టార్గెట్ జగన్..! ఓటమి తర్వాత కూడా వదలడం లేదు, అసలు వైఎస్ షర్మిల వ్యూహం ఏంటి?

జగన్‌ ప్రతిపక్షంలోకి వచ్చాక మరింత డోసు పెంచి విరుచుకుపడుతుంటమే రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. పదునైన మాటలు.. ఘాటైన ట్వీట్‌లతో షర్మిల యుద్ధం కొనసాగించడంతో ఆమె టార్గెట్‌ ఏంటి? అన్న చర్చకు కారణమవుతోంది.

టార్గెట్ జగన్..! ఓటమి తర్వాత కూడా వదలడం లేదు, అసలు వైఎస్ షర్మిల వ్యూహం ఏంటి?

Gossip Garage : ఒకరు మొండి.. ఇంకొకరు జగమొండి.. ఇద్దరూ ఇద్దరే.. ఎవరూ తగ్గరు.. నువ్వొకటంటే.. నేను వందంటా..! మాటకు మాట.. అన్నట్లు సాగుతోంది అన్నాచెల్లెళ్ల యుద్ధం. ఎన్నికల ముందు వరకు ఓ స్థాయికే పరిమితమైన ఈ పొలిటికల్‌ ఫైట్… ఫలితాల విడుదల తర్వాత రెట్టింపైంది… ఇద్దరూ విపక్షంలోనే ఉన్నా… ప్రతిపక్షం వర్సెస్‌ ప్రతిపక్షంగా జరుగుతున్న యుద్ధం రాజకీయంగా ఆసక్తిరేపుతోంది. అన్నపై పై చేయి సాధించేలా అడుగులేస్తున్న చెల్లెలు వ్యూహమేంటి?

యుద్ధంలో పైచేయి సాధించేందుకు చెల్లెలి పోరాటం..
ఏపీ రాజకీయాల్లో అన్నాచెల్లెళ్ల యుద్ధం ఆసక్తికరంగా మారుతోంది. ఇద్దరి మధ్య సోషల్‌ మీడియా వేదికగా ట్వీట్ల యుద్ధం ఓ రేంజ్‌లో సాగుతోంది. ప్రతిపక్షం వర్సెస్‌ ప్రతిపక్షం అన్నట్లు సాగుతున్న ఈ యుద్ధంలో పైచేయి సాధించేందుకు చెల్లెలు తెగ పోరాడుతున్నారు. తండ్రి వారసత్వంతో ఇద్దరూ రాజకీయాల్లో అడుగుపెట్టినా… చెరోదారి ఎంచుకోవడమే పాలిటిక్స్‌ను హాట్‌ హాట్‌గా మార్చేసింది. ఈ ఇద్దరిలో ఒకరు ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌, మరొకరు ఆయన చెల్లెలు వైఎస్‌ షర్మిల. వైసీపీ అధినేత జగన్‌తోపాటు రాజకీయాల్లోకి వచ్చిన షర్మిల… జగనన్న బాణంగా చెప్పుకుని ప్రజల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఇప్పుడు అదే జగనన్నపై గురి పెట్టి వార్తల్లో నిలుస్తున్నారు షర్మిల.

వైఎస్ షర్మిల టార్గెట్ ఏంటి?
పీసీసీ చీఫ్‌గా నిత్యం ప్రజా సమస్యలపై గళమెత్తుతున్న షర్మిల…. ముఖ్యంగా తన సోదరుడు, మాజీ సీఎం జగన్‌నే టార్గెట్‌ చేస్తున్నారు. గతంలో అధికారంలో ఉండగా, జగన్‌ను షర్మిల విమర్శించినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. విపక్షంలో ఉన్నవారు అధికార పార్టీని విమర్శించడంలో తప్పులేదన్నట్లే చూశారు. ఐతే జగన్‌ ఓడిన తర్వాత కూడా ఆయనపై మాటల దాడిని ఆపలేదు షర్మిల. జగన్‌ ప్రతిపక్షంలోకి వచ్చాక మరింత డోసు పెంచి విరుచుకుపడుతుంటమే రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. పదునైన మాటలు.. ఘాటైన ట్వీట్‌లతో షర్మిల యుద్ధం కొనసాగించడంతో ఆమె టార్గెట్‌ ఏంటి? అన్న చర్చకు కారణమవుతోంది.

