AP Local Body Elections : ఏపీలో మరో ఎన్నికల సమరం.. ఈ సారి ముందుగానే..!
ఏపీలో మరో ఎన్నికల సమరానికి తెరలేవబోతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Elections) నిర్వహించేందుకు సీఈసీ సిద్ధమైంది.

Local Body Elections
Local Body Elections : ఏపీలో మరో ఎన్నికల సమరానికి తెరలేవబోతోంది. మూడు నెలల ముందుగానే.. 2026 జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సన్నాహాలు మొదలు పెట్టింది. (Local Body Elections)
ఏపీలో ప్రస్తుత సర్పంచుల పదవీకాలం 2026 ఏప్రిల్ నెలతో ముగియనుంది. నగరపాలక, పురపాలక సంస్థలు, నగర పంచాయితీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీకాలం వచ్చే ఏడాది మార్చిలో ముగియనుంది. వాస్తవానికి వచ్చే ఏడాది మే, జూన్ నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ, మూడు నెలల ముందుగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
వచ్చే ఏడాది జనవరిలో ఎన్నికల నిర్వహణకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాలని పంచాయతీరాజ్, పురపాలక శాఖల కమిషనర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ లేఖ రాశారు.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ లేఖలో పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 15వ తేదీలోగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలి. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15వ తేదీలోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేసి, ప్రచురించాలి. నవంబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీలోగా ఎన్నికల అధికారుల నియామకం పూర్తి చేయాలని సూచించింది.
నవంబర్ 16వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీలోగా పోలింగ్ కేంద్రాల ఖరారు, ఈవీఎంలు సిద్ధం చేయడం, సేకరణ వంటివి పూర్తి చేయాలి. డిసెంబర్ 15వ తేదీలోగా రిజర్వేషన్లు ఖరారు చేయాలి. డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలి. 2026 జనవరి నెలలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి.. అదే నెలలో ఫలితాలు ప్రకటించాలని ఎన్నికల కమిషన్ రాసిన లేఖలో పేర్కొంది.