Anakapalle Lok Sabha Constituency : పేరు మాత్రం సాఫ్ట్…రాజకీయం మాత్రం మస్త్ హాట్…అనకాపల్లిలో పోటాపోటీగా పొలిటికల్ వార్

అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం 1962లో ఏర్పాటైంది. మొదటి 5 ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. తర్వాత.. తెలుగుదేశం, కాంగ్రెస్ మధ్యే పోటీ నడిచింది. 2014 దాకా.. అయితే కాంగ్రెస్.. కాకపోతే టీడీపీకి చెందిన నేతలే.. ఇక్కడ ఎంపీలుగా ఎన్నికయ్యారు. మొట్టమొదటిసారిగా 2019లో అనకాపల్లి లోక్‌సభ స్థానంలో వైసీపీ జెండా ఎగిరింది.

Anakapalle Lok Sabha Constituency : వర్గపోరు, గొడవలు, ఎత్తులకు పైఎత్తులు, ఆధిపత్య పోరు.. అన్నీ కలిపితే.. అదే.. అనకాపల్లి రాజకీయం. అనకాపల్లి అనే పేరు సాఫ్ట్‌‌గానే ఉన్నా.. రాజకీయం మాత్రం మస్త్ హాట్‌గా నడుస్తుంటుంది. పైగా.. ఇప్పుడు.. ప్రత్యేక జిల్లాగానూ ఏర్పడింది. గత ఎన్నికల్లో.. అనకాపల్లి లోక్‌సభతో పాటు.. దాని పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లను క్వీన్ స్వీప్ చేసేసింది వైసీపీ. ఇప్పుడు మరోసారి అదే రిపీట్ చేయాలని చూస్తోంది. కానీ.. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ స్పీడ్‌ని తగ్గిస్తామంటోంది టీడీపీ. అధికార పార్టీకి దీటుగా వ్యూహాలు రచిస్తూ.. మైండ్ బ్లాంక్ అయ్యే రిజల్ట్ చూపించేందుకు స్కెచ్‌లు గీస్తోంది. ఇక.. పార్లమెంట్‌సెగ్మెంట్‌లో.. పాగా వేసేందుకు టీడీపీ గట్టిగానే ప్రయత్నిస్తోంది. మరి.. అసెంబ్లీ సెగ్మెంట్లలో కనిపిస్తున్న సీనేంటి? రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేల గురించి జనం ఏమనుకుంటున్నారు? ఏయే స్థానాలపై టీడీపీ ఆశలు పెట్టుకుంది. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో.. జనసేన చూపబోయే ఇంపాక్ట్ ఎంత? వైసీపీలో ఎంతమంది సిట్టింగ్‌లకు టికెట్ షాక్ తగలనుంది? ప్రతిపక్షాల నుంచి బరిలో నిలిచి తొడగొట్టేదెవరు?

