుతో విసిగిపోయిన ఓ ఎమ్మెల్యే పార్టీకి బైబై చెప్పేశారనే ప్రచారంలో నిజమెంత?

ఎంతగానో అభిమానించిన కవిత తీరుతో విసిగిపోయి..
గులాబీ పార్టీలో ఎమ్మెల్యేల వలసలకు ఆ పార్టీలో ముఖ్య నేత వ్యవహార శైలి కూడా ఓ కారణమన్న ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌ కన్నా… ఓ నేత తీరుతోనే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ హస్తం గూటికి చేరారంటున్నారు. ఎమ్మెల్యే సంజయ్‌ ఎంతగానో అభిమానించిన బీఆర్‌ఎస్‌ బాస్‌ కేసీఆర్‌ కుమార్తె కవిత తీరుతో విసిగిపోయే…. ఆయన పార్టీని వీడారని చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆల్‌ ఆఫ్‌ సడన్‌గా సంజయ్‌ పార్టీ మారడానికి ఎమ్మెల్సీ కవిత కారణమని ఆయన అనుచరులు చెబుతున్నారు.

సమావేశానికి హరీశ్‌రావును ఆహ్వానించడంతో కవితతో విభేదాలు..
వరుసగా రెండుసార్లు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్‌కుమార్‌…. ఎమ్మెల్సీ కవితకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు ఉంది. దీంతో బీఆర్‌ఎస్‌లో ఏ ఎమ్మెల్యే పార్టీ వీడినా సంజయ్‌ మాత్రం కారుతోనే కొనసాగతారని ఆ పార్టీ నమ్మకం పెట్టుకుంది. ఐతే లోక్‌సభ ఎన్నికల తర్వాత చడీచప్పుడు లేకుండా సంజయ్‌ పార్టీ మారిపోవడంతో అంతా షాక్‌ తిన్నారు. ఆయన పార్టీ వీడేందుకు కారణం ఏమై ఉంటుందని ఆరా తీశారు. ఆయన పార్టీ మారడానికి కేవలం ఎమ్మెల్సీ కవితే కారణమని తాజాగా చెబుతున్నారు. పార్టీ అధినేత కేసీఆర్‌ ఆదేశాలతో జగిత్యాలలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసిన సంజయ్‌… ఆ సమావేశానికి సీనియర్‌ నేత హరీశ్‌రావును ముఖ్య అతిథిగా ఆహ్వానించడంతో కవితతో విభేదాలు మొదలయ్యాయని… ఆ క్రమంలోనే ఆయన పార్టీని వీడాల్సి వచ్చిందని టాక్‌ వినిపిస్తోంది.

సమావేశానికి హరీశ్‌రావు రాకుండా అడ్డుకున్న కవిత..
లోక్‌సభ ఎన్నికలకు ముందు జగిత్యాలలో పార్టీ సమావేశం ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ ఆదేశించగా, జనవరి 29న ఎమ్మెల్యే కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారట… ఈ సమావేశంపై ఎమ్మెల్సీ కవితకు సమాచారమిచ్చినా, ఆమె లిక్కర్‌ స్కాం కేసులో బిజీగా ఉండటం వల్ల రాలేనని చెప్పారట… దీంతో ఆ సమావేశానికి మాజీ మంత్రి హరీశ్‌రావును చీఫ్‌ గెస్ట్‌గా ఆహ్వానించినట్లు చెబుతున్నారు. హరీశ్‌రావు కూడా జగిత్యాల వస్తానని చెప్పగా, సమావేశానికి అన్ని ఏర్పాట్లు చేశారట సంజయ్‌. ఐతే ఈ విషయమై ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం ఎమ్మెల్సీ కవితకు లేనిపోని ఫిర్యాదులు చేయడంతో సమావేశానికి హరీశ్‌రావు వెళ్లకుండా… అడ్డుకున్నారట కవిత.

దీంతో ఫిబ్రవరిలో మరోసారి సమావేశం నిర్వహించాలని నిర్ణయించిన ఎమ్మెల్యే… మళ్లీ హరీశ్‌రావునే ముఖ్య అతిథిగా పిలిచారట. అయితే రెండోసారి ఏర్పాటు చేసిన ఈ సమావేశంపై కవితకు సమాచారం ఇవ్వలేకపోయారట ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌. దీంతో ఎమ్మెల్యే తనను పట్టించుకోలేదన్న కారణంతో రెండోసారి కూడా హరీశ్‌రావును జగిత్యాల వెళ్లకుండా కవిత ఆపేసినట్లు చెబుతున్నారు.

అనుమానంతో అడ్డుకోవడంతో ఎమ్మెల్యే ఆవేదన..
అధినేత కేసీఆర్‌ ఆదేశాలతో తాను రెండుసార్లు ఎంతో వ్యయప్రయాసలను ఓర్చి సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమైనా… ఏదేదో అనుమానంతో కవిత అడ్డుకోవాలని చూడటంతో హర్ట్‌ అయ్యారట సంజయ్‌కుమార్‌. అనుమానం ఉన్న చోట ఎక్కువ కాలం కొనసాగడం కష్టమనే ఆలోచనతో ఎన్నికలు అవ్వగానే తన దారి తాను చూసుకున్నట్లు చెబుతున్నారు.

ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరడం బీఆర్‌ఎస్‌ స్వయంకృతమే..
ఈ విషయాన్ని నేరుగా మాజీ సీఎం కేసీఆర్‌కే చెప్పేశారని… కవిత తీరు వల్ల కార్యకర్తలు బీజేపీకి…. నాయకులు కాంగ్రెస్‌కు వెళ్లిపోతున్నారని చెప్పారట ఎమ్మెల్యే సంజయ్‌. ఇలా కాంగ్రెస్‌ ప్రయత్నం చేయకుండానే ఓ ఎమ్మెల్యే హస్తం గూటికి చేరడం బీఆర్‌ఎస్‌ పార్టీ స్వయంకృతమే అంటున్నారు ఎమ్మెల్యే అనుచరులు.

Also Read : వెంటాడుతున్న ఆ భయం..! ఇంతవరకు కార్యాలయాల్లోకి అడుగుపెట్టని ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు

ట్రెండింగ్ వార్తలు