Chinta Mohan : జగన్ నాలుగేళ్ల పాలనలో హత్యలు, ఆత్మహత్యలు, జైళ్లు, బెయిళ్లు : చింతా మోహన్

చంద్రబాబు ఓ తొందరబాబు. టీచర్స్ చేయాల్సిన పనులు జగన్ చేస్తున్నారు.జగన్ వచ్చే ఎన్నికల్లో కనీసం 20-30 సీట్లకు మించి రావు..చంద్రబాబును ప్రజలు నమ్మటంలేదు. ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. సీఎంగా కాపులు, ఓబీసీలకు అవకాశం ఇస్తుంది.

Chinta Mohan

Chinta Mohan – CM Jagan Govt : ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చింతా మోహన్ విమర్శలు గుప్పించారు. జగన్ ఈ నాలుగేళ్ల పాలనలో హత్యలు, ఆత్మహత్యలు, జైళ్లు, బెయిల్ తప్ప మరేమీ లేవని.. అభివృద్ధి అనేదేలేదు అంటూ విమర్శించారు. అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని.. ప్రైమరీ స్కూల్ లో టీచర్స్ చేయాల్సిన పనులు జగన్ చేస్తున్నారు అంటూ సెటైర్లు వేశారు. జగన్ కు వచ్చే ఎన్నికల్లో కనీసం 20-30 సీట్లకు మించి రావు అంటూ జోస్యం చెప్పారు.

14 ఏళ్ల పాలనలో చంద్రబాబు చేసిందేమీ లేదు..
మాజీ సీఎం చంద్రబాబుపై కూడా చింతా మోహన్ విమర్శలు సంధించారు. ”చంద్రబాబు ఒక తొందర బాబు నాయుడు. 14 ఏళ్ల పాలనలో బాబు చేసింది కూడా ఏమీలేదు. ఇంకో ఐదేళ్ల అధికారం కోసం తిప్పలు పడుతున్నారు. తెలుగుదేశం పార్టీతో చంద్రబాబుకు ఏం సంబంధం? ఎన్టీఆర్ కి ద్రోహం చేసి జెండా పట్టుకు తిరుగుతున్నారు. ఏపీలో ఎస్సీ ఎస్టీ మైనారిటీలు జగన్, చంద్రబాబుకు ఓటేసే పరిస్థితి లేదన్నారు. వారంతా కొత్త ముఖం కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ కి ద్రోహం చేసి ముఖ్యమంత్రి పదవి తీసుకుని ఇప్పుడు ఎన్టీఆర్ కి ద్రోహం చేసి శత జయంతి ఉత్సవాలు జరుపుతున్నారు” అంటూ చంద్రబాబుపై విమర్శలు చేశారు.

Modi 9 Years Govt : తొమ్మిదేళ్ల బీజేపీ పాలనలో ఆకలి, దరిద్రం, నిరుద్యోగం మాత్రమే కనిపిస్తున్నాయ్ : చింతా మోహన్

తెలంగాణ, ఏపీల్లోనూ కర్ణాటక ఫలితాలే 
ఏపీ, తెలంగాణలో కాంగ్రెస్ గెలిచి అధికారం చేపడుతుందని చింతా మోహన్ దీమా వ్యక్తంచేశారు. కర్ణాటకలో విజయం సాధించినట్లుగానే తెలంగాణలోను కాంగ్రెస్ విజయం సాధిస్తుందని అలాగే ఏపీలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెండున్నరేళ్లు కాపులకు, మరో రెండున్నరేళ్ళు ఓబీసీలకు అధికారం ఇస్తాం అని అన్నారు. దాని కోసం తమ పార్టీతో మాట్లాడి ఒప్పిస్తానని అన్నారు. ఒప్పించగలను అనే నమ్మకం తనకుందన్నారు. ఇన్నేళ్లలో కేవలం రెండు వర్గాలకు మాత్రమే అధికారం లభించిందని.. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ పరిస్థితి మారుతుందన్నారు.

చంద్రబాబు, జగన్ పై ప్రజలకు నమ్మకం లేదని.. 119 స్థానాల్లో 80 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందుతుందని దీమా వ్యక్తంచేశారు. ఏపీలో కాంగ్రెస్ పవనాలు వీస్తున్నాయని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రెండున్నర సంవత్సరాలు కాపులకు రెండున్నర సంవత్సరాలు ఓబీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తాం.. మరి చంద్రబాబు ,జగన్ ఇలా ముఖ్యమంత్రి పదవి ఇవ్వగలరా అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఏపీలో అధికారం చూడని వర్గాలు 90 శాతం ఉన్నాయని.. పార్టీ హైకమాండ్ తో ఏపీలో ముఖ్యమంత్రి పదవుల గురించి మాట్లాడే దమ్ము తకుందని అన్నారు.

పేదల ఆకాంక్షలు నెరవేర్చేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే
1991లో పంజాబ్ లో ప్రజాస్వామ్యాన్ని తీసుకువచ్చామని.. అలాగే ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీని తీసుకువస్తామని అన్నారు. ”ఏపీలో ధరలు పెరిగిపోయాయి.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. బీజేపీకి కేంద్రంలో 100-125 స్థానాలు మాత్రమే వస్తాయి. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసిపోయాయి. చంద్రబాబు తొందరబాబు… అనవసరంగా వెళ్లి బీజేపీని కలిసారు .బీజేపీ సహకారం లేకపోతే ఏపీలో వైసీపీ ప్రభుత్వం నిలబడదు. ఏపీలో పేదల ఆకాంక్షలు నెరవేర్చేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని” అన్నారు.

ట్రెండింగ్ వార్తలు