గద్దె రామ్మోహన్ అసమర్ధ ఎమ్మెల్యే.. షో చేస్తున్నారు: దేవినేని అవినాష్
నాపైన ప్రచారం చేయడానికి ఏంలేక.. చనిపోయిన నెహ్రు గురించి మాట్లాడుతున్నారు. గద్దె ఎక్కడికి వెళ్లినా ఏం చేశావని ప్రజలు నిలదీస్తున్నారు.
- Naga Srinivasa Rao Poduri
- Published On : May 4, 2024 / 03:11 PM IST
Devineni Avinash: జగన్ ప్రభుత్వం చేసిన పనులను టీడీపీ నాయకులు తమవిగా చెప్పుకుంటున్నారని విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఆరోపించారు. విజయవాడలో శనివారం ఆయన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ హయాంలో తూర్పు నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి జరిగిందని చెప్పారు. చిన్న సమస్య ఉన్నా సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించామని తెలిపారు.
అలా చెప్పు కోవడానికి సిగ్గు లేదా?
”కృష్ణ కరకట్ట వద్ద రిటైనింగ్ వాల్ నిర్మాణం చిరకాల కోరిక. 2019లో వరదలు వచ్చినప్పుడు సీఎం జగన్ ను కలసి రిటైనింగ్ వాల్ కావాలని అడిగాం. ఆయన పాదయాత్రలో హామీ ఇచ్చానని చేసి చూపించిన ఘనత జగన్ కే దక్కుతుంది. మేం చేసిన పనులను టీడీపీ నేతలు చేశామని చెప్పు కోవడానికి సిగ్గు లేదా? ప్రతి డివిజన్ లో ఎన్నికోట్ల రూపాయల అభివృద్ధి జరిగిందో వివరిస్తాం. అభివృద్ధి చేశాం కాబట్టే ప్రజలు మాకు మద్ధతు తెలుపుతున్నారు. ముస్లింల చిరకాల కోరిక షాదీఖానా.. సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాగానే రూ. 2 కోట్లు కేటాయించారు. రెడ్డిస్ నగర్‌లో ఇళ్ల పెట్టాలిచ్చిన ఘనత సీఎం జగన్‌దే. ప్రతిపక్షం కుల రాజకీయాలతో ప్రజల వద్దకు వెళ్తుంటే.. మేము సంక్షేమం చేశాం కాబట్టే ప్రజల వద్దకు వెళ్తున్నాం.
గద్దె రామ్మోహన్ ఒక అసమర్ధ ఎమ్మెల్యే. మాటలతో, షో రాజకీయాలతో పబ్బం గడుపుతున్నారు. నియోజవర్గానికి కోటి రూపాయిలు కూడా శాంక్షన్ చేయించలేక పోయాడు. నాలుగున్నరేళ్లలో నాలుగు సార్లు నియోజకవర్గం మొత్తం తిరిగి సమస్యలు అడిగి పరిష్కరించాను. గద్దె తూర్పు నియోజకవర్గాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు. గద్దె, టీడీపీ నేతలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. నాపైన ప్రచారం చేయడానికి ఏంలేక.. చనిపోయిన నెహ్రు గురించి మాట్లాడుతున్నారు. గద్దె ఎక్కడికి వెళ్లినా ఏం చేశావని ప్రజలు నిలదీస్తున్నారు. అందుకే ఆయన ప్రచారం చేయడం లేదు. తూర్పు నియోజకవర్గంలో కాంట్రాక్టులన్నీ గద్దె తమ్ముడే చూస్తారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మేము అభివృద్ధి చేస్తుంటే గద్దె సోదరులు ఆపుతున్నారు. నెహ్రు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం. అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా ఎవరి ఏ కష్టం వచ్చినా మేమున్నామంటూ ఆదుకున్నాం. టీడీపీ ఆఫీస్ లోంచి జగన్ తల్లిని తిడితే అది తట్టుకోలేక చాలామంది కార్యకర్తలు వాళ్ళ ఆఫీస్ పైకి వెళ్లారు. జగన్‌ను ఎవరైనా విమర్శిస్తే అది తట్టుకోలేక ఎదురుతిరిగితే వాళ్ళంత నా వాళ్లేన”ని దేవినేని అవినాష్ అన్నారు.