SATHYAVATHI

ఎంపీగా గెలుస్తానన్న నమ్మకం లేక అనకాపల్లి అసెంబ్లీ సీటుపై ఎంపీ సత్యవతి ఫోకస్

అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం 1962లో ఏర్పాటైంది. మొదటి 5 ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. తర్వాత.. తెలుగుదేశం, కాంగ్రెస్ మధ్యే పోటీ నడిచింది. 2014 దాకా.. అయితే కాంగ్రెస్.. కాకపోతే టీడీపీకి చెందిన నేతలే.. ఇక్కడ ఎంపీలుగా ఎన్నికయ్యారు. మొట్టమొదటిసారిగా 2019లో అనకాపల్లి లోక్‌సభ స్థానంలో వైసీపీ జెండా ఎగిరింది. జగన్ వేవ్‌దెబ్బకు అనకాపల్లి పొలిటికల్ పిక్చర్‌మారిపోయింది. అయితే.. ఈసారి అక్కడ ఏ జెండా ఎగురుతుందనేదే.. ఆసక్తిగా మారింది. ఏ పార్టీ అయినా గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తుంది. గెలుపు గుర్రాలనే.. బరిలోకి దించుతుంది. కానీ.. వాళ్లు చేసే రాజకీయమే.. వాళ్లను గెలిపిస్తుంది. ఈసారి ఆ గెలుపు అందుకునేందుకు.. అధికార పార్టీతో సహా అన్ని పార్టీలు.. తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయ్. అనకాపల్లి లోక్‌సభ స్థానంలో.. వైసీపీ నుంచి బీశెట్టి వెంకట సత్యవతి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో.. వైసీపీ తరఫున ఆవిడ పోటీ చేసే అవకాశం కనిపించడం లేదు. మళ్లీ గెలుస్తాననే నమ్మకం లేక కాదు. ఈసారి.. ఆవిడ పార్లమెంట్ నుంచి అసెంబ్లీ సెగ్మెంట్‌కి షిప్ట్ అవ్వాలనుకుంటున్నారట. వచ్చే ఎన్నికల్లో.. ప్రస్తుత మంత్రి గుడివాడ అమర్నాథ్.. వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో.. గవర సామాజికవర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వాలనే డిమాండ్‌కు అనుగుణంగా.. అనకాపల్లి అసెంబ్లీ సీటుపై ఎంపీ సత్యవతి ఫోకస్ పెట్టారనే టాక్ వినిపిస్తోంది.

READ ALSO : Amalapuram Lok Sabha constituency : కోనసీమలో పట్టుకోసం అధికార వైసీపి ఎత్తుగడలు.. రాజకీయ అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న టీడీపీ, జనసేన !

వైసీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా అవంతి పోటీ చేసే చాన్స్

సిట్టింగ్ ఎంపీ సత్యవతి.. ఎమ్మెల్యేగా పోటీ చేస్తే.. అవంతి శ్రీనివాస్ అనకాపల్లి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. ఆయన కాకపోతే.. దాడి వీరభద్రరావు కూడా లైన్‌లో ఉన్నారు. ఇక.. టీడీపీ నుంచి అయ్యన్నపాత్రుడి కొడుకు.. విజయ్ ఎంపీగా పోటీ చేసేందుకు.. గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి.. గత ఎన్నికల్లోనే ఎలాగైనా ఎంపీ అవ్వాలని విజయ్ ఎంతో ప్రయత్నించారు. కానీ.. తెలుగుదేశం అధిష్ఠానం.. అడారి ఆనంద్‌కు అవకాశం ఇచ్చింది. దాంతో.. వైసీపీ వేవ్‌లో ఆయన ఓటమిపాలయ్యారు. ఇక.. గత ఎన్నికల్లో జనసేన నుంచి ఎంపీగా పోటీ చేసిన రిటైర్డ్ ఐఆర్ఎస్ చింతల పార్థసారథి.. ఇప్పుడు బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. అందువల్ల.. ఇప్పటికైతే జనసేన నుంచి ఎవరు ఎంపీగా బరిలోకి దిగుతారన్న దానిపై క్లారిటీ లేదు.

gudivada amarnath

అనకాపల్లిలో మంత్రి అమర్నాధ్ కు అసమ్మతి సెగ..

