Telangana Assembly Election 2023 : తెలంగాణ ఎన్నికల్లో ఆసక్తికరంగా మారిన ప్రవాస భారతీయుల పోరు

ఎప్పటిలాగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరాంగణంలో ప్రవాస భారతీయులు పోటీ చేస్తున్నారు. మాతృభూమికి దూరంగా విదేశాల్లో ఉన్నా పుట్టిన గడ్డ కోసం పలు సేవాకార్యక్రమాలు చేస్తూ ఇక్కడి ప్రజల మనసుల్లో స్థానం సంపాదించిన కొందరు ప్రవాస భారతీయులు ఈ సారి ఎన్నికల్లో నిలిచారు.....

NRI Yashaswini

Telangana Assembly Election 2023 : ఎప్పటిలాగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరాంగణంలో ప్రవాస భారతీయులు పోటీ చేస్తున్నారు. మాతృభూమికి దూరంగా విదేశాల్లో ఉన్నా పుట్టిన గడ్డ కోసం పలు సేవాకార్యక్రమాలు చేస్తూ ఇక్కడి ప్రజల మనసుల్లో స్థానం సంపాదించిన కొందరు ప్రవాస భారతీయులు ఈ సారి ఎన్నికల్లో నిలిచారు. తెలంగాణ ఎన్నికల్లో ప్రవాస భారతీయుల పోరు ఆసక్తికరంగా మారింది. తమ సొంత డబ్బుతో ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో స్వస్థలాల్లో సేవాకార్యక్రమాలు చేసిన పలువురు అభ్యర్థులు ఈ సారి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

కోడలిని ఎన్నికల బరిలోకి దించిన అత్త

వరంగల్ పూర్వ జిల్లా పాలకుర్తికి చెందిన ఝాన్సీరెడ్డి అమెరికా దేశంలో స్థిరపడ్డారు. పాలకుర్తికి చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుతో సన్నిహిత సంబంధాలున్న ఝాన్సీరెడ్డి ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇటీవల అమెరికా దేశ పర్యటన సందర్భంగా ఝాన్సీరెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఝాన్సీరెడ్డిని ఎన్నికల్లో పోటీ చేయించాలని అనుకున్నా, అమెరికా పౌరసత్వ సమస్య రావడంతో ఆమె బదులు కోడలైన యశస్వినిరెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా పాలకుర్తి బరిలోకి దించారు.

అత్యంత పిన్న వయస్కురాలు…యశస్వినీరెడ్డి

పాలకుర్తి నుంచి పోటీ చేస్తున్న యశస్వినిరెడ్డి హైదరాబాద్ నగరంలో బీటెక్ చదివి, పెళ్లి అనంతరం ఝాన్సీరెడ్డి కోడలిగా అమెరికా వెళ్లారు. పాలకుర్తిలో పలు సేవా కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్న ఝాన్సీరెడ్డి తన కోడలిని పోటీలోకి దించారు. అత్యంత పిన్న వయస్కురాలైన యశస్వినిరెడ్డిని గెలిపించాలని కోరుతూ ఇటీవల రేవంత్ రెడ్డి సైతం పాలకుర్తిలో ప్రచారం చేశారు. మరో వైపు కేటీఆర్ తన క్లాస్ మేట్ అయిన భూక్య జాన్సన్ నాయక్ ను ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బరిలోకి దించారు.

క్లాస్‌మేట్ జాన్సన్ నాయక్ ను బరిలోకి దించిన కేటీఆర్

గతంలో కేటీఆర్ అమెరికా దేశ పర్యటనకు వెళ్లినపుడు హైదరాబాద్ నగరంలోని నిజాం కళాశాలలో తనతో కలిసి చదువుకున్న జాన్సన్ నాయక్ స్వాగతం పలికి తన కారులో తీసుకువెళ్లారు. అమెరికా దేశంలో కంపెనీ నడుపుతున్న జాన్సన్ నాయక్ ను రాజకీయాల్లోకి రమ్మని కేటీఆర్ ఆహ్వానించారు. దీంతో జాన్సన్ వచ్చి ఖానాపూర్ సెగ్మెంటు నుంచి పోటీ చేస్తున్నారు. తన ప్రియమిత్రుడి గురించి కేటీఆర్ ఇటీవల ఓ వీడియోను కూడా విడుదల చేశారు.

స్నేహితుడి కోసం కేటీఆర్ ప్రచారం 

ఈ సారి ఎన్నికల్లో తన ప్రియ మిత్రుడిని ఎలాగైనా గెలిపించుకోవాలనే లక్ష్యంతో కేటీఆర్ ఖానాపూర్ లో ఎన్నికల ప్రచారం సైతం చేశారు. జర్మనీ దేశంలో స్థిరపడిన చెన్నమనేని రమేశ్ ప్రస్థుతం వేములవాడ ఎమ్మెల్యే. పౌరసత్వం సమస్య కారణంగా ఆయనకు ఈసారి టికెట్టు దక్కలేదు. దీంతో ఎన్నారై అయిన రమేశ్ ను తెలంగాణ సలహాదారుడిగా కేసీఆర్ నియమించారు. హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న శానంపూడి సైదిరెడ్డి గతంలో విదేశాల్లో పనిచేస్తూ స్వదేశానికి వచ్చి రాజకీయ రంగప్రవేశం చేశారు.

ఎన్నికల బరిలో  ఎందరో ఎన్నారైలు…

మరో వైపు ఎల్బీనగర్ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీగౌడ్ విదేశాల నుంచి వచ్చి నిజామాబాద్ ఎంపీగా గెలిచారు.గతంలో ఎన్నారై ఆత్మచరణ్ రెడ్డి నిజామాబాద్ ఎంపీగా పనిచేశారు. గతంలో డాక్టర్ జె గీతారెడ్డి కూడా విదేశాల నుంచి వచ్చి తెలంగాణలో నాలుగు దశాబ్దాల పాటు రాజకీయాల్లో పనిచేసి ఇటీవల ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు.

ALSO READ : Coca-Cola Tea : భారతదేశం మార్కెట్‌లో ఇక కొత్తగా కోకా కోలా టీ…కొత్తగా ప్రారంభం

మొత్తం మీద తెలంగాణలో మొదటి నుంచి పలువురు ఎన్నారైలు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. ఈ సారి ఎన్నికల బరిలోకి దిగిన ప్రవాస భారతీయులు విజయం సాధిస్తారా లేదా అనేది ఓట్ల లెక్కింపు వరకు వేచి చూడాల్సిందే.

ట్రెండింగ్ వార్తలు