Site icon 10TV Telugu

AP Rains: ఏపీకి భారీ వర్ష సూచన.. 2 రోజులు కుండపోత వానలు.. పిడుగులు పడే ప్రమాదం..!

Rains

AP Rains: ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు ఉత్తరాంధ్రలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. కోస్తాంధ్రలో అక్కడక్కడ మోస్తరు వానలు పడే అవకాశం ఉందన్నారు.

భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక పిడుగులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉన్నందున చెట్లు, టవర్స్, పోల్స్ కింద ఉండకూడదన్నారు. బహిరంగ ప్రదేశాల్లో నిలబడరాదన్నారు.

* రేపు, ఎల్లుండి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం.

కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వానలు కురిసే అవకాశం.

మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం.

Also Read: సుందరమైన హరిత నగరంగా అమరావతిని నిర్మిస్తాం.. ఇన్వెస్టోపియా గ్లోబల్‌ ఏపీ సదస్సులో సీఎం చంద్రబాబు

బుధవారం సాయంత్రం 5 గంటల వరకు శ్రీకాకుళం జిల్లా కంచిలిలో 69 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నర్సన్నపేటలో 62.5 మిమీ, కోటబొమ్మాళిలో 53.2 మిమీ, మందసలో 48.7 మిమీ, రాజాపురంలో 46.2 మిమీ, వజ్రపుకొత్తూరులో 40.7 మిమీ వర్షపాతం నమోదైంది.

భారీ వర్ష సూచన నేపథ్యంలో లోతట్టు, వరద ముంపు, నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సురక్షితమైన, ఎత్తైన ప్రదేశాలకు తరలివెళ్లాలన్నారు. ఇక శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివాసం ఉంటున్న వారు వెంటనే వాటిని ఖాళీ చేయాలని అధికారులు చెప్పారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దన్నారు.

విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలన్నారు. మరోవైపు ముంపు ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున చెట్లు, టవర్స్, కరెంట్ పోల్స్, పొలాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదన్నారు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలన్నారు.

Exit mobile version