అదే క్రమంలో అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో.. అనకాపల్లి అసెంబ్లీ సెగ్మెంట్‌తో పాటు పెందుర్తిలో కొంత భాగం, చోడవరం, మాడుగుల, యలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం ఉన్నాయి. వీటిలో.. పాయకరావుపేట ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం కాగా.. మిగిలినవన్నీ జనరల్ స్థానాలు. అనకాపల్లి సెగ్మెంట్‌లో.. మంత్రి గుడివాడ అమర్నాథ్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వైసీపీలో.. దూకుడున్న నేతగా ఆయనకు పేరుంది. ఇప్పుడు.. ఆ దూకుడు వల్లే.. నియోజకవర్గంలో అంతర్గత కుమ్ములాటలు పెరిగాయనే టాక్ నడుస్తోంది. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కుటుంబంతో.. అమర్నాథ్‌కు రాజకీయ వైరం నడుస్తోంది. ఎంపీ సత్యవతి కూడా తన వర్గాన్ని ప్రోత్సహిస్తుండటంతో.. ఇక్కడి రాజకీయం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎందుకంటే.. అనకాపల్లిలో కాపు, గవర సామాజికవర్గాలు బలమైనవి. మంత్రి అమర్నాథ్ కాపు సామాజికవర్గాన్ని ఆదరించకపోవడంతో.. కాస్త వెనుకబడ్డారనే చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో.. ఆయన ఇక్కడి నుంచి తిరిగి పోటీ చేయలేరనే ప్రచారం జోరుగా సాగుతోంది. అదే జరిగితే.. దాడి ఫ్యామిలీకి గానీ, పార్టీలోకి వస్తే కొణతాల ఫ్యామిలీ గానీ వైసీపీ తరఫున పోటీలో నిలిచే చాన్స్ ఉంది. మరోవైపు.. సిట్టింగ్ ఎంపీ సత్యవతి కూడా అనకాపల్లి తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్నారు. ఇక.. టీడీపీ విషయానికొస్తే.. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ బలమైన అభ్యర్థిగా ఉన్నారు. ఆయనపై.. జనాల్లో పెరిగిన సానుభూతి.. వైసీపీని కొంత మేర ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. అయితే.. టికెట్ రేసులో ఉన్న మాజీ ఎమ్మెల్సీ బుద్ధా నాగ జగదీశ్.. పీలా గోవింద్‌కు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. దాంతో.. అనకాపల్లి సెగ్మెంట్‌లో నెలకొన్న వర్గ పోరు టీడీపీని వేధిస్తోంది. అంతర్గత సమస్యలను పరిష్కరించుకోగలిగితే.. వైసీపీకి గట్టి పోటీ ఇవ్వొచ్చనే టాక్ వినిపిస్తోంది. జనసేన నుంచి పరుచూరి భాస్కర్ రావు బరిలో నిలిచే చాన్స్ ఉన్నా.. స్థానికంగా నెలకొన్న పరిస్థితులతో.. పవన్ పార్టీ ఆదరణ కొంతే ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.

READ ALSO : Adilabad Lok Sabha Constituency : రాజకీయాలకు అడ్డాగా కుమ్రం భీమ్ పోరుగడ్డ… అదిలాబాద్ పై కన్నేసిన కమలం

Kannababu raju

ఒకప్పుడు టీడీపీకి కంచుకోట యలమంచిలిలో టీడీపీ తిరిగి పాగా వేస్తుందా…

ఇక.. యలమంచిలిలోకి ఎంట్రీ ఇస్తే.. సీనియర్ నేత ఉప్పలపాటి వెంకటరమణమూర్తి రాజు అలియాస్ కన్నబాబు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇది.. టీడీపీకతి కీలకమైన స్థానాల్లో ఒకటి. కాపు, మత్స్యకార, బీసీ సామాజికవర్గాల ఓట్లు ఇక్కడ ఎక్కువ. అయినప్పటికీ.. తెలుగుదేశం ఓట్ బ్యాంక్‌ను బ్రేక్ చేసి మరీ.. వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు రమణమూర్తి రాజు. అయితే.. వయోభారం కారణంగా.. సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఈసారి టికెట్ ఇచ్చే అవకాశం లేదని బలమైన ప్రచారం సాగుతోంది. తనకు కాకపోతే.. తన కొడుకు సుకుమార్ వర్మకైనా టికెట్ ఇప్పించుకోవాలని చూస్తున్నారు ఎమ్మెల్యే కన్నబాబు. అయితే.. యలమంచిలి నుంచి పోటీ చేసేందుకు మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడీ అవుతున్నారు. ఈ మధ్య.. నియోజకవర్గంలో ఆయన పర్యటనలు కూడా ఎక్కువయ్యాయ్. అయితే.. అవకాశం ఎవరికి దక్కినా.. టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్లు ఏ విధంగా స్పందిస్తారన్నదే.. వైసీపీలో కీలకంగా మారింది. మరోవైపు.. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న యలమంచిలిలో.. ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. ప్రగడ నాగేశ్వరరావు ఇంచార్జ్‌గా వ్యవహరిస్తున్నా.. ఓటర్లను ప్రభావితం చేసే స్థాయిలో పార్టీ లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. జనసేన కూడా యలమంచిలిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. సుందరపు విజయ్ కుమార్.. ఈసారి ఎలాగైనా.. జనసేన జెండా ఎగరేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

