సుందరమైన హరిత నగరంగా అమరావతిని నిర్మిస్తాం.. ఇన్వెస్టోపియా గ్లోబల్‌ ఏపీ సదస్సులో సీఎం చంద్రబాబు

సుందరమైన హరిత నగరంగా అమరావతిని నిర్మిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

సుందరమైన హరిత నగరంగా అమరావతిని నిర్మిస్తాం.. ఇన్వెస్టోపియా గ్లోబల్‌ ఏపీ సదస్సులో సీఎం చంద్రబాబు

CM Chandrababu Naidu

Updated On : July 23, 2025 / 1:25 PM IST

CM Chandrababu Naidu: సుందరమైన హరిత నగరంగా అమరావతిని నిర్మిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో నిర్వహించిన ఇన్వెస్టోపియా గ్లోబల్‌ ఏపీ సదస్సుకు సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

యూఏఈ మంత్రిని దావోస్ కలిసి ఏపీకి ఆహ్వానించాను.భారత్ లో ఏపీని సందర్శించిన తర్వాతే ఇతర ప్రాంతాలకు వెళ్లాలని కోరాను. మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి ఇన్వెస్టోపియా సదస్సు నిర్వహించారు. దుబాయ్ అంటే నాకు చాలా అసూయ. దాన్ని ఓ స్వర్గంగా మార్చారు. దుబాయ్‌లో ఎడారి ప్రాంతాలు, బీచ్‌లు పర్యాటకులకు ఆహ్లాదకర అనుభూతిని కలిగిస్తాయి. 50 డిగ్రీల ఉష్ణోగ్రత, ఇతర ప్రతికూలతల మధ్య దుబాయ్ ఇంటర్నెట్ సిటీ మొదలు పెడితే.. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ నిర్మించామని చంద్రబాబు అన్నారు. 1.1 కోట్ల జనాభా ఉన్న యూఏఈలో 38 శాతం మంది భారత్ నుంచి వెళ్లారు. యూఏఈ భారతీయులకు అవకాశాలు కల్పిస్తోంది. అలాగే ఆ దేశానికి భారతీయలు విస్తృతమైన సేవలు అందిస్తున్నారని చంద్రబాబు అన్నారు.

దేశంలో సరైన సమయంలో సరైన చోట నరేంద్ర మోదీ నాయకుడిగా ఉన్నారు. 2024-25లో 100 బిలియన్ డాలర్ల ట్రేడ్ యూఏఈ-భారత్ మధ్య జరిగితే.. అందులో 1.5 బిలియన్ డాలర్ల వాణిజ్యం ఏపీ, యూఏఈ మధ్య జరిగింది. హైదరాబాద్ మోస్ట్ లివబుల్ సిటీగా మారింది. ఆ నగరాన్ని నిర్మించటంలో భాగస్వామిగా ఉన్నందుకు సంతోషం. నాల్గో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా భారత్ ఉంది. 2029 నాటికి మూడో ఎకానమీగా, 2047 నాటికి నెంబర్ వన్ స్థానానికి ఎదుగుతాం. ప్రపంచంలోని ప్రతీ నలుగురు టెక్నాలజీ నిపుణుల్లో ఒకరు ఇండియన్. అందులో తెలుగువాళ్లు ఎక్కువ. బలమైన పబ్లిక్ పాలసీ ద్వారా అత్యధిక సంపద ఆర్జించే వ్యక్తుల్లో తెలుగువారే 33శాతం ఉన్నారని చంద్రబాబు అన్నారు.

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీని 2026 జనవరి నాటికి ప్రారంభిస్తాం. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంటే.. అమరావతిలో క్వాంటం వ్యాలీ ఉంటుందని చంద్రబాబు అన్నారు. ఏపీ గవర్నెన్సు అంతా 550 సర్వీసులు వాట్సప్ ద్వారా పౌరసేవలు అందుతున్నాయి. మీరు ఇన్వెస్టు చేయాలని భావించిన మరుక్షణం నుంచే మీకు అనుమతులు వచ్చే బాధ్యతలు మేం తీసుకుంటాం. టెక్నాలజీని పెద్ద ఎత్తున వినియోగిస్తున్న రాష్ట్రం ఏపీ. ఆధార్ , జియో ట్యాగింగ్ ద్వారా అన్ని సేవలనూ అందిస్తున్నాం.2.4 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా పనిచేస్తున్నాం.

ఏపీలో విస్తృతమైన పెట్టుబడి అవకాశాలు ఉన్నాయి. నో పావర్టీ మిషన్‌తో పనిచేస్తున్నాం. పీ3 ద్వారా మౌలిక సదుపాయాలు కల్పిస్తుంటే, పీ4 ద్వారా పేదలకు హ్యాండ్ హోల్డ్ ఇస్తున్నాం. లులూ మంచి బ్రాండ్, లులూ ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్‌ను ఏపీలో ఏర్పాటు చేస్తోంది. విశాఖ, విజయవాడలలో త్వరలో ఆ షాపింగ్ మాల్స్ వస్తాయి. ఏపీ పెట్టుబడులకు మంచి స్థానం అని స్పష్టంగా చెప్పగలనని చంద్రబాబు అన్నారు. భారత తూర్పు ప్రాంతంగా కీలకమైన అవకాశాలు ఏపీకి ఉన్నాయి. పోర్టులు, ఎయిర్ పోర్టులు, మౌలిక సదుపాయాలు ఉన్నాయి. వ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రాంతం. ఉత్తరాదిని ,దక్షిణాదిని కలిపే ప్రాంతం కూడా ఏపీనేనని చంద్రబాబు చెప్పారు.

25 శాతం సమయాన్ని ఏపీలో వెచ్చించండి. ప్రతిపాదనలతో రండి.. ఏపీని పరీక్షించండి. ఆ తరువాతే నిర్ణయించుకోండి. మీ పెట్టుబడుల్ని ప్రాజెక్టులుగా సాకారం చేసి చూపిస్తాం. నేను ఫెసిలిటేటర్ గా మారి వీటిని సాకారం చేసి చూపిస్తా. గతంలో సైబరాబాద్ నిర్మించాను. ఇప్పుడు అమరావతిని నిర్మించే అవకాశం భగవంతుడు నాకు కల్పించాడు. ఓ సుందరమైన హరిత నగరంగా అమరావతిని నిర్మిస్తాం. నిర్మాణం, నాలెడ్జి ఎకానమీ రంగాల్లో ఇక్కడ అపారమైన అవకాశాలు ఉన్నాయని ఇన్వెస్టర్లకు చంద్రబాబు సూచించారు.