తను కూడా సీఎం కావాలనే కలలు కంటున్న షర్మిల…
తండ్రి రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత సీఎం పదవిని కోరుకున్న జగన్‌రెడ్డికి షర్మిల మద్దతు తెలిపారు. వరుసగా రెండు ఎన్నికల్లో ఆయన తరఫునే ప్రచారం చేశారు. కానీ, గత ఎన్నికల ముందు ఆయనతో విభేదించి ప్రతిపక్ష పాత్రను ఎంచుకున్నారు షర్మిల. అప్పటి నుంచి ప్రతి రోజూ ఏదో ఒక విషయమై జగన్‌ను టార్గెట్‌ చేస్తున్న షర్మిల… తన తండ్రి వారసత్వాన్ని అందుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత… ప్రతిపక్ష స్థానాన్ని ఆక్రమించాలనే వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. తన తండ్రి అనుచరులు, అభిమానులే ఎక్కువగా వైసీపీలో ఉండటంతో…. వారిని ఆకర్షించడం ద్వారా కాంగ్రెస్‌ను బలోపేతం చేసి… తను కూడా సీఎం కావాలనే కలలు కంటున్నారు షర్మిల. తన లక్ష్యాన్ని చేరుకునేందుకు అన్న జగన్‌ను గురిపెట్టి… ఆయనను బలహీనుడని నిరూపించేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.

ప్రతిపక్ష స్థానాన్ని ఆక్రమించాలనే వ్యూహాత్మక అడుగులు..
ఏపీ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని భావిస్తోన్న షర్మిల… ఇటు అధికార కూటమితో యుద్ధం చేస్తూనే… వైసీపీని ఎక్కువగా టార్గెట్‌ చేస్తున్నారు. జగన్‌ ఢిల్లీ పర్యటనపై విమర్శలు ఎక్కుపెట్టడమే కాకుండా… ప్రతిపక్ష హోదా ఇవ్వనిదే అసెంబ్లీకి వెళ్లనని ఆయన చేసిన ప్రకటనతో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీకి రాకపోతే శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఇక అంతటితో ఆగకుండా.. జగన్‌ను మ్యూజియంలో పెట్టాలని డిమాండ్‌ చేయడం ద్వారా అన్నపై పోరాటంలో వెనక్కి తగ్గేదేలే అన్న సంకేతాలు పంపుతున్నారు.

ఏపీ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని భావన..
ఆమె విమర్శలకు కౌంటర్‌ ఇచ్చే క్రమంలో షర్మిల సీఎం చంద్రబాబు డైరెక్షన్‌ లో పని చేస్తున్నారని వైసీపీ చేసిన విమర్శలపైనా ఘాటుగానే సమాధానమిచ్చారు షర్మిల. అన్నపై పోరాటంలో మాటలు, ట్వీట్‌లే కాకుండా… ప్రజా సమస్యలకు కూడా కారణం జగన్‌ పాలనే అన్న విషయాన్ని లేవనెత్తుతూ… జగన్‌ కన్నా, అన్ని రకాలుగా తానే ఎక్కువ అనే కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఇద్దరి మధ్య మాటల యుద్ధం చినికి చినికి గాలివానగా మారుతోంది.. మొత్తానికి జగన్‌పై పైచేయి సాధించే ప్రయత్నంలో షర్మిల ఇంకేమి చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Also Read : గెలుపెవరిది? మరో నెల రోజుల్లో రాజకీయ పరీక్ష ఎదుర్కోబోతున్న ఎన్డీఏ కూటమి..!