BABURAO, ANITHA

READ ALSO : Kammam Politics : ఖమ్మం చుట్టూ తిరుగుతున్న తెలంగాణా రాజకీయం… గులాబీ పార్టీలో గ్రూపుల గుబులు

పాయకరావు పేటలో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్న వంగలపూడి అనిత

అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని ఏకైక ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం పాయకరావు పేట. గొల్ల బాబారావు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. స్థానిక వైసీపీలో.. అంతర్గత కుమ్ములాటలు పార్టీకి సమస్యగా మారాయి. దాంతో.. సిట్టింగ్ ఎమ్మెల్యేను ఈసారి మారుస్తారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. పార్టీ హైకమాండ్ పరిస్థితులను చక్కదిద్దినా.. అంతర్గతంగా పరిస్థితి కుదుటపడినట్లు కనిపించడం లేదు. అందువల్ల.. టికెట్ రేసులో మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకటరావు, బంగారయ్య ఉన్నారు. ఇక.. టీడీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత మరోసారి తన లక్.. చెక్ చేసుకోవాలని చూస్తున్నారు. కానీ.. పాయకరావుపేట ప్రజల్లో టీడీపీకి సానుకూల వాతావరణం కనిపించడం లేదు. కీలకమైన తాండవ నదీ పరివాహక గ్రామాల్లో.. జనసేన వైపు మొగ్గు కనిపిస్తోంది. బీసీ, ఎస్సీ, కాపు సామాజికవర్గాలు.. ఇక్కడ కీలకంగా ఉన్నాయి. ప్రస్తుతానికి.. వైసీపీనే బలంగా ఉన్నట్లు కనిపిస్తున్నా.. ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా మారతాయాన్నదే బిగ్ క్వశ్చన్. మరోవైపు.. టీడీపీ నుంచి అనిత దూకుడుగా ఉన్నారు. అసమ్మతి వర్గాలను కలుపుకుపోయి.. టీడీపీ జెండా ఎగరేయాలని చూస్తున్నారు. జనసేన నుంచి బోడపాటి శివదత్ పోటీకి సిద్ధంగా ఉన్నారు.

Petla Uma Shankar Ganesh, Ayyanna pathrudu

నర్సీపట్నంలో విజయావకాశాలపై ధీమాతో ఉన్న అయ్యన్నపాత్రుడు…

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తరచుగా వినిపించే నియోజకవర్గం నర్సీపట్నం. టీడీపీలో కీలకం నేతగా పేరున్న అయ్యన్నపాత్రుడు దూకుడుకి.. గత ఎన్నికల్లో చెక్ పెట్టేసింది వైసీపీ. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఉమాశంకర్ గణేశ్‌కు నర్సీపట్నంలో మంచిపేరుంది. కానీ.. అయ్యన్న దూకుడుని తట్టుకొని నిలబడటంలో ఆయన బలం సరిపోవడం లేదనేది మరో టాక్. దీనిని తగ్గించేందుకు.. అయ్యన్న సోదరుడు సన్యాసి పాత్రుడిని పార్టీలోకి తీసుకొని.. ఆయన కుటుంబానికి డీసీసీబీ ఛైర్మన్ పదవి ఇచ్చింది వైసీపీ. అయితే.. ఈ మధ్యకాలంలో నర్సీపట్నం కేంద్రంగా జరిగిన పరిణామాలు.. అయ్యన్నకు ప్రజల్లో సానుకూల వాతావరణం తెచ్చాయనే చర్చ సాగుతోంది. ఇప్పటి నుంచే నర్సీపట్నం నియోజకవర్గ ప్రజల్లో తిరుగడం మొదలుపెట్టిన అయ్యన్నపాత్రుడు.. వచ్చే ఎన్నికల్లో విజయంపై ధీమాగా కనిపిస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ ఎక్కడెక్కడ బలహీనంగా ఉందో చూసుకొని.. అక్కడి నేతలను సమన్వయం చేసుకుంటూ.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం బలోపేతానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉమాశంకర్ సైతం ఇదే పని చేస్తున్నారు. ఆయన కూడా జనంలో తిరుగుతున్నా.. అయ్యన్న ఎత్తులను తట్టుకొని వచ్చే ఎన్నికల్లో గెలవగలరా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయ్.

karnam dharmasri

READ ALSO :Amalapuram Lok Sabha constituency : కోనసీమలో పట్టుకోసం అధికార వైసీపి ఎత్తుగడలు.. రాజకీయ అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న టీడీపీ, జనసేన !

