ఏకంగా 59 మంది డీఎస్పీలను పక్కన పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం.. నారా లోకేశ్ రెడ్‌బుక్‌ ఓపెన్ చేసేశారా?

వైసీపీ ప్రభుత్వంలో తమ పార్టీ కార్యకర్తలను వేధించిన పోలీసులు, రెవెన్యూ అధికారులతోపాటు అప్పటి అధికార పార్టీ నేతల పేర్లను రెడ్‌బుక్‌లో రాస్తున్నానని.. వారిని గుర్తించుకుని తాము అధికారంలోకి రాగేనే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.

Nara Lokesh Red Book : ఏపీ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రం… ఎన్నికల అనంతరం విపక్షానికి ముఖ్యమైన విమర్శనాస్త్రం…. అధికారంలోకి రాగానే టీడీపీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అంశం.. విపక్ష శ్రేణులను టెన్షన్‌ పెడుతున్న విషయం… నారా లోకేశ్‌ రెడ్‌బుక్‌. విపక్ష నేత జగన్‌ ఢిల్లీ వెళ్లి మరీ రెడ్‌బుక్‌పై ఆరోపణలు చేశారంటే… ఏపీ రాజకీయాల్లో ఆ బుక్‌ ఎంత హాటో చెప్పొచ్చు. అలాంటి రెడ్‌బుక్‌ ఇంకా తెరవలేదని వారం క్రితం చెప్పిన మంత్రి నారా లోకేశ్‌… ఇప్పుడు ఆ పని స్టార్ట్‌ చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ఆల్‌ ఆఫ్‌ సడన్‌గా 96 మంది డీఎస్పీలను బదిలీలు చేయడంతో రెడ్‌బుక్‌ను తెరిచారా? అనే సందేహాలు మొదలయ్యాయి. ఇంతకీ లోకేశ్ రెడ్‌బుక్‌తో డీఎస్పీలకు లింకేంటి…?

బదిలీ డీఎస్పీల్లో ఎక్కువ మంది పేర్లు రెడ్‌బుక్‌లో ఉన్నవారేనా..?
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ప్రధానంగా వినిపిస్తున్న పేరు రెడ్‌బుక్‌. ఇటు ప్రతిపక్షం…. అటు అధికార పక్షంలో రెడ్‌బుక్‌పైనే ఎక్కువ డిబేట్‌ జరుగుతోంది. పవర్‌లోకి వచ్చి రెండు నెలలు అవుతున్నా రెడ్‌బుక్‌ తెరవలేదని… ఎర్రబుక్‌ను మరచిపోయారని… టీడీపీ నేతలను ఆ పార్టీ కార్యకర్తలు వెంటాడుతుండగా, విపక్షం మాత్రం రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపణలు చేస్తోంది. ప్రతిపక్ష నేత జగన్‌ ఢిల్లీలో చేసిన ధర్నాలో కూడా రెడ్‌బుక్‌పైనే విమర్శలు ఎక్కుపెట్టడం చూస్తే.. ప్రతిపక్షాన్ని ఆ బుక్‌ ఎంత టెన్షన్‌ పెడుతుందో తెలుస్తోందంటున్నారు పరిశీలకులు. ఇక తాజాగా 96 మంది డీఎస్పీలను బదిలీ చేయడంతో మరోసారి రెడ్‌బుక్‌పై చర్చ జరుగుతోంది. బదిలీ అయిన డీఎస్పీల్లో ఎక్కువ మంది పేర్లు రెడ్‌బుక్‌లో ఉన్నాయని… అందుకే వారికి పోస్టింగ్ లు ఇవ్వలేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

రెడ్‌బుక్‌ తెరవాలని కార్యకర్తల డిమాండ్‌..
ఎన్నికల ప్రచారంలోనూ…. అంతకుముందు తన యువగళం పాదయాత్రలోనూ టీడీపీ యువనేత లోకేశ్‌ పదేపదే రెడ్‌బుక్‌ పేరిట హెచ్చరికలు జారీ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో తమ పార్టీ కార్యకర్తలను వేధించిన పోలీసులు, రెవెన్యూ అధికారులతోపాటు అప్పటి అధికార పార్టీ నేతల పేర్లను రెడ్‌బుక్‌లో రాస్తున్నానని.. వారిని గుర్తించుకుని తాము అధికారంలోకి రాగేనే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఎన్నికల్లో కూటమి విజయ దుందుబి మోగించిన తర్వాత… టీడీపీ కార్యకర్తలు రెడ్‌బుక్‌ తెరవాలని డిమాండ్‌ చేయడం మొదలుపెట్టారు.