చోడవరంలో వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి ఎదురుగాలి..

కాపు సామాజికవర్గం బలంగా ఉన్న నియోజకవర్గాల్లో చోడవరం ఒకటి. ఇక్కడ.. కరణం ధర్మశ్రీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయనకు.. ఇటీవలే ప్రభుత్వ విప్‌తో పాటు జిల్లా వైసీపీ అధ్యక్షునిగా బాధ్యతలు అప్పజెప్పారు. దాంతో.. కాపు సామాజికవర్గానికి వీలైనంత ప్రాధాన్యత ఇస్తున్నామనే సంకేతాలు పంపింది వైసీపీ. అయినప్పటికీ.. సిట్టింగ్ ఎమ్మెల్యేకు పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలతో బెడద ఉందనే చర్చ జరుగుతోంది. ఇదే టైమ్‌లో.. తెలుగుదేశం ఇక్కడ తన ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం.. మండల స్థాయి నేత తాతయ్యబాబు పార్టీ కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయనే.. తెలుగుదేశం అభ్యర్థి అవుతారనే ప్రచారం సాగుతోంది. అయితే.. మాజీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు నెమ్మదిగా యాక్టివేట్ అవుతున్నారు. కానీ.. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ జనసేన బరిలోకి దించే అభ్యర్థిని బట్టే.. టీడీపీ, వైసీపీ ప్రభావం ఏమేరకు ఉంటుందనేది తేలనుంది. కాపు సామాజికవర్గం నేతకే టికెట్ ఇవ్వాలనే డిమాండ్ ఇక్కడ అంతర్లీనంగా ఉంది. వైసీపీ తరఫున ధర్మశ్రీ ఉండగా.. జనసేన కాపు అభ్యర్థిని దించితే.. ఇక్కడ రాజకీయమే మారిపోతుంది. మరోవైపు.. గంటా శ్రీనివాసరావు.. కుమారుడు కూడా ఇక్కడి నుంచే పోటీ చేస్తారనే టాక్ నడుస్తోంది. ఇప్పటికే.. గంటా చోడవరంలోని తన సన్నిహితులతో సమావేశం నిర్వహించి.. నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై తెలుసుకున్నారనే ప్రచారం కూడా సాగుతోంది.

budi-mutyala-naidu

మాడుగులలో కన్ఫ్యూజన్‌లో టీడీపీ రాజకీయాలు… మళ్ళీ గెలుపు దిశగా అడుగులు వేస్తున్న వైసీపీ

అధికార వైసీపీకి కీలకమైన నియోజకవర్గాల్లో మాడుగుల ఒకటి. ఈ సెగ్మెంట్‌లో కాపు, వెలమ సామాజికవర్గాలు బలంగా ఉన్నాయ్. 2014, 2019లో.. వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు బూడి ముత్యాల నాయుడు. దాంతో.. ఆయనకు డిప్యూటీ సీఎంతో పాటు మంత్రి పదవి ఇచ్చింది వైసీపీ అధిష్టానం. వివాదరహితుడిగా, అభివృద్ధి కోసం పనిచేస్తారనే పేరు ముత్యాల నాయుడికి ఉంది. ఈ అసెంబ్లీ స్థానంలో.. వైసీపీకి బలమైన ఓట్ బ్యాంక్ ఉండటం కూడా కాస్త కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. అందువల్ల.. సీఎం జగన్ మళ్లీ ఆయనకే అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ పరిస్థితే.. ఇక్కడ అయోమయంగా ఉంది. మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, పార్టీ ఇంచార్జ్ విజయ్ కుమార్ మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయ్. టికెట్ కోసం.. ఈ ఇద్దరు నేతలు చేస్తున్న పోటాపోటీ కార్యక్రమాలు.. తెలుగు తమ్ముళ్లను కన్ఫ్యూజన్‌లో పడేశాయ్. అయితే.. ఇక్కడ జనసేన ప్రభావం ఎంతమేర ఉంటుందనేది కూడా కీలకంగా మారింది. దాంతో.. మాడుగులలో ఈసారి ట్రయాంగిల్ ఫైట్ సీన్ కనిపించబోతుందనే టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. టీడీపీకి నష్టం తప్పదనే అంచనాలు కనిపిస్తున్నాయ్.

adeep_raj

పెందుర్తిలో వైపీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజు కు సీటు దక్కెనా…

కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా.. పెందుర్తి నియోజకవర్గం సగం అనకాపల్లిలో కలిసింది. అర్బన్, గ్రామీణ ప్రాంతాల కలబోతే.. పెందుర్తి. ఇక్కడ.. కాపు, వెలమ, గవర ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అదీప్‌రాజ్ కొనసాగుతున్నారు. ఈ సెగ్మెంట్‌లో వైసీపీకి.. అనుకూలమైన వాతావరణం కనిపిస్తోంది. ట్రయాంగిల్ ఫైట్ అనివార్యమైనా.. ఓటర్లు అధికార పార్టీ వైపే మొగ్గు చూపే అవకాశాలున్నాయి. అయితే.. ఇక్కడ అధికార పార్టీ కంటూ ఉన్న మైనస్ ఒక్కటే. అదే.. ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌పై ఉన్న సహజ వ్యతిరేకత. అంతకుమించి.. పార్టీకి జరిగిన డ్యామేజ్ ఏమీ లేదు. అయితే.. పార్టీలోని కొందరు సీనియర్ నేతలు పెందుర్తి టికెట్ ఆశిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేశ్ బాబు.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీకి సిద్ధమవుతున్నారు. అయినప్పటికీ.. అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజు వైపే మొగ్గు చూపే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇక.. టీడీపీ నుంచి బండారు సత్యనారాయణ బలంగానే ఉన్నా.. ద్వితీయ శ్రేణి నాయకత్వం బలహీనపడింది. మిగతా సెగ్మెంట్లతో పోలిస్తే.. ఇక్కడ తెలుగుదేశం కాస్త దూకుడు ప్రదర్శిస్తోంది. ఈసారి.. టీడీపీ నుంచి బండారు సత్యనారాయణ గానీ, ఆయన కుమారుడు అప్పలనాయుడు గానీ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ.. అధిష్టానం ఒప్పుకోకపోతే.. గండి బాబ్జి సిద్ధంగా ఉన్నారు. జనసేన నుంచి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై.. ఇప్పటికైతే క్లారిటీ లేదు.

ఒక ఫైనల్ గా గంపెడాశలతో ఆశావహులు.. ఇంకొక్క చాన్స్ అంటూ సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. ఇందులోనే.. పార్టీల ఈక్వేషన్లు.. సీట్ల లెక్కలు.. అన్నీ కలిపి.. అనకాపల్లి పొలిటికల్ ఫైట్ అంతకుమించి అన్న రేంజులో ఉండబోతుందనే సిగ్నల్ ఇస్తోంది. ఈ పార్లమెంట్ పరిధిలో ఒకట్రెండు సెగ్మెంట్ల సంగతి పక్కనబెడితే.. మిగతా స్థానాల్లో టఫ్ ఫైట్ కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. అనకాపల్లి పార్లమెంటుతో పాటు అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయం సాధించి.. మరోసారి క్లీన్ స్వీప్ చేసి.. సత్తా చాటాలని వైసీపీ చూస్తుంటే. అధికార పార్టీ దూకుడుకు, స్పీడ్‌కు.. గట్టి బ్రేకులు వేయాలని తెలుగుదేశం డిసైడ్ అయింది. ఎన్నికలకు ఏడాదిన్నర ముందే.. అన్ని చోట్లా రాజకీయం కొత్త ఊపిరి పోసుకుంటోంది. దాంతో.. అనకాపల్లి జిల్లాలోనూ.. రాజకీయం రసవత్తరంగా మారింది.

ట్రెండింగ్ వార్తలు