రెడ్‌బుక్‌ పని చేయడం మొదలు పెట్టిందనే ప్రచారం..
అయితే ప్రతీకార రాజకీయాలకు తావివ్వొద్దని సీఎం చంద్రబాబు సూచనతో…. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత లోకేశ్‌ కూడా రెడ్‌బుక్‌ ప్రస్తావన తేలేదు. ఐతే ఇటీవల రాష్ట్రంలో రాజకీయ హత్యలు జరుగుతున్నాయని ప్రతిపక్ష నేత జగన్ ఢిల్లీలో ధర్నా చేసిన సందర్భంలో లోకేశ్‌ రెడ్‌బుక్‌పై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో స్పందించిన లోకేశ్‌ తాను ఇంకా రెడ్‌బుక్‌ తెరవలేదని క్లారిటీ ఇచ్చారు. రెడ్‌బుక్‌ తెరవకముందే ఎందుకంత భయపడుతున్నారని…. వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కానీ, ఇప్పుడు డీఎస్పీల బదిలీలతో లోకేశ్‌ రెడ్‌బుక్‌ పనిచేయడం మొదలుపెట్టిందనే ప్రచారమే ఎక్కువ జరుగుతోంది.

మొత్తం 59 మంది డీఎస్పీలను పక్కన పెట్టిన ప్రభుత్వం..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దశలవారిగా అధికారులను బదిలీ చేస్తున్నారు. ఇప్పటివరకు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేశారు. ఐతే ప్రజలతో నేరుగా సంబంధాలు ఉండే పోలీసు, రెవెన్యూ అధికారులను బదిలీ చేయకపోవడంపై టీడీపీ శ్రేణుల నుంచి నిరసన స్వరాలు వినిపించాయి. ఆ పార్టీ అఫీషియల్‌ సోషల్‌ మీడియాలో సైతం రెడ్‌బుక్‌ ఏమైందంటూ పోస్టులు కనిపించాయి. ఐతే, తాజాగా డీఎస్పీలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఒకేసారి 96 మందికి స్థాన చలనం కల్పించింది. ఇందులో సుమారు 57 మందికి ఎక్కడా పోస్టింగ్ లు ఇవ్వకుండా వెయిటింగ్‌లో పెట్టడం చర్చనీయాంశమైంది. ఈ బదిలీలకు రెండు రోజుల ముందు రాజంపేట, తుళ్లూరు డీఎస్పీలపైనా వేటు వేసింది ప్రభుత్వం. అంటే మొత్తం రాష్ట్రంలో 59 మంది డీఎస్పీలకు ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదన్నమాట.

ప్రభుత్వం మారినా మారని డీఎస్పీల తీరు..
వీరిలో రాజంపేట డీఎస్పీ వీఎస్‌కే చైతన్య, తుళ్లూరు డీఎస్పీ అశోక్‌కుమార్‌ గౌడ్‌ గతంలో టీడీపీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని పని చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో వీరిద్దరికీ రెండు రోజుల ముందే బదిలీ చేసి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదంటున్నారు. ఇక మిగిలిన డీఎస్పీల్లో ఎక్కువ మంది గత ప్రభుత్వంలో వైసీపీకి అనుకూలంగా పని చేశారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా వారి తీరు మారలేదని అందేకే… వారికి పోస్టుంగులివ్వలేదని చెబుతున్నారు.

గత ప్రభుత్వంలో లూప్‌లైన్‌లో ఉన్నవారికే కొత్త పోస్టింగులు..
డీఎస్పీలకు పోస్టుంగులివ్వకపోవడానికి కారణం రెడ్‌బుక్కే అనే ప్రచారం జరుగుతోంది. లోకేశ్‌ రాసిన రెడ్‌బుక్‌లో ఆయా డీఎస్పీల పేర్లు ఉండటంతోనే వెయిటింగ్‌లో పెట్టారంటున్నారు. 96 మంది డీఎస్పీలను బదిలీ చేస్తే… 21 మందికి మాత్రమే డివిజన్లు కేటాయించారు. 57 మందికి పోస్టింగులు ఇవ్వలేదు. ఇక మిగిలిన 18 మందికి అప్రాధాన్య పోస్టులకు పంపారంటున్నారు. ఇక కొత్తగా పోస్టుంగులు దక్కించుకున్న వారిలో ఎక్కువ మంది గత ప్రభుత్వంలో లూప్‌లైన్‌లో ఉన్న వారే కావడం విశేషంగా చెబుతున్నారు.

త్వరలో రెవెన్యూ యంత్రాంగం వంతు?
మొత్తానికి బదిలీలన్నీ రెడ్‌బుక్‌ ప్రకారమే జరిగాయనే టాక్‌ వినిపిస్తోంది. రెడ్‌బుక్‌లో పేర్లు ఉన్న వారు ఎవరికీ…. ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పంపారంటున్నారు. ఈ క్రమంలో సీఐ, ఎస్‌ఐ స్థాయి అధికారులపైనా త్వరలో చర్యలు ఉంటాయంటున్నారు. పోలీసు బదిలీల తర్వాత రెవెన్యూ యంత్రాంగం వంతు వస్తుందని… ఇవన్నీ వారం పది రోజుల్లో పూర్తి చేస్తారని టాక్‌ వినిపిస్తుంది. మొత్తానికి డీఎస్పీల బదిలీల వ్యవహారంలో మంత్రి లోకేశ్‌ రెడ్‌బుక్ హాట్‌టాపిక్‌గా మారింది.

Also Read : టార్గెట్ జగన్..! ఓటమి తర్వాత కూడా వదలడం లేదు, అసలు వైఎస్ షర్మిల వ్యూహం ఏంటి?

ట్రెండింగ్ వార